నేడు దక్షిణాఫ్రికాతో రెండో వన్డే
జోరు మీదున్న టీమిండియా
మధ్యాహ్నం గం.1:30 నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లలో ప్రత్యక్ష ప్రసారం
రాయ్‌పూర్: వన్డే క్రికెట్‌లో తమ ఆధిపత్యాన్ని మరోసారి ప్రదర్శిస్తూ దక్షిణాఫ్రికాపై గత మ్యాచ్‌లో పైచేయి సాధించిన భారత్ ఇప్పుడు మరో విజయంపై గురి పెట్టింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నేడు జరిగే రెండో వన్డేలో భారత్, దక్షిణాఫ్రికా తలపడనున్నాయి.
ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను సొంతం చేసుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉండగా, దక్షిణాఫ్రికా కోలుకోవాలని భావిస్తోంది. గత మ్యాచ్‌లో 349 పరుగులు చేసిన తర్వాత కూడా కేవలం 17 పరుగుల తేడాతో భారత్ గెలవడం ఇరు జట్ల మధ్య బలమైన పోటీని చూపిస్తోంది. ఈ నేపథ్యంలో మరో ఆసక్తికర పోరు ఖాయం.
మార్పుల్లేకుండా...
భారత్ ఆడిన గత వరుస రెండు వన్డేల్లో ఒక మ్యాచ్‌లో (ఆ్రస్టేలియాతో) రోహిత్ శర్మ, మరో మ్యాచ్‌లో విరాట్ కోహ్లి సెంచరీలు సాధించి తమ విలువేంటో చూపించారు. ఈ నేపథ్యంలో వారిద్దరి ప్రదర్శనపై చర్చ అనవసరం. భారత బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్ కూడా ఇదే విషయాన్ని చెప్పాడు. ఇలాంటి స్థితిలో జట్టు సిరీస్ సాధించడంపైనే పూర్తిగా దృష్టి పెట్టింది.
తొలి మ్యాచ్‌లో మన జట్టు ఆటను చూస్తే తుది జట్టులో ఎలాంటి మార్పూ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి రిషభ్ పంత్ మరోసారి పెవిలియన్‌కే పరిమితం కావచ్చు. యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్ తమ సత్తాను ప్రదర్శించే ఇన్నింగ్స్‌లు ఆడాల్సి ఉంది. రాంచీ వన్డే ప్రదర్శన తర్వాత పేసర్ హర్షిత్ రాణాపై విమర్శలు తగ్గాయి.
బరిలోకి బవుమా...
తొలి వన్డేతో పోలిస్తే దక్షిణాఫ్రికా జట్టులో రెండు మార్పులు ఖాయమయ్యాయి. గత మ్యాచ్‌లో విశ్రాంతి తీసుకున్న కెప్టెన్ తెంబా బవుమాతో పాటు స్పిన్నర్ కేశవ్ మహరాజ్ కూడా బరిలోకి దిగుతున్నాడు.
రికెల్టన్, సుబ్రాయెన్ స్థానాల్లో వీరు ఆడతారు. రాంచీలో ఓడినా దక్షిణాఫ్రికా చివరి వరకు పట్టుదలను ప్రదర్శించింది. అంచనాలకు తగినట్లు బ్రీట్‌కీ, బ్రెవిస్ రాణించగా, మార్క్‌రమ్ వైఫల్యం జట్టుకు ఇబ్బందిగా మారింది. ఆల్‌రౌండర్లు యాన్సెన్, కార్బిన్ బాష్ బ్యాటింగ్ జట్టుకుఅదనపు బలంగా మారింది.


