సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ నాకౌట్ మ్యాచ్‌లకు ముందు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ దేశవాళీ టీ20 టోర్నీ నాకౌట్ మ్యాచ్‌ల వేదికలను బీసీసీఐ మార్పు చేసింది. లాజిస్టికల్ సమస్యల కారణంగా భారత క్రికెట్ బోర్డు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.
వాస్తవానికి డిసెంబర్ 12 నుండి 18 వరకు మధ్యప్రదేశ్‌లోని ఇండోర్, హోల్కర్ క్రికెట్ స్టేడియం, ఎమరాల్డ్ హైస్కూల్ గ్రౌండ్‌లు ఫైనల్‌తో సహా 13 సూపర్ లీగ్ మ్యాచ్‌లకు ఆతిథ్యమివ్వాల్సి ఉంది. కానీ లాజిస్టికల్ సమస్యల కారణంగా మ్యాచ్‌లను నిర్వహించలేమని మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (MPCA) బీసీసీఐకి తెలియజేసింది.
డిసెంబర్ 9 నుంచి 12 వరకు ఇండోర్‌లో గ్లోబల్ డాక్టర్ల కాన్ఫరెన్స్ జరగడం వల్ల స్టార్ హోటల్స్ ఖాళీగా లేవు. దీంతో నాకౌట్ మ్యాచ్‌లు ఇప్పుడు పుణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (MCA) స్టేడియం, డివై పాటిల్ అకాడమీ వేదికగా జరగనున్నాయి.
బీసీసీఐకు సవాల్..
మరోవైపు ఇండిగో సంక్షోభం బీసీసీఐని సైతం కలవరపెడుతోంది. డీజీసీఏ కొత్తగా అమలు చేసిన ఫైలట్ రోస్టరింగ్ నియమాల కారణంగా సుమారు 1,000 విమానాలు రద్దు అయ్యాయి. దీంతో బీసీసీఐ కూడా తీవ్రమైన లాజిస్టికల్ సవాళ్లను ఎదుర్కొనే అవకాశముంది.
ప్రస్తుతం దక్షిణాఫ్రికా-భారత్ టీ20 సిరీస్‌తో పాటు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ కూడా జరుగుతోంది. నాలుగు గ్రూప్ స్టేజ్ వేదికలైన అహ్మదాబాద్, కోల్‌కతా, లక్నో, హైదరాబాద్ నుండి ఆటగాళ్లు, కోచ్‌లు, అంపైర్లు, అధికారులను పూణేకు బీసీసీఐ విమానాల్లో తరలించాలి. వీటితో ఇతర దేశీయ టోర్నమెంట్లు కూడా ప్రస్తుతం జరుగుతున్నాయి.
"ఇదే సంక్షోభం కొనసాగితే ఎనిమిది జట్లతో పాటు మ్యాచ్ అఫీషియల్స్‌ను నాకౌట్ మ్యాచ్‌ల కోసం పూణేకు విమానంలో తరలించడం సవాలుగా మారవచ్చు. అలాగే అహ్మదాబాద్‌లో మహిళల అండర్-23 T20 ట్రోఫీ, పురుషుల అండర్-19 కూచ్ బెహర్ ట్రోఫీ ప్రస్తుతం జరుగుతున్నాయి. ఈ టోర్నీల కోసం జట్లు, అంపైర్‌లు ఒక చోటు నుంచి మరొక చోటుకు ప్రయాణించాల్సి ఉందిష అని ఓ బీసీసీఐ అధికారి టైమ్స్ ఆఫ్ ఇండియాతో పేర్కొన్నారు.


