మీడియాతో మాట్లాడుతున్న రాంచందర్‌రావు. చిత్రంలో కార్తీకరెడ్డి, అంజిరెడ్డి
మజ్లిస్‌కు ఒక ప్రాంతాన్ని అప్పగించాలనే కుట్ర జరుగుతోంది
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని ఓ ప్రాంతాన్ని మజ్లిస్‌కు అప్పగించేందుకు కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ఆరోపించారు. శుక్రవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. జీహెచ్‌ఎంసీలో పురపాలికలు, కార్పొరేషన్ల విలీనాన్ని బీజేపీ వ్యతిరేకిస్తోందని స్పష్టం చేశారు. అధికార వికేంద్రీకరణ జరగాలని బీజేపీ కోరుకుంటోందని తెలిపారు. ‘ఏడాది క్రితం కొన్ని పంచాయతీలను మున్సిపాలిటీలుగా మార్చారు. ఇప్పుడు జీహెచ్‌ఎంసీలో విలీనం చేస్తామంటున్నారు.
రోడ్లు లేవు, తాగునీరు అందడంలేదు. ప్రభుత్వం తొలుత మౌలిక సదుపా యాలను కల్పించడంపై దృష్టిసారించాలి’అని కోరారు. 20 గ్రామాలను జీహెచ్‌ఎంసీలో కలిపేస్తే ఆయా గ్రామాల్లో ఉన్న రైతులకు రైతు బంధు నిలిచిపోతుందని, వందలాది మంది రైతులు నష్టపోతారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామాల్లోని పేదలు పంచాయతీకి పన్నుకట్టడానికే ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇప్పుడు గ్రేటర్‌లో కలిపేస్తే పన్ను పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలో సగం జనాభా.. అంటే సుమారు 2 కోట్ల మందిని జీహెచ్‌ఎంసీ పరిధిలోకి తీసుకువస్తున్నారని, ఇది అశాస్త్రీయంగా ఉందని ఆయన అన్నారు.
‘పంచాయతీలను విలీనం చేయాలనుకుంటే ముందుగా ప్రజాభిప్రాయం సేకరించాలి. కౌన్సిల్ సభ్యులతో చర్చించాలి. అలాంటి ప్రక్రియ ఏదీ జరగకుండా నేరుగా ఆదేశాలివ్వడంలోనే ప్రభుత్వానికి దురుద్దేశముందని స్పష్టమవుతోంది’అని అన్నారు. దాదాపు 2 కోట్ల మంది ప్రజలు గ్రేటర్‌లో ఉంటే పరిపాలన ఇబ్బందులకు దారితీస్తుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పురపాలికల విలీన ప్రక్రియపై మరో మారు ఆలోచించాలని రాంచందర్‌రావు డిమాండ్ చేశారు.


