60 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్‌లతో 106 నాటౌట్
చండీగఢ్‌పై ఉత్తరప్రదేశ్ భారీ విజయం
విజయ్ హజారే వన్డే టోర్నీ
రాజ్‌కోట్: భారత ఆటగాడు రింకూ సింగ్ (60 బంతుల్లో 106 నాటౌట్; 11 ఫోర్లు, 4 సిక్స్‌లు) అజేయ సెంచరీతో చెలరేగాడు. వచ్చే ఏడాది జరగనున్న ఐసీసీ టి20 ప్రపంచకప్ కోసం ప్రకటించిన భారత జట్టులో చోటు దక్కించుకున్న రింకూ సింగ్... మిడిలార్డర్‌లో మెరుపులు మెరిపించాడు. ఫలితంగా ఎలైట్ గ్రూప్ ‘బి’లో భాగంగా జరిగిన పోరులో ఉత్తర ప్రదేశ్ జట్టు 227 పరుగుల భారీ తేడాతో చండీగఢ్‌ను చిత్తు చేసింది.
మొదట ఉత్తర ప్రదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లకు 367 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఆర్యన్ జుయల్ (118 బంతుల్లో 134; 7 ఫోర్లు, 8 సిక్స్‌లు) సెంచరీతో జట్టుకు గట్టి పునాది వేయగా... దానిపై రింకూ సింగ్ భారీ స్కోరు నిలబెట్టాడు. ధ్రువ్ జురేల్ (57 బంతుల్లో 67; 11 ఫోర్లు) హాఫ్ సెంచరీతో రాణించాడు.
అనంతరం లక్ష్యఛేదనలో చండీగఢ్ 29.3 ఓవర్లలో 140 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ మనన్ వోహ్రా (32; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్ కాగా... మిగిలిన వాళ్లంతా విఫలమయ్యారు. ఉత్తరప్రదేశ్ బౌలర్లలో జీషాన్ అన్సారీ 4 వికెట్లు పడగొట్టాడు. ఇదే గ్రూప్‌లో భాగంగా జరిగిన ఇతర మ్యాచ్‌ల్లో జమ్మూ కశీ్మర్ 142 పరుగుల తేడాతో అస్సాంపై... బరోడా 4 వికెట్ల తేడాతో బెంగాల్‌పై విజయాలు సాధించాయి.
కరుణ్ నాయర్, పడిక్కల్ సెంచరీలు
భారత ఆటగాళ్లు కరుణ్ నాయర్ (130 బంతుల్లో 130 నాటౌట్; 14 ఫోర్లు), దేవదత్ పడిక్కల్ (137 బంతుల్లో 124; 12 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీలతో కదంతొక్కడంతో విజయ్ హజారే ట్రోఫీ వన్డే టోర్నమెంట్‌లో కర్ణాటక జట్టు వరుసగా రెండో విజయం ఖాతాలో వేసుకుంది. ఎలైట్ గ్రూప్ ‘ఎ’లో భాగంగా శుక్రవారం జరిగిన పోరులో డిఫెండింగ్ చాంపియన్ కర్ణాటక 8 వికెట్ల తేడాతో కేరళపై విజయం సాధించింది.
మొదట బ్యాటింగ్ చేసిన కేరళ జట్టు 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది. మొహమ్మద్ అజహారుద్దీన్ (58 బంతుల్లో 84; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), బాబా అపరాజిత్ (62 బంతుల్లో 71; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) హాఫ్ సెంచరీలు సాధించారు. అనంతరం లక్ష్యఛేదనలో కర్ణాటక జట్టు 48.2 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 285 పరుగులు చేసింది.
‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కరుణ్ నాయర్, దేవదత్ పడిక్కల్ ఆడుతూ పాడుతూ పరుగులు రాబట్టారు. ఇదే గ్రూప్‌లో భాగంగా జరిగిన ఇతర మ్యాచ్‌ల్లో మధ్యప్రదేశ్ జట్టు 2 వికెట్ల తేడాతో తమిళనాడుపై, జార్ఖండ్ 73 పరుగుల తేడాతో రాజస్తాన్‌పై... త్రిపుర 7 వికెట్ల తేడాతో పుదుచ్చేరిపై గెలుపొందాయి.
అన్‌మోల్, హర్‌నూర్ శతకాలు
ఎలైట్ గ్రూప్ ‘సి’లో పంజాబ్ జట్టు వరుసగా రెండో విజయం నమోదు చేసుకుంది. శుక్రవారం జరిగిన పోరులో పంజాబ్ 9 వికెట్ల తేడాతో ఛత్తీస్‌గఢ్‌పై నెగ్గింది. మొదట ఛత్తీస్‌గఢ్ 48.4 ఓవర్లలో 253 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ అమన్‌దీప్ ఖరే (76; 4 ఫోర్లు, 1 సిక్స్), మయాంక్ వర్మ (64; 8 ఫోర్లు) హాఫ్ సెంచరీలు సాధించారు. అనంతరం పంజాబ్ 42.1 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 254 పరుగులు చేసి గెలిచింది.
‘ప్లేయర్ ఆప్ ద మ్యాచ్’ హర్‌నూర్ సింగ్ (114 బంతుల్లో 115 నాటౌట్; 12 ఫోర్లు, 2 సిక్స్‌లు), అన్‌మోల్‌ప్రీత్ సింగ్ (96 బంతుల్లో 105 నాటౌట్; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు) అజేయ శతకాలతో జట్టును గెలిపించారు. ఇదే గ్రూప్‌లో భాగంగా జరిగిన ఇతర మ్యాచ్‌ల్లో మహారాష్ట్ర 8 వికెట్ల తేడాతో సిక్కింపై... గోవా 8 పరుగుల తేడాతో హిమాచల్ ప్రదేశ్‌పై విజయాలు సాధించాయి.
ఎలైట్ గ్రూప్ ‘డి’లో భాగంగా జరిగిన మ్యాచ్‌ల్లో హరియాణా 6 వికెట్ల తేడాతో సౌరాష్ట్ర పై... ఒడిశా 4 వికెట్ల తేడాతో సర్వీసెస్‌పై గెలుపొందాయి. ప్లేట్ గ్రూప్‌లో బిహార్ జట్టు 15 పరుగుల తేడాతో మణిపూర్‌పై నెగ్గింది. బిహార్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ‘ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్’ అందుకోవడానికి ఢిల్లీ వెళ్లడంతో ఈ మ్యాచ్‌లో ఆడలేదు.


