సిరాజ్‌పై సెలక్టర్ల శీతకన్ను
వన్డే, టి20లకు దూరమవుతున్న హైదరాబాద్ పేసర్
ఎంపికపై స్పష్టత లేని పరిస్థితి
దక్షిణాఫ్రికాతో ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్ కోసం అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ భారత జట్టును ప్రకటించింది. హైదరాబాదీ పేస్ బౌలర్ సిరాజ్‌కు ఇందులో చోటు కల్పించలేదు. సిరీస్ నుంచి విశ్రాంతి నిచ్చారా అనుకుంటే దానికి ముందు వన్డే సిరీస్‌లో కూడా అతను ఆడలేదు. తగినంత విరామం లభించిన అతను ఇప్పుడుదేశవాళీ టి20 టోర్నీ ముస్తాక్ అలీ ట్రోఫీలో హైదరాబాద్‌కు ఆడుతున్నాడు.
అంతకుముందు ఆ్రస్టేలియాతో జరిగిన ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో కూడా సిరాజ్‌ను ఎంపిక చేయలేదు. టి20 వరల్డ్ కప్ చేరువైన నేపథ్యంలో సెలక్టర్ల ఆలోచనను బట్టి చూస్తే సిరాజ్‌కు అవకాశం సందేహంగానే కనిపిస్తోంది. వన్డేల విషయంలో కూడా అతని ఎంపికపై ఎలాంటి స్పష్టతా లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
సాక్షి క్రీడా విభాగం : సరిగ్గా నాలుగు నెలల క్రితం... ఇంగ్లండ్ గడ్డపై ఓవల్ టెస్టులో అసాధారణ బౌలింగ్‌తో భారత్‌ను గెలిపించిన హైదరాబాద్ పేస్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్ ఒక్కసారి హీరోగా మారిపోయాడు. ముఖ్యంగా చివరి రోజు పోరాటయోధుడిలా బౌలింగ్ చేసి ప్రత్యర్థిని కుప్పకూల్చిన అతను... భారత్‌ను సిరీస్ కోల్పోయే ప్రమాదం నుంచి కాపాడటంతో పాటు ఒక రకంగా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పరువు నిలబెట్టాడు. లేదంటే భారత్ 1–3తో ఓడి తిరుగుముఖం పట్టేది. అలాంటి అద్భుత ప్రదర్శన తర్వాత సిరాజ్ ఒక్కసారిగా తెర వెనక్కి వెళ్లిపోయినట్లు కనిపిస్తోంది.
అసలు భారత జట్టులో ఉన్నాడా లేదా అనే సందేహాల మధ్య అతని ఆట కొనసాగుతోంది. నిజానికి ఇంగ్లండ్‌తో టెస్టుల్లో చెలరేగినా... అప్పటికే అతను వన్డే ఫార్మాట్‌లో తానేమిటో నిరూపించుకున్నాడు. టి20ల్లో కూడా పదునైన బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాటర్లపై పైచేయి సాధించడంతో పాటు ఐపీఎల్‌లో రెగ్యులర్‌గా రాణిస్తున్న బౌలర్లలో అతనూ ఒకడు. కానీ తాజా పరిణామాలు చూస్తే 31 ఏళ్ల సిరాజ్‌ను ఒక ఫార్మాట్‌కే పరిమితం చేశారా అనే సందేహాలు కలుగుతున్నాయి.
నిలకడైన ప్రదర్శన...
ఓవరాల్‌గా సిరాజ్ వన్డే కెరీర్ రికార్డు చాలా బాగుంది. 47 వన్డేల్లో కేవలం 24.67 సగటుతో అతను 73 వికెట్లు పడగొట్టాడు. గత కొంత కాలంగా ఫార్మాట్‌కు తగినట్లు తన ఆటను మార్చుకుంటూ నిలకడైన ప్రదర్శనతో సిరాజ్ తనను తాను ‘ఆల్ ఫార్మాట్ బౌలర్’గా మలచుకున్నాడు. ప్రస్తుతం భారత బౌలింగ్ దళంలో బుమ్రా తర్వాత నిస్సందేహంగా రెండో స్థానం తనదే. నిజానికి చాంపియన్స్ ట్రోఫీలో సిరాజ్‌కు చోటు దక్కకపోవడమే ఆశ్చర్యం కలిగించింది.
అంతకుముందు రెండేళ్లలో భారత్ తరఫున వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా సిరాజ్ నిలిచాడు. బంతి పాతబడితే ప్రభావం చూపలేకపోతున్నాడంటూ కెపె్టన్ రోహిత్ శర్మ ఇచ్చిన వివరణ కూడా సరైంది కాదని అందరికీ అర్థమైంది. ఓవల్ టెస్టు ప్రదర్శనతో పాటు వన్డేల్లో నిలకడైన ప్రదర్శన చూసుకుంటే సిరాజ్‌కు వన్డేల్లోనూ వరుస సిరీస్‌లలో స్థానం లభించాలి. ఆ్రస్టేలియా గడ్డపై ఆడిన 3 వన్డేల్లో ఎక్కువ వికెట్లు తీయకపోయినా కేవలం 4.94 ఎకానమీతో పరుగులివ్వడం చక్కటి ప్రదర్శనే.
కానీ స్వదేశంలో దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు వచ్చేసరికి టీమ్‌లో స్థానం లేదు. గత రెండు వన్డేల్లో ప్రసిధ్ కృష్ణ, హర్షిత్ రాణాల బౌలింగ్ ప్రదర్శన చూస్తుంటే సిరాజ్ కచ్చితంగా ఇంతకంటే బాగా బౌలింగ్ చేసేవాడనే అభిప్రాయం అన్ని వైపుల నుంచి వ్యక్తమవుతోంది. ఇప్పుడు టి20లకు కూడా ఎంపిక చేయకపోవడం, త్వరలోనే వరల్డ్ కప్‌కు కూడా దాదాపు ఇదే జట్టు ఎంపికయ్యే అవకాశం ఉండటంతో ఈ ఫార్మాట్‌లో సిరాజ్‌ను పరిగణనలోకి తీసుకోవడం లేదని
అర్థమవుతోంది.
విశ్రాంతి ఇచ్చారా...వేటు వేశారా...
సిరాజ్‌కు వన్డే, టి20 ఫార్మాట్‌లలో స్థానం లభించకపోవడంపై కావాల్సినంత చర్చ జరగడం లేదని అర్థమవుతోంది. సెలక్టర్లు సాధారణంగా తమ ఎంపికపై ఎలాంటి వివరణా ఇవ్వడం లేదు. ఇటీవల ఒకటి రెండు సందర్భాల్లో చైర్మన్ అజిత్ అగార్కర్ మాట్లాడినా అసలు సిరాజ్ పేరును కూడా ప్రస్తావించనే లేదు. జట్టుకు దూరమైన షమీ గురించి కూడా మాట్లాడిన అగార్కర్... రెగ్యులర్ సభ్యుడిగా ఉన్న ఆటగాడి గురించి సమాచారం ఇవ్వడం లేదు.
బుమ్రా ఫిట్‌నెస్, విశ్రాంతి విషయంలో ప్రతీ సిరీస్, ప్రతీ మ్యాచ్ సందర్భంగా సెలక్టర్లు స్పష్టతనిస్తున్నారు. అదే సిరాజ్‌కు విశ్రాంతినిచ్చారా లేక వేటు వేశారా కూడా తెలియడం లేదు. సిరాజ్ పూర్తి ఫిట్‌గా ఉన్నాడు. ఎలాంటి గాయాల సమస్యలు లేవు. తాను ఎలాంటి విశ్రాంతి కోరుకోవడం లేదు. ఏ స్థితిలోనైనా మైదానంలో సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఇంగ్లండ్‌లో ఐదు టెస్టులూ ఆడాడు కాబట్టి విశ్రాంతి అవసరమని భావించి ఆసియా కప్‌కు ఎంపిక చేయలేదని అనిపించింది.
నిజానికి సిరాజ్‌కు విరామం ఇవ్వాలని అనుకుంటే స్వదేశంలో పేసర్లకు ప్రాధాన్యత లేని వెస్టిండీస్‌తో సిరీస్‌లో ఇవ్వాల్సింది. నాలుగు ఇన్నింగ్స్‌లలో కలిపి అతను మొత్తం 49 ఓవర్లే బౌలింగ్ చేశాడు. వెంటనే దక్షిణాఫ్రికాతో రెండు టెస్టుల్లోనూ ఆడించడం అంటే ఈ ఫార్మాట్‌లోనే అతని అవసరాన్ని చూపించింది. కానీ ఎలాంటి కారణం లేకుండా ఇప్పుడు వన్డే, టి20ల నుంచి అతడిని పక్కన పెట్టారు.
లోయర్ ఆర్డర్‌లో కొన్ని పరుగులు సాధించే హర్షిత్ రాణా వల్ల సిరాజ్ స్థానం సందేహంలో పడినట్లు కనిపిస్తోంది. కానీ సిరాజ్ లాంటి టాప్ బౌలర్‌ను బ్యాటింగ్ కారణంగా పక్కన పెట్టడంతో అర్థం లేదు. మున్ముందు సిరాజ్ విషయంలో సెలక్టర్లు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది చూడాలి.


