టీమిండియా దిగ్గజ బ్యాటర్ రోహిత్ శర్మ స్వభావం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మైదానంలో బ్యాట్‌తో పరుగుల వరద పారించే హిట్‌మ్యాన్.. సారథిగా గంభీరంగా కనిపిస్తూనే.. పరిస్థితులకు తగ్గట్లు నవ్వులు పూయించడంలోనూ ముందే ఉంటాడు. ఇక మైదానం వెలుపల సహచర ఆటగాళ్లతో రోహిత్ ఫ్రెండ్లీగా ఉంటాడనే విషయం అతడి అభిమానులకు బాగా తెలుసు.
తానొక లెజెండరీ బ్యాటర్, కెప్టెన్‌ని అనే గర్వం రోహిత్ శర్మ (Rohit Sharma)లో అస్సలు కనిపించదు. తోటి ఆటగాళ్లను ఆటపట్టించడంలో ముందుండే హిట్‌మ్యాన్.. తన పట్ల వారు కూడా అదే విధంగా ప్రవర్తించినా సరదాగానే ఉంటాడు. ఈ విషయాన్ని రుజువు చేసే ఘటన ఇటీవల చోటు చేసుకుంది.
మూడు వన్డేల సిరీస్‌లో 1-1తో సమంగా..
టీమిండియా ప్రస్తుతం స్వదేశంలో సౌతాఫ్రికా (IND vs SA)తో వరుస సిరీస్‌లతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. టెస్టుల్లో సఫారీల చేతిలో 2-0తో వైట్‌వాష్‌కు గురైన భారత జట్టు.. మూడు వన్డేల సిరీస్‌లో 1-1తో సమంగా ఉంది. ఆఖరి ఓవర్ ఉత్కంఠగా సాగిన తొలి వన్డేలో 17 పరుగుల తేడాతో గట్టెక్కిన టీమిండియా.. రెండో వన్డేలో మాత్రం 358 పరుగులు చేసినా లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది.
రాలిపడ్డ కనురెప్ప
ఈ రెండు వన్డేల్లో రోహిత్ శర్మ వరుసగా 57, 14 పరుగులు చేశాడు. ఇదిలా ఉంటే.. రాయ్‌పూర్ వేదికగా సౌతాఫ్రికాతో రెండో వన్డేలో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో సహచర ఆటగాడు, బెంచ్‌కే పరిమితమైన రిషభ్ పంత్ (Rishabh Pant).. రోహిత్‌ను ఆటపట్టించాడు. రోహిత్ కంటి నుంచి రాలిపడిన రెప్పను పట్టుకున్న పంత్.. అతడి చెయ్యిపై ఉంచి.. ఓ కోరిక కోరుకోమన్నాడు.
ఇంతకీ రోహిత్ ఏం కోరుకున్నాడు?
ఇందుకు నవ్వులు చిందించిన రోహిత్ అలాగే చేశాడు. వీరిద్దరు ఇలా సరదాగా సంభాషిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ నేపథ్యంలో.. ‘ఇంతకీ రోహిత్ ఏం కోరుకున్నాడు?’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ విషయంపై రోహిత్ శర్మ సన్నిహితుడు అభిషేక్ నాయర్ స్టార్ స్పోర్ట్స్ వేదికగా స్పందించాడు.
రెండే రెండు కోరికలు
‘‘నాకు తెలిసి ప్రస్తుతం రోహిత్‌కు రెండే రెండు కోరికలు ఉండి ఉంటాయి. ఒకటేమో.. ‘నేను 2027 వన్డే వరల్డ్‌కప్‌ను నా చేతుల్లో పట్టుకోవాలి’ అని.. మరొకటి.. సౌతాఫ్రికాతో మూడో వన్డేలో సెంచరీ చేయాలని’’ అంటూ అభిషేక్ నాయర్.. రోహిత్ శర్మ మాటలను డీకోడ్ చేశాడు. ఇదిలా ఉంటే.. భారత్-సౌతాఫ్రికా మధ్య శనివారం విశాఖపట్నం వేదికగా నిర్ణయాత్మక మూడో వన్డే నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.
కాగా టీమిండియాకు టీ20 ప్రపంచకప్-2024, ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 అందించిన రోహిత్ శర్మను.. ఆస్ట్రేలియా పర్యటనకు ముందు బీసీసీఐ వన్డే కెప్టెన్సీ తొలగించిన విషయం తెలిసిందే. ఇక అంతకు ముందు రోహిత్.. అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌తో పాటు.. టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాడు.
చదవండి: 5 ఏళ్లలో 23 సెంచరీలు.. టెస్ట్ క్రికెట్‌పై రూట్ పంజా


