విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో ఓ యువ పేస్ బౌలర్ దుమ్ములేపుతున్నాడు. తన ఫాస్ట్ బౌలింగ్‌తో బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. వెటరన్ భువనేశ్వర్ కుమార్‌ను తలపించే స్వింగ్ బౌలింగ్‌తో దూసుకుపోతున్నాడు. తన సంచలన బౌలింగ్‌తో పవర్ ప్లే స్పెషలిస్టుగా ప్రశంసలు అందుకుంటున్నాడు. అతడే బరోడాకు చెందిన యువ పేస్ సంచలనం రాజ్ లింబానీ.
బెంగాల్‌పై అదుర్స్..
దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ ప్రస్తుత సీజన్‌లో లింబానీ అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. అస్సాంతో జరిగిన తొలి మ్యాచ్‌లో 3 వికెట్లతో సత్తాచాటిన రాజ్.. ఇప్పుడు శుక్రవారం బెంగాల్‌పై 5 వికెట్ల హాల్‌తో మెరిశాడు. అతడి బౌలింగ్ ధాటికి బెంగాల్ జట్టు కేవలం 205 పరుగులకే కుప్పకూలింది.
ఆరంభంలో బెంగాల్ కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్‌ను అద్భుతమైన బంతితో బోల్తా కొట్టించిన లింబానీ.. ఆ తర్వాత షాబాజ్ ఆహ్మద్ వంటి కీలక ప్లేయర్లను ఔట్ చేశాడు. మొత్తంగా తన పది ఓవర్ల కోటాలో 65 పరుగులిచ్చి 5 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. తన అద్భుత ప్రదర్శనకు గాను లింబానీకి ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ టోర్నీలో లింబాని(8) సెకెండ్ లీడింగ్ వికెట్ టేకర్‌గా కొనసాగుతున్నాడు. దీంతో ఎవరీ రాజ్ లింబానీ అని నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు.
ఎవరీ రాజ్ లింబాని?
20 ఏళ్ల రాజ్ లింబాని.. గుజరాత్‌లోని కచ్‌లో జన్మించాడు. దేశవాళీ క్రికెట్‌లో బరోడాకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. రాజ్ రైట్ ఆర్మ్ పేస్ బౌలర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అండర్-19 ప్రపంచకప్ 2024లో భారత జట్టు తరపున ఆడి తన అద్భుతమైన 'ఇన్‌స్వింగర్ల'తో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆసియాకప్‌లోనూ భారత అండర్-19 జట్టకు ప్రాతినిథ్యం వహించాడు. ఆసియా కప్‌లో నేపాల్‌పై కేవలం 13 పరుగులు ఇచ్చి 7 వికెట్లు పడగొట్టి చరిత్ర సృష్టించాడు.
తన స్వింగ్ బౌలింగ్‌తో జానియర్ భువీగా అతడు పేరు సంపాదించుకున్నాడు. అయితే ఐపీఎల్-2026 వేలంలో మాత్రం రాజ్ లింబానికి నిరాశే ఎదురైంది. రూ. 30 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన అతడిని ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు. దీంతో అతడు అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు.
అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న లింబానిని ఏ ఫ్రాంచైజీ తీసుకోకపోవడం అందరిని ఆశ్చర్యపరిచింది. అయితే ఎవరైనా గాయపడితే అతడిని రిప్లేస్‌మెంట్‌గా తీసుకునే అవకాశముంది. ఐపీఎల్-2025లో లింబాని గుజరాత్ టైటాన్స్ నెట్‌బౌలర్‌గా తన సేవలు అందించాడు. అతడు ఇప్పటివరకు డొమాస్టిక్ క్రికెట్‌లో 25 మ్యాచ్‌లు 39 వికెట్లు పడగొట్టాడు.
చదవండి: VHT 2025-26: సచిన్ కొడుకు అట్టర్ ప్లాప్.. ఉతికారేశారు


