2028 సంవత్సరం నాటికి స్పేస్ లో "భారతీయ అంతరిక్ష స్టేషన్" ఏర్పాటు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్రం ప్రభుత్వం తెలిపింది. పూర్తిగా స్వదేశీ సాంకేతికతతోనే దీని నిర్మాణం చేపడుతున్నామని పార్లమెంటులో బుధవారం సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేందర్ సింగ్ పేర్కొన్నారు. దీనికి సంబంధించి తొలి మాడ్యూల్ ప్రక్రియ సజావుగా సాగుతుందని పేర్కొన్నారు.
భారతీయ అంతరిక్ష స్టేషన్ నిర్మాణ పనులు వేగవంతంగా సాగుతున్నాయని కేంద్రమంత్రి జితేందర్ సింగ్ తెలిపారు. దీనికి సంబంధించిన కీలమైన డిజైన్ మైల్ స్టోన్ ను ఇస్రో పూర్తిచేసిందన్నారు. దీని నిర్మాణం పూర్తయితే భారత వ్యోమగాములు అంతరిక్ష ప్రయాణం, సాంకేతిక ప్రయోగాలు, పరిశోధనలు చాలా సులభతరమైతాయని వారు పేర్కొన్నారు.
2024 సెప్టెంబర్ 1న భారతీయ అంతరిక్ష స్టేషన్ మెుదటి మాడ్యుల్ నిర్మాణానికి పార్లమెంట్ ఆమోదం తెలిపింది. దీనికి రూ.20,193 కోట్ల నిధులు కేటాయించగా 2028 వరకూ పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. 2035 నాటికి ఇది పూర్తిస్థాయిలో సేవలు అందించే అవకాశం ఉంది.
భారతీయ అంతరిక్ష స్టేషన్ ఏర్పాటు పూర్తయితే అమెరికా, రష్యా, చైనా దేశాల తర్వాత స్పేస్ లో స్వంత అంతరిక్ష స్టేషన్ కలిగిన నాలుగవ దేశంగా భారత్ రికార్టు సృష్టిస్తుంది.


