ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ తిరిగి మైదానంలో అడుగుపెట్టేందుకు సిద్దమయ్యాడు. వెన్నెముక గాయం నుంచి కమ్మిన్స్ పూర్తిగా కోలుకున్నాడు. యాషెస్ సిరీస్ 2025-26లో భాగంగా మూడో టెస్టుకు కమ్మిన్స్ అందుబాటులోకి రానున్నాడు.
ఈ విషయాన్ని కమ్మిన్సే స్వయంగా ధ్రువీకరించాడు. వాస్తవానికి ప్రస్తుతం బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్న పింక్ బాల్ టెస్ట్‌లో ఈ స్టార్ ఆల్‌రౌండర్ ఆడాల్సి ఉండేది. కానీ ఆఖరి నిమిషంలో ముందుస్తు జాగ్రత్తగా అతడిని ప్లేయింగ్ ఎలెవన్‌లోకి తీసుకోలేదు.
ఇప్పుడు పూర్తి ఫిట్‌నెస్ సాధించడంతో తన బౌలింగ్ ప్రాక్టీస్‌ను కమ్మిన్స్ మొదలు పెట్టాడు. స్టార్ పేసర్ జోష్ హాజిల్‌వుడ్ సేవలను కోల్పోయిన ఆసీస్‌కు కమ్మిన్స్ రీ ఎంట్రీ కాస్త ఉపశమనం కలిగించే ఆంశంగా చెప్పుకోవాలి.
"ఆడిలైడ్ టెస్టుకు సిద్దమవుతున్నాను. ఆదివారం(డిసెంబర్ 7) మరోసారి బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తాను. ఆ తర్వాత అడిలైడ్ వెళ్లాక కూడా నెట్స్‌లో బౌలింగ్ చేస్తాను. ప్రస్తుతం ఫిట్‌గా ఉన్నారు. నా శరీరం కూడా అద్భుతంగా సహకరిస్తోంది. ఈ గ్యాప్‌లో ఎటువంటి సమస్యలు రాకూడదని కోరుకుంటున్నానని" మూడో రోజు ఆట సందర్భంగా ఫాక్స్ క్రికెట్‌తో కమిన్స్ చెప్పుకొచ్చాడు.
కమ్మిన్స్, హేజిల్‌వుడ్ లేకపోవడంతో బ్రెండన్ డాగెట్, స్కాట్ బోలాండ్, మైఖేల్ నేసర్‌లతో కూడిన పేస్ ధళానికి స్టార్క్ నాయకత్వం వహిస్తున్నాడు. తొలి టెస్టులో ఆసీస్ బౌలర్లు అదరగొట్టారు. రెండో టెస్టులో కూడా ఫర్వాలేదన్పిస్తున్నారు. ఇక ప్రతిష్టాత్మక సిరీస్‌లోని మూడో టెస్టు అడిలైడ్ ఓవల్ డిసెంబర్ 17 నుంచి ప్రారంభం కానుంది.
చదవండి: IND vs SA: చరిత్ర సృష్టించిన డికాక్.. ప్రపంచ క్రికెట్‌లోనే!


