భోపాల్ గ్యాస్ దుర్ఘటన 41వ వార్షికోత్సవం సందర్బంగా బుధవారం జరిగిన ర్యాలీ ఘర్షణకు దారితీసింది. ఈ ర్యాలీలో ఉపయోగించిన దిష్టిబొమ్మపై ఆర్‌ఎస్‌ఎస్ (RSS) బీజేపీ(BJP) అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
భోపాల్‌లోని భారత్ టాకీస్ అండర్‌బ్రిడ్జి నుండి JP నగర్ గ్యాస్ వరకు మెమోరియల్ గ్యాస్ బాధితుల సంఘాలు వార్షిక సంస్మరణ ర్యాలీ నిర్వహించాయి. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని, యూనియన్ కార్బైడ్ మరియు డౌ కెమికల్‌లపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. అలాగే ప్రాణాలతో బయటపడిన వారికి సరైన పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశాయి. యూనియన్ కార్బైడ్, డౌ, 1984 విపత్తుతో సంబంధమున్నఇతర కంపెనీలను సూచించే దిష్టిబొమ్మలను ర్యాలీలో ఉపయోగించారు.
శాంతియుత ర్యాలీగా ప్రారంభమైన ర్యాలీ తీవ్ర రాజకీయ ఘర్షణగా మారింది. దిష్టిబొమ్మపై ఆర్‌ఎస్‌ఎస్ అని రాశారని, నిర్వాహకులు మతపరమైన , సంస్థాగత భావాలను దెబ్బతీశారని ఆరోపిస్తే బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. దీంతో అక్కడి వాతావరణం మరింత తీవ్రతరం కాకుండా ఉండేందుకు పోలీసులు రంగప్రవేశం చేసి దిష్టిబొమ్మను స్వాధీనం చేసుకున్నారు.
మరోవైపు గ్యాస్ బాధితుల సంఘాలు ఈ ఆరోపణలను తిరస్కరించాయి. తాము ఏ సంస్థనుద్దేశించిరాయలేదని, కేవలం డౌ కంపెనీ గురించి పేర్కొన్నామనీ స్పష్టం చేశారు. డౌ కెమికల్‌ను రక్షించడమే బీజేపీ ప్రభుత్వం లక్ష్యమని, దోషులైన కంపెనీలను నిలదీసే ప్రయత్నాలను బీజేపీ అడ్డుకుంటుందని ఆరోపించారు. విపత్తు సంభవించి 41 ఏళ్లు గడిచినా, బాధితులు ఇంకా న్యాయం కోసం ఎదురు చూస్తున్నారన్నారు. యూనియన్ కార్బైడ్, డౌ కెమికల్, వాటి అనుబంధ సంస్థలపై రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు పదేపదే విజ్ఞప్తి చేసినప్పటికీ ఖచ్చితమైన చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యాయని ఆరోపించారు.


