సౌతాఫ్రికా-భారత్ మధ్య మూడో వన్డేల సిరీస్‌లో కీలక పోరుకు సమయం అసన్నమైంది. శనివారం(డిసెంబర్ 6) వైజాగ్ వేదికగా సిరీస్ డిసైడర్ అయిన మూడో వన్డేలో ఇరు జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్ సొంతం చేసుకోవాలని భారత్ భావిస్తుంటే.. సౌతాఫ్రికా వన్డే సిరీస్‌ను కూడా సొంతం చేసుకోవాలని పట్టుదలతో ఉంది. ఈ ఆఖరి పోరులో భారత్ పలు మార్పులతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది.
సుందర్‌పై వేటు..
ఆల్‌రౌండర్‌గా జట్టులో చోటు దక్కించుకున్న వాషింగ్టన్ సుందర్ తొలి రెండు వన్డేలలోనూ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. మొదటి వన్డేలో 13, రాయ్‌పూర్‌లో కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి నిరాశపరిచాడు. బౌలింగ్‌లో కూడా ఈ తమిళనాడు ప్లేయర్ తేలిపోయాడు.
దీంతో అతడిపై వేటు వేయాలని గంభీర్ అండ్ కో సిద్దమైనట్లు సమాచారం. అతడి స్దానంలో స్పెషలిస్ట్ బ్యాటర్‌గా రిషబ్ పంత్ లేదా తిలక్ వర్మను తీసుకోవాలని టీమ్ మెనెజ్‌మెంట్ భావిస్తుందంట. మరోవైపు తీవ్ర నిరాశపరుస్తున్న ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ద్ కృష్ణను కూడా తప్పించనున్నట్లు తెలుస్తోంది.
అతడి స్దానంలో బ్యాటింగ్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్‌కు అవకాశమివ్వనున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. నితీశ్ జట్టులోకి వస్తే బ్యాటింగ్‌తో పాటు మీడియం పేస్‌తో బౌలింగ్ కూడా చేయగలడు. ఎలాగో స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా జట్టులో ఉంటారు.
అంతేకాకుండా యశస్వి జైశ్వాల్‌పై కూడా వేటు పడనున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడతున్నాయి. జైశ్వాల్ రెండు వన్డేలలోనూ దారుణంగా విఫలమయ్యాడు. కాగా కేఎల్ రాహుల్ సారథ్యంలోని భారత జట్టు రాయ్‌పూర్ వన్డేలో ఘోర పరాజయం పాలైంది. 359 పరుగుల భారీ లక్ష్యాన్ని మన బౌలర్లు కాపాడుకోలేకపోయారు.
సౌతాఫ్రికాతో మూడో వన్డేకు భారత తుది జట్టు(అంచనా)
రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, తిలక్ వర్మ/ రిషబ్ పంత్ , రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, రుతురాజ్ గైక్వాడ్, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్దీప్ సింగ్
చదవండి: ‘తిలక్, పంత్ ఉన్నా.. అతడిని నమ్మినందుకు క్రెడిట్ ఇవ్వాల్సిందే’


