ఒకే రోజు 20 వికెట్లు
రెండు జట్ల తొలి ఇన్నింగ్స్ పూర్తి
ఆస్ట్రేలియా 152 ఆలౌట్
జోష్ టంగ్‌కు 5 వికెట్లు
ఇంగ్లండ్ 110 ఆలౌట్
మెరిసిన నెసెర్, బోలాండ్, స్టార్క్
‘బాక్సింగ్ డే’ టెస్టు
మెల్‌బోర్న్: ఆ్రస్టేలియా, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న ‘యాషెస్’ సిరీస్ నాలుగో టెస్టులో బౌలర్ల జోరు కొనసాగుతోంది. పచ్చికతో కూడిన పిచ్‌పై ఆట తొలి రోజే 20 వికెట్లు నేలకూలి రెండు జట్ల తొలి ఇన్నింగ్స్‌లు ముగిశాయి. మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ దాదాపు లక్ష మంది అభిమానుల సమక్షంలో జరిగిన పోరులో... ఇరు జట్ల బౌలర్లు బంతితో నిప్పులు చెరిగారు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇప్పటికే ఆడిన తొలి మూడు టెస్టుల్లో నెగ్గిన ఆ్రస్టేలియా సిరీస్‌ను 3–0తో సొంతం చేసుకుంది.
శుక్రవారం ప్రారంభమైన ‘బాక్సింగ్ డే’ టెస్టులో టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆతిథ్య ఆ్రస్టేలియా తొలి ఇన్నింగ్స్‌లో 45.2 ఓవర్లలో 152 పరుగులకు ఆలౌటైంది. నెసెర్ (49 బంతుల్లో 35; 7 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా... ఉస్మాన్ ఖ్వాజా (29), అలెక్స్ కేరీ (20) తలా కొన్ని పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్ 5 వికెట్లు పడగొట్టగా... అట్కిన్సన్ 2 వికెట్లు తీశాడు.
అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ కూడా ప్రత్యర్థి పేస్‌కు దాసోహమైంది. 29.5 ఓవర్లలోనే 110 పరుగులకు ఆలౌటైంది. హ్యారీ బ్రూక్ (34 బంతుల్లో 41; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఒక్కడే కాస్త పోరాడగా... అట్కిన్సన్ (28), కెపె్టన్ బెన్ స్టోక్స్ (16) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. ఆసీస్ బౌలర్లలో నెసెర్ 4 వికెట్లు పడగొట్టగా... బోలాండ్ 3, స్టార్క్ 2 వికెట్లు తీశారు.
అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ శుక్రవారం తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఒక ఓవర్‌లో వికెట్ నష్టపోకుండా 4 పరుగులు చేసింది. స్కాట్ బోలాండ్ (4 బ్యాటింగ్), ట్రావిస్ హెడ్ (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. చేతిలో 10 వికెట్లు ఉన్న ఆ్రస్టేలియా... ఓవరాల్‌గా 46 పరుగుల ఆధిక్యంలో ఉంది.
ఒకరి వెంట ఒకరు...
గత మూడు మ్యాచ్‌ల్లో గెలిచి ఫుల్ జోష్‌లో ఉన్న ఆ్రస్టేలియాకు... ఈ మ్యాచ్‌లో శుభారంభం దక్కలేదు. ట్రావిస్ హెడ్ (12), జేక్ వెదరాల్డ్ (10) పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. లబుషేన్ (6) విఫలం కాగా... కెపె్టన్ స్టీవ్ స్మిత్ (31 బంతుల్లో 9) క్రీజులో నిలిచే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. దీంతో ఆసీస్ 51 పరుగులకే 4 ప్రధాన వికెట్లు కోల్పోయింది. ఈ దశలో ఖ్వాజా, కేరీ కాస్త ప్రతిఘటన కనబర్చారు. క్రీజులో పాతుకుపోయి పరుగులు రాబట్టే ప్రయత్నం చేశారు.
అయితే పిచ్ నుంచి లభిస్తున్న సహకారాన్ని వినియోగించుకున్న ఇంగ్లండ్ బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు పడగొడుతూ... కంగారూలపై ఒత్తిడి పెంచారు. ఇటీవల ఐపీఎల్ వేలంలో రికార్డు ధర దక్కించుకున్న కామెరాన్ గ్రీన్ (17) కూడా ప్రభావం చూపలేకపోగా... ఆఖర్లో నెసెర్ ధాటిగా ఆడాడు. గ్రీన్, నేసెర్ ఏడో వికెట్‌కు 52 పరుగులు జోడించడంతో ఆసీస్ ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. ఈ క్రమంలో ఇంగ్లండ్ పేసర్ జోష్ టంగ్ కెరీర్ అత్యుత్తమ గణాంకాలు (5/45) నమోదు చేసుకున్నాడు.
తీరు మారని ఇంగ్లండ్...
చక్కటి బౌలింగ్‌తో ప్రత్యర్థిని కట్టడి చేసి సిరీస్‌లో తొలిసారి ఆధిపత్యం కనబర్చే అవకాశాన్ని ఇంగ్లండ్ వినియోగించుకోలేకపోయింది. జాక్ క్రాలీ (5), బెన్ డకెట్ (2), జాకబ్ బెథెల్ (1), జో రూట్ (0) ఇలా ఒకరి తర్వాత ఒకరు పెవిలియన్ బాట పట్టడంతో ఇంగ్లండ్ జట్టు 16 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లో డకెట్‌ను అవుట్ చేసిన స్టార్క్... తన తదుపరి ఓవర్‌లో క్రాలీని బుట్టులో వేసుకున్నాడు. ఈ మధ్య డకెట్‌ను నెసెర్ అవుట్ చేయగా... 15 బంతులాడి ఖాతా తెరవలేకపోయిన రూట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ దశలో బ్రూక్ కౌంటర్ ఎటాక్‌కు ప్రయత్నించి కొంత ఫలితం సాధించాడు.
కెపె్టన్ స్టోక్స్‌తో కలిసి చక్కటి షాట్‌లతో ఐదో వికెట్‌కు 50 పరుగులు జోడించాడు. బోలాండ్ బౌలింగ్‌లో బ్రూక్ వికెట్ల ముందు దొరికిపోగా... తక్కినవాళ్లు అతడిని అనుసరించారు. ఆఖర్లో అట్కిన్సన్ కొన్ని షాట్స్ ఆడి జట్టు స్కోరును వంద పరుగులు దాటించాడు. దీంతో ఆసీస్‌కు 42 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.
94,199 ఈ మ్యాచ్‌కు తొలి రోజు ప్రత్యక్షంగా వీక్షించిన అభిమానుల సంఖ్య. మెల్‌బోర్న్ క్రికెట్ స్టేడియంలో ఇదే అత్యధికం. ఆ్రస్టేలియా, న్యూజిలాండ్ మధ్య 2015 వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌కు 93,013 మంది హాజరయ్యారు. తాజాగా ఆ రికార్డు బద్దలైంది.
3468 టెస్టు క్రికెట్‌లో 3000 వేల పరుగులు పూర్తి చేసుకునేందుకు హ్యారీ బ్రూక్‌కు అవసరమైన బంతులు. ఆ్రస్టేలియా మాజీ ప్లేయర్ గిల్‌క్రిస్ట్ 3610 బంతుల్లో ఈ మార్క్ అందుకున్నాడు.
4 మెల్‌బోర్న్ మైదానంలో ఇప్పటి వరకు జరిగిన టెస్టుల్లో తొలి రోజే 20 అంతకంటే ఎక్కువ వికెట్లు నేలకూలడం ఇది నాలుగోసారి. 1894లో ఆ్రస్టేలియా–ఇంగ్లండ్ టెస్టు తొలి రోజు 20 వికెట్లు... 1902లో ఆ్రస్టేలియా–ఇంగ్లండ్ టెస్టు తొలి రోజు 25 వికెట్లు...1932లో ఆస్ట్రేలియా–దక్షిణాఫ్రికా టెస్టు తొలి రోజు 20 వికెట్లు పడ్డాయి.


