దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో భారత బౌలర్లు పేలవ ప్రదర్శన కనబరుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు జరిగిన రెండో వన్డేల్లోనూ మన బౌలర్లు తేలిపోయారు. ముఖ్యంగా పేసర్లు అయితే గల్లీ బౌలర్ల కంటే దారుణంగా బౌలింగ్ చేస్తున్నారు.
సీనియర్ ఫాస్ట్ బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ లేని లోటు స్పష్టంగా కన్పిస్తోంది. ఈ సిరీస్‌కు వర్క్‌లోడ్ మెనెజ్‌మెంట్‌లో భాగంగా బుమ్రాకు విశ్రాంతి ఇవ్వగా.. మహ్మద్ షమీని ఫిట్‌నెస్ లోపం పేరిట జట్టులోకి తీసుకోవడం లేదు. మరి సిరాజ్‌ను ఎందుకు తీసుకోలేదో సెలక్టర్లు స్పష్టత ఇవ్వలేదు.
ఆసీస్‌తో వన్డే సిరీస్‌లో ఆడిన సిరాజ్.. సఫారీలతో వన్డేలకు మాత్రం దూరంగా ఉన్నాడు. ఈ ఏడాది సిరాజ్ ఇప్పటివరకు ఒకే వన్డే సిరీస్ ఆడాడు. అతడిని ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా పరిగణలోకి తీసుకోలేదు. ఈ నేపథ్యంలో సెలక్టర్లపై భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా ప్రశ్నల వర్షం కురిపించాడు.
సిరాజ్ కేవలం ఒక-ఫార్మాట్ ఆటగాడిగా మార్చడంపై నిరాశ వ్యక్తం చేశాడు. హైదరాబాదీ కేవలం టెస్ట్ క్రికెట్‌కు మాత్రమే పరిమితం కావడానికి గల కారణం తనకు అర్థం కావడం లేదని చోప్రా తెలిపాడు.
"మహ్మద్ సిరాజ్‌ను వన్డే జట్టు నుంచి ఎందుకు తప్పించారు? సెలక్టర్ల వ్యూహాలు ఏంటో ఆర్ధం కావడం లేదు. సిరాజ్ ఎప్పుడూ ఫిట్‌గా ఉంటాడు. అతడు ప్రస్తుతం సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆడుతున్నాడు. డొమెస్టిక్ క్రికెట్ ఆడుతున్న సిరాజ్.. వన్డేల్లో ఆడలేడా? ఇంతకుముందు ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా అతడిని ఎంపిక చేయకపోవడం మమ్మల్ని తీవ్ర నిరాశపరిచింది.
ఎందుకంటే అతడు కొన్నాళ్ల పాటు వన్డేల్లో వరల్డ్ నంబర్ వన్ బౌలర్‌గా కొనసాగాడు. అటువంటి బౌలర్ ఇప్పుడు జట్టులోనే లేకుండా పోయాడు. హర్షిత్ రాణా, ప్రసిద్ద్ కృష్ణ లాంటి బౌలర్లకు తరుచూ జట్టులో చోటు దక్కుతుంది. కానీ సిరాజ్ మాత్రం వన్డే, టీ20 జట్టులో కన్పించడం లేదు.
అలా ఎందుకు జరుగుతుందో నాకైతే తెలిదు. కానీ సిరాజ్ మాత్రం ఇప్పుడు సింగిల్ ఫార్మాట్ ప్లేయరయ్యాడు. కాగా దక్షిణాఫ్రికాతో టీ20లకు ప్రకటించిన భారత జట్టులోనూ సిరాజ్‌కు చోటు దక్కలేదు.
చదవండి: RO-KO హవా!.. ఈ హీరోని మర్చిపోతే ఎలా? కెప్టెన్‌గానూ సరైనోడు!


