ఎస్‌అండ్‌పీ కితాబు
రుణదాతలకు అనుకూలంగా ప్రక్రియ
తగ్గిన పరిష్కార సమయం
పెరిగిన రుణాల రికవరీ రేటు
న్యూఢిల్లీ: భారత్ దివాలా పరిష్కార చట్టానికి (ఐబీసీ) ఎస్‌అండ్‌పీ గ్లోబల్ రేటింగ్స్ కితాబిచి్చంది. అధికారిక ర్యాంకింగ్ మదింపును సవరించింది. దివాలా పరిష్కార కార్యాచరణ రుణదాతలకు స్నేహపూర్వకంగా ఉండడాన్ని గుర్తించింది. భారత్‌లో దివాలా అండ్ బ్యాంక్రప్టసీ కోడ్ (ఐబీసీ) రుణ క్రమశిక్షణను బలోపేతం చేసిందని, పరిష్కార ప్రక్రియను రుణదాతలకు అనుకూలంగా మార్చిందని ఎస్‌అండ్‌పీ తన నివేదికలో పేర్కొంది. గతంలో దివాలా పరిష్కార విధానాలకు భిన్నంగా ఐబీసీ కింద సంక్షోభంలోని కంపెనీల ప్రమోటర్లు తమ వ్యాపారాలపై నియంత్రణ కోల్పోతున్నట్టు వివరించింది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని భారత దివాలా పరిష్కార చట్టానికి అధికారిక ర్యాంకింగ్ మదింపును గ్రూప్–సి నుంచి గ్రూప్–బికి మారుస్తున్నట్టు ప్రకటించింది.
రుణదాతలకు స్నేహపూర్వకంగా ఉన్న దివాలా పరిష్కార ప్రక్రియను బలహీనం నుంచి మధ్యస్థానికి మెరుగుపరిచిన నేపథ్యంలో ఈ మార్పు చోటుచేసుకున్నట్టు తెలిపింది. ఐబీసీ కింద రుణదాతల ఆధ్వర్యంలో విజయవంతమైన పరిష్కారాలను పరిగణనలోకి తీసుకున్నట్టు పేర్కొంది. రుణాల వసూళ్లు, రికవరీ రేటు మెరుగుపడ్డాయని.. సగటు రుణ వసూలు గత చట్టం కింద ఉన్న 15–20 శాతం నుంచి ఐబీసీ కింద 30 శాతానికి పెరిగినట్టు తెలిపింది. గతంలో ఒక్కో కేసు పరిష్కారానికి ఆరు నుంచి ఎనిమిదేళ్ల సమయం తీసుకోగా, ఐబీసీ కింద రెండేళ్లకు తగ్గినట్టు ఎస్‌అండ్‌పీ పేర్కొంది. అధికార ర్యాంకింగ్ మదింపు అన్నది.. ఒక దేశ దివాలా చట్టం కింద రుణదాతలకు ఉన్న భద్రతను సూచిస్తుంటుంది.


