న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన బీజేపీ తాజాగా జరిగిన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ)ఉప ఎన్నికల్లోనూ విజయ బావుటా ఎగురవేసింది. బుధవారం ఎంసీడీ ఫలితాలు వెల్లడికాగా, భారతీయ జనతా పార్టీ 12 వార్డులకు గాను ఏడు స్థానాలను గెలుచుకుని, మెజారిటీని సాధించింది. ద్వారకా బీ, వినోద్ నగర్, అశోక్ విహార్, గ్రేటర్ కైలాష్, డిచాన్ కలాన్, షాలిమార్ బాగ్ బీ, చాందిని చౌక్ తదితర ముఖ్య వార్డులను బీజేపీ కైవసం చేసుకుంది. తద్వారా బీజేపీ తన కోటను నిలబెట్టుకుంది. ఈ ఫలితాలు అధికార బీజేపీకి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి, కాంగ్రెస్‌కు ఒక కీలకమైన పరీక్షగా మారగా, దీనిలో బీజేపీ తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంది. ఈ ఉప ఎన్నికల్లో మొత్తం 51 మంది అభ్యర్థులు బరిలోకి దిగగా, వారిలో 26 మంది మహిళలు ఉన్నారు.
ఎంసీడీ ఉప ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మూడు వార్డులను గెలుచుకోవడం ద్వారా తన ఉనికిని చాటుకుంది. ఆప్ గెలిచిన వార్డులలో నరైనా, ముండ్కా దక్షిణపురి ఉన్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీకి కొంత ఎదురుదెబ్బ తగిలింది. బీజేపీ 2022 ఎంసీడీఎన్నికలలో గెలిచిన తమ సిట్టింగ్ వార్డులైన సనగం విహార్ ఏ, నరైనాను కోల్పోయింది. ఈ ఫలితాలలో కాంగ్రెస్ పార్టీ తన ఖాతాను తెరిచింది. సనగం విహార్ ఏ వార్డును కాంగ్రెస్ గెలుచుకుంది. మరో వైపు చాందిని మహల్ వార్డును ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (ఏఐఎఫ్‌బీ)కి చెందిన మొహమ్మద్ ఇమ్రాన్ గెలుచుకోవడం విశేషం.
ఈ ఉప ఎన్నికలు జరిగిన 12 వార్డులలో గ్రేటర్ కైలాష్, షాలిమార్ బాగ్ బి, అశోక్ విహార్, చాందిని చౌక్, చాందిని మహల్, డిచాన్ కలాన్, నరైనా, సంగం విహార్ ఎ, దక్షిణ్ పురి, ముండ్కా, వినోద్ నగర్, ద్వారకా బి ఉన్నాయి. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా, కొద్దిసేపటికే ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఉప ఎన్నికల ఫలితాలను 2022 ఎంసీడీ సాధారణ ఎన్నికల ఫలితాలతో పోల్చిచూస్తే.. 2022 ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 134 సీట్లతో (42.05% ఓట్లు) మెజారిటీ సాధించగా, భారతీయ జనతా పార్టీ 104 సీట్లతో (39.09% ఓట్లు) బలమైన ప్రతిపక్షంగా నిలిచింది. తాజా ఉప ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ సాధించింది. ఆప్, కాంగ్రెస్‌లు కూడా తమ ఉనికిని నిలబెట్టుకున్నాయి.
ఇది కూడా చదవండి: చూపు లేకున్నా.. శరీరం సహకరించకున్నా..


