ముంబై ఇండియన్స్ జెర్సీలో అర్జున్
విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో గోవా జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. శుక్రవారం జైపూర్ వేదికగా హిమాచల్ ప్రదేశ్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో 8 పరుగుల తేడాతో గోవా గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన గోవా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 285 పరుగులు చేసింది.
గోవా బ్యాటర్లలో లలిత్ యాదవ్ (104) అద్భుతమైన సెంచరీతో చెలరేగగా.. కెప్టెన్ దీపరాజ్ గాంకర్(71) హాఫ్ సెంచరీతో సత్తాచాటాడు. హిమాచల్ బౌలర్లలో రోహిత్ కుమార్ ఐదు వికెట్లు పడగొట్టగా.. మిర్దుల్ రెండు వికెట్లు సాధించాడు. అనంతరం లక్ష్య చేధనలో హిమాచల్ ప్రదేశ్ 49.3 ఓవర్లలో 277 పరుగులకు ఆలౌటైంది.
మిడిలార్డర్ బ్యాటర్లు పి. రాజ్‌మన్(126) తన అద్భుతపోరాటంతో జట్టును విజయతీరాల దాకా తీసుకెళ్లినప్పటికి.. ఆఖరిలో వికెట్లు కోల్పోవడంతో హిమాచల్ ఓటమిచవిచూడాల్సి వచ్చింది. గోవా బౌలర్లలో దీపరాజ్ గాంకర్ 5 వికెట్లతో సత్తాచాటాడు. బ్యాటింగ్ బౌలింగ్‌లో దుమ్ములేపిన దీపరాజ్ ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచాడు.
అర్జున్ అట్టర్ ప్లాప్..
అయితే ఈ మ్యాచ్‌లో గోవా ఆల్‌రౌండర్, సచిన్ తనయుడు అర్జున్ టెండూల్కర్ దారుణంగా విఫలమయ్యాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఓపెనర్‌గా బరిలోకి దిగిన అర్జున్.. విజయ్ హజారే ట్రోఫీలో మాత్రం లోయార్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చాడు. బ్యాటింగ్‌లో అతడికి కేవలం ఒక్క బంతి మాత్రమే ఆడే అవకాశం దక్కింది.
కానీ బౌలింగ్‌లో మాత్రం తన మార్క్ చూపించలేకపోయాడు. 6 ఓవర్లు బౌలింగ్ చేసిన అర్జున్.. 9.70 ఏకానమి రేటుతో ఏకంగా 58 పరుగులు సమర్పించుకున్నాడు. భారీగా పరుగులు ఇవ్వడంతో అర్జున్‌తో తన పూర్తి కోటాను కెప్టెన్ పూర్తి చేయించలేదు. తొలి మ్యాచ్‌కే బెంచ్‌కే పరిమితమైన అర్జున్‌కు హిమాచల్‌పై ఆడే అవకాశం లభించింది.
కానీ తనకు దక్కిన అవకాశాన్ని ఈ జూనియర్ టెండూల్కర్ అందిపుచ్చుకోలేకపోయాడు. అంతకుముందు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అర్జున్ ఫర్వాలేదన్పించాడు. కాగా ఐపీఎల్-2026లో అర్జున్ లక్నో సూపర్ జెయింట్స్‌కు ప్రాతినిథ్యం వహించనున్నాడు. ముంబై ఇండియన్స్ నుంచి అతడిని లక్నో ట్రేడ్ చేసుకుంది.
చదవండి: IND vs NZ: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. టీమిండియా కెప్టెన్ ఎవరంటే?


