బ్రిస్బేన్ వేదికగా ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న యాషెస్ రెండో టెస్టు రసవత్తరంగా సాగుతోంది. రెండో రోజు ఆటలో మాత్రం ఇంగ్లీష్ జట్టుపై కంగారులు పై చేయి సాధించారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 6 వికెట్లు కోల్పోయి 378 పరుగులు చేసింది.
ఆతిథ్య జట్టు ప్రస్తుతం 44 పరుగుల ఆధిక్యంలో ఉంది. క్రీజులో అలెక్స్ కారీ (46*), నీసర్(15*) ఉన్నారు. అదేవిధంగా ఆసీస్ టాపర్డర్ బ్యాటర్లు జేక్ వెదరాల్డ్ (72), మార్నస్ లబుషేన్ (65), స్టీవ్ స్మిత్ (61) హాఫ్ సెంచరీలతో రాణించారు. పెర్త్ టెస్టు హీరో ట్రావిస్ హెడ్ 33 పరుగులకే పరిమితయ్యాడు. ఇంగ్లండ్ బౌలర్లలో ఇప్పటివరకు బ్రైడన్ కార్స్ మూడు, స్టోక్స్ రెండు, ఆర్చర్ ఓ వికెట్ సాధించారు.
అంతకుముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో ఓవర్‌నైట్ స్కోర్(325/9)కు తొమ్మిది పరుగులు జోడించి 334 పరుగుల వద్ద ఆలౌటైంది. ఇంగ్లండ్ వెటరన్ బ్యాటర్ జో రూట్(138) అద్భుతమైన సెంచరీతో చెలరేగగా.. జాక్ క్రాలీ(76),ఆర్చర్(38) రాణించారు. ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ 6 వికెట్లతో సత్తాచాటాడు. కాగా తొలి టెస్టులో ఇంగ్లండ్‌ను ఆసీస్ చిత్తు చేసిన సంగతి తెలిసిందే.
చదవండి: పాక్ క్రికెటర్ ఫఖర్ జమాన్‌కు భారీ షాకిచ్చిన ఐసీసీ


