వైస్ కెప్టెన్ స్మృతి మంధానతో దీప్తి శర్మ
భారత మహిళా క్రికెట్ జట్టు తొలి వన్డే వరల్డ్‌కప్ ట్రోఫీ గెలవడంలో దీప్తి శర్మది కీలక పాత్ర. ఈ మెగా ఈవెంట్ ఆసాంతం అద్భుత ప్రదర్శనలతో ఆకట్టుకున్న ఈ ఆల్‌రౌండర్.. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు గెలుచుకుంది. ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్-2025 టోర్నీలో దీప్తి మొత్తంగా 215 పరుగులు చేయడంతో పాటు.. 22 వికెట్ల కూల్చింది.
ముఖ్యంగా సౌతాఫ్రికాతో ఫైనల్లో దీప్తి శర్మ.. అర్ధ శతకం బాదడంతో పాటు.. ఏకంగా ఐదు వికెట్లు పడగొట్టి జట్టు గెలవడంలో కీలకంగా వ్యవహరించింది. ఈ నేపథ్యంలో మహిళల ప్రీమియర్ లీగ్ -2026 మెగా వేలంలోనూ దీప్తికి భారీ ధర దక్కింది.
వేలానికి ముందు ఈ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌ను వదిలేసిన యూపీ వారియర్స్.. ఏకంగా రూ. 3.2 కోట్లు వెచ్చించి తిరిగి ఆమెను సొంతం చేసుకుంది. తద్వారా డబ్ల్యూపీఎల్ వేలంలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన రెండో ప్లేయర్‌గా దీప్తి నిలిచింది.
ఇదిలా ఉంటే.. వరల్డ్‌కప్ విన్నింగ్ జట్టుతో కలిసి దీప్తి శర్మ.. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ నిర్వహించే ప్రముఖ షో.. ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’కి హాజరైంది. ఈ సందర్భంగా తాను క్రికెటర్‌గా మారడానికి తన అన్నయ్యే కారణమని వెల్లడించింది.
‘‘నేను క్రికెట్ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచే వచ్చాను. మా అన్నయ్య ప్రొఫెషనల్ క్రికెటర్. ఆయన వల్లే నేనూ క్రికెట్ ఆడటం మొదలుపెట్టాను. నేను వేసిన ఒక్క త్రో నా జీవిత ప్రయాణాన్నే మార్చివేసింది.
ఓరోజు మా అన్నయ్య ఆడుతున్న చోటికి వెళ్లాను. అక్కడే మెట్ల మీద కూర్చుని మ్యాచ్ చూస్తున్నా. ఇంతలో బంతి నా వైపు దూసుకువచ్చింది. వేగంగా స్పందించిన నేను.. దాదాపు 40- 50 మీటర్ల దూరం నుంచి దానిని నేరుగా స్టంప్స్‌నకు గిరాటేశాను. మా అన్నయ్య చాలా సంతోషించాడు.
చుట్టూ ఉన్న వాళ్లు కూడా.. ‘ఈ అమ్మాయి క్రికెట్ ఆడితే బాగుంటుంది’ అని ఉత్సాహపరిచారు. ఆరోజు నుంచి క్రికెటర్‌గా ప్రయాణం మొదలుపెట్టిన నేను ఇంత వరకు వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు’’ అని దీప్తి శర్మ హర్షం వ్యక్తం చేసింది. కాగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే దీప్తి సేవలకు గానూ ఆమెను పోలీస్ శాఖలో డీఎస్‌పీగా నియమించింది.


