బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో (పింక్ బాల్) ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ (Joe Root) అజేయ సెంచరీతో కదంతొక్కాడు. అప్పటికే 39 సెంచరీలు చేసినా, రూట్‌కు ఆసీస్ గడ్డపై ఇదే తొలి శతకం. కాబట్టి ఈ సెంచరీ రూట్‌కు చాలా ప్రత్యేకం. ఈ సెంచరీ ఆసీస్ దిగ్గజ ఓపెనర్ మాథ్యూ హేడెన్‌కు కూడా చాలా ప్రత్యేకమే.
ఎందుకంటే, ఈ యాషెస్ సిరీస్‌లో రూట్ సెంచరీ చేయకపోతే మెల్‌బోర్న్ గ్రౌండ్‌లో నగ్నంగా తిరుగుతానని హేడెన్ సవాల్ చేశాడు. బ్రిస్బేన్ టెస్ట్‌లో సెంచరీ చేసి రూట్ తన ప్రతిష్ట పెంచుకోవడంతో పాటు హేడెన్ పరువు కూడా కాపాడాడు. తాజా సెంచరీ నేపథ్యంలో రూట్ టెస్ట్ కెరీర్‌పై ఓ ప్రత్యేక కథనం.

2012లో మొదలైన రూట్ టెస్ట్ కెరీర్ 2020 వరకు ఓ మోస్తరుగా సాగింది. అరంగేట్రం ఇయర్‌లో కేవలం రెండు ఇన్నింగ్స్‌లకే పరిమితమైన అతను.. ఓ హాఫ్ సెంచరీ సాయంతో 93 పరుగులు చేశాడు. ఆతర్వాతి ఏడాది నుంచి రూట్ కెరీర్ క్రమక్రమంగా మెరుగుపడుతూ వచ్చింది.
2013లో 2 సెంచరీలు.. ఆతర్వాత వరుసగా మూడేళ్లు మూడుమూడు సెంచరీలు, ఆతర్వాత వరుసగా మూడేళ్లు రెండ్రెండు సెంచరీలు చేశాడు.
2020 తర్వాత రూట్ కెరీర్ ఊహించని మలుపు తిరిగింది. అప్పటివరకు సాధారణ బ్యాటర్‌గా కొనసాగిన అతను ఒక్కసారిగా బీస్ట్ మోడ్‌లోకి వచ్చాడు. సెంచరీల మీద సెంచరీలు బాదుతూ వ్యక్తిగత ఇమేజ్‌ను పెంచుకోవడంతో పాటు తన జట్టుకు అపురూప విజయాలనందించాడు.

రూట్ అత్యుత్తమ ఫామ్‌ను అందుకునే సమయానికి టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి కూడా అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు. వీరికి స్టీవ్ స్మిత్, కేన్ విలియమ్సన్ కూడా తోడయ్యారు.
ఈ నలుగురు కలిసి 2020 దశకం ప్రారంభంలో టెస్ట్ క్రికెట్‌ను ఓ ఊపు ఊపారు. వీరి పుణ్యమా అని పోయిన టెస్ట్ క్రికెట్ క్రేజ్ తిరిగి వచ్చింది. టీ20లకు అలవాటు పడిపోయిన అభిమానులు వీరి బ్యాటింగ్ విన్యాసాల కారణంగా టెస్ట్‌లను కూడా ఫాలో అవడం మొదలుపెట్టారు. ఫాబ్-4గా కీర్తించబడే ఈ నలుగురు దిగ్గజాలు ఘన చరిత్ర కలిగిన సుదీర్ఘ ఫార్మాట్‌కు పునర్జన్మ కల్పించారు.
ఇక్కడ రూట్ ప్రస్తావన ఉంది కాబట్టి, మనం గమనించాల్సిన ఓ హైలైట్ అంశం ఉంది. ముందుగా చెప్పుకున్నట్లు రూట్ 2.0 సమయానికి ఫాబ్-4లో మిగతా ముగ్గురు (విరాట్, స్మిత్, కేన్) అరివీర భయంకరమైన ఫామ్‌లో ఉన్నారు.
రూట్ అప్పుడప్పుడే వారితో పోటీపడటం మొదలుపెట్టాడు. 2021కి ముందు రూట్ 177 ఇన్నింగ్స్‌ల్లో 17 సెంచరీలు చేయగా.. అప్పటికే విరాట్ ఖాతాలో 27 (147 ఇన్నింగ్స్‌లు), స్మిత్ ఖాతాలో 26 (135), కేన్ మామ ఖాతాలో 23 టెస్ట్ శతకాలు (143) ఉన్నాయి.

ఐదేళ్లు తిరిగే సరికి ఫాబ్-4 ఆటగాళ్ల సెంచరీల క్రమం తిరిగబడిపోయింది. 2020 తర్వాత రూట్ ఏకంగా 23 సెంచరీలు చేసి అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా అవతరించగా.. 2021 నాటికి టాప్ ప్లేస్‌లో ఉండిన విరాట్ గడిచిన ఐదేళ్లలో కేవలం 3 సెంచరీలకు మాత్రమే పరిమితమై ఆఖరి స్థానానికి చేరాడు. ఈ ఐదేళ్లలో స్మిత్, కేన్ మామ తలో 10 సెంచరీలు చేసి కెరీర్‌లు నిలకడగా కొనసాగించారు.
2021లో 6, 2022లో 5, 2023లో 2, 2024లో 6, తాజా సెంచరీతో కలుపుకొని రూట్ ఈ ఏడాది ఇప్పటికే 4 సెంచరీలు చేశాడు. ఫాబ్-4లో ప్రస్తుతం రూట్ 40 సెంచరీలతో అగ్రస్థానంలో ఉండగా.. స్మిత్ 36, కేన్ 33, విరాట్ 30 సెంచరీలతో వరుస స్థానాల్లో ఉన్నారు.
అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న క్రికెటర్లలో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్లలో రూట్ (59) విరాట్ (84) తర్వాతి స్థానంలో ఉన్నాడు. వీరి తర్వాత రోహిత్ శర్మ (50), కేన్ (48), స్మిత్ (48) టాప్-5లో ఉన్నారు.

రూట్ టెస్ట్‌ల్లో ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే త్వరలో దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న ఆల్‌టైమ్ రికార్డులు బద్దలవడం ఖాయం. పరుగుల విషయంలో సచిన్‌కు మరో 2300 దూరంలో ఉన్న రూట్.. మరో 12 సెంచరీలు చేస్తే సచిన్‌ను అధిగమిస్తాడు.
మ్యాచ్ విషయానికొస్తే.. రూట్ అజేయ సెంచరీతో (135) ఆదుకోవడంతో ఇంగ్లండ్ తొలి రోజు గౌరవప్రదమైన స్థానంలో ఉంది. రూట్‌కు జాక్ క్రాలే (76) సహకరించడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ స్కోర్ 325/9గా ఉంది. 264 పరుగుల వద్దే తొమ్మిదో వికెట్ కోల్పోయినా, రూట్ జోఫ్రా ఆర్చర్ (32 నాటౌట్) సాయంతో 300 పరుగుల మార్కును దాటించాడు. స్టార్క్ 6 వికెట్లతో సత్తా చాటాడు.


