దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో సౌరాష్ట్ర సెమీ ఫైనల్‌కు దూసుకువెళ్లింది. ఉత్తరప్రదేశ్ జట్టుతో జరిగిన రెండో క్వార్టర్ ఫైనల్లో వీజేడీ పద్ధతిలో 17 పరుగుల తేడాతో గెలిచి సెమీస్ ఖరారు చేసుకుంది.
రింకూ విఫలం
బెంగళూరు వేదికగా ముందుగా ఉత్తరప్రదేశ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 310 పరుగులు చేసింది. అభిషేక్ గోస్వామి (82 బంతుల్లో 88; 12 ఫోర్లు), సమీర్ రిజ్వీ (77 బంతుల్లో 88 నాటౌట్; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరిపించారు. కెప్టెన్ రింకూ సింగ్ (20 బంతుల్లో 13)మాత్రం తీవ్రంగా నిరాశపరిచాడు.
హార్విక్ దేశాయ్ సెంచరీతో
సౌరాష్ట్ర బౌలర్లలో చేతన్ సకారియా 3 వికెట్లు... అంకుర్ పన్వర్, ప్రేరక్ మన్కడ్ 2 వికెట్లు తీశారు. 311 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన సౌరాష్ట్ర 40.1 ఓవర్లలో 3 వికెట్లకు 238 పరుగులు సాధించింది. ఓపెనర్ హార్విక్ దేశాయ్ (116 బంతుల్లో 100 నాటౌట్; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ సెంచరీ చేశాడు.
ప్రేరక్ మన్కడ్ (66 బంతుల్లో 67; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించాడు. చిరాగ్ జానీ (31 బంతుల్లో 40 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడాడు. సౌరాష్ట్ర స్కోరు 238/3 వద్ద భారీ వర్షం రావడం, ఆ తర్వాత తగ్గకపోవడంతో వీజేడీ పద్ధతిని అనుసరించి విజేతను నిర్ణయించారు. ఆట నిలిచిపోయే సమయానికి సౌరాష్ట్ర విజయసమీకరణం కంటే 17 పరుగులు ముందంజలో ఉండటంతో ఆ జట్టుకు విజయం దక్కింది.
పడిక్కల్ జోరు.. కర్ణాటక నాలుగోసారి
డిఫెండింగ్ చాంపియన్ కర్ణాటక జట్టు వరుసగా నాలుగోసారి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. బెంగళూరులో ముంబై జట్టుతో సోమవారం జరిగిన తొలి క్వార్టర్ ఫైనల్లో కర్ణాటక జట్టు వీజేడీ పద్ధతిలో 54 పరుగుల ఆధిక్యంతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 254 పరుగులు సాధించింది. షమ్స్ ములానీ (91 బంతుల్లో 86; 8 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
కెప్టెన్ సిద్దేశ్ లాడ్ (58 బంతుల్లో 38; 4 ఫోర్లు), సాయిరాజ్ పాటిల్ (25 బంతుల్లో 33 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించారు. ముంబై స్టార్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు.
కర్ణాటక బౌలర్లలో విద్యాధర్ పాటిల్ (3/42), అభిలాశ్ శెట్టి (2/59), విద్వత్ కావేరప్ప (2/43) రాణించారు. అనంతరం 255 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కర్ణాటక 33 ఓవర్లలో 1 వికెట్ కోల్పోయి 187 పరుగులు చేసింది.
కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (12) తక్కువ స్కోరుకే అవుటవ్వగా... దేవ్‌దత్ పడిక్కల్ (95 బంతుల్లో 81 నాటౌట్; 11 ఫోర్లు), కరుణ్ నాయర్ (80 బంతుల్లో 74 నాటౌట్; 11 ఫోర్లు) రెండో వికెట్‌కు 143 పరుగులు జోడించారు. కర్ణాటక విజయం దిశగా సాగుతున్న దశలో భారీ వర్షం రావడంతో ఆట నిలిచిపోయింది.
వర్షం తగ్గకపోవడంతో వీజేడీ పద్ధతిని అనుసరించి విజేతను నిర్ణయించారు. వీజేడీ పద్ధతి ప్రకారం 33 ఓవర్లకు కర్ణాటక విజయసమీకరణం 132 పరుగులు. కర్ణాటక 55 పరుగులు ముందుండటంతో ఆ జట్టును గెలుపు వరించింది.
చదవండి: భారత్‌పై నిందలు!.. బంగ్లాదేశ్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన ఐసీసీ!


