నియోపొలిస్‌లో రెండో విడత వేలం
మొత్తం రెండు బిడ్డింగుల్లో రూ.2,708 కోట్ల ఆదాయం
డిసెంబర్‌లో మూడో విడతకు సన్నాహాలు
సాక్షి, హైదరాబాద్: కోకాపేట్ మరోసారి కేక పుట్టించింది. ప్రభుత్వ ఖజానాకు రూ.కోట్లు కురిపించింది. శుక్రవారం హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) కోకాపేట్ నియోపొలిస్‌లో నిర్వహించిన రెండో విడత ఆన్‌లైన్ వేలంలో ఎకరం గరిష్టంగా రూ.151.25 కోట్ల ధర పలికింది. నియోపొలిస్‌లోని 15వ ప్లాట్‌లో ఉన్న 4.03 ఎకరాలకు, 16వ ప్లాట్‌లో ఉన్న 5.03 ఎకరాలకు బిడ్డింగ్ నిర్వహించారు. అయితే 15వ ప్లాట్‌లో ఎక్కువ ధర పలికింది. 16వ ప్లాట్‌లో ఎకరాకు గరిష్టంగా రూ.147.75 కోట్లు లభించింది. సగటున ఒక ఎకరా రూ.142.83 కోట్లు చొప్పున అమ్ముడైనట్లు అధికారులు తెలిపారు. శుక్రవారం నిర్వహించిన 9.06 ఎకరాల బిడ్డింగ్ ద్వారా మొత్తం రూ.1,352 కోట్లు లభించగా, ఈ నెల 24వ తేదీన విక్రయించిన భూములతో కలిపి ప్రభుత్వానికి రూ.2,708 కోట్లు ఆదాయం లభించింది. రెండేళ్ల క్రితం కోకాపేట్ నియోపొలిస్‌లో నిర్వహించిన బిడ్డింగ్‌లో ఎకరానికి రూ.100.75 కోట్లు లభించగా ఈసారి రెండు విడతల్లో రూ.137 కోట్ల నుంచి రూ.151 కోట్ల వరకు ధర పలకడం విశేషం. డిసెంబర్ 3, 5 తేదీల్లో మరోసారి కోకాపేట్ గోల్డ్‌మైల్ లే అవుట్‌లో భూములు వేలం వేయనున్నారు.
మొదటి నుంచి హాట్ కేకే
నగరానికి పశి్చమం వైపున ఉన్న కోకాపేట్, రాయదుర్గం, తదితర ప్రాంతాలు రియల్ ‘భూమ్’సృష్టిస్తున్నాయి. అంతర్జాతీయ కార్పొరేట్ సంస్థలు కొలువుదీరిన ఈ ప్రాంతంలో భూమి కోసం కంపెనీలు పోటీ పడుతున్నాయి. నోయిడా, నవీ ముంబై, బెంగళూరు, చెన్నై తదితర మెట్రో నగరాలతో పోటీపడి హైదరాబాద్‌లో భూముల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇటీవల రాయదుర్గంలోని టీజీఐఐసీ భూమి ఎకరా గరిష్టంగా రూ.177 కోట్ల చొప్పున అమ్ముడైన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం కోకాపేట్‌లోని హెచ్‌ఎండీఏ భూముల విక్రయాల్లోనూ అదే ఊపు కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు రెండు దఫాలుగా బిడ్డింగ్ నిర్వహించారు. ఈ బిడ్డింగ్‌లో కొనుగోలుదారుల నుంచి పోటీ అంతకంతకు రెట్టింపైంది. సాయంత్రం 7 గంటల వరకు ఉత్కంఠ భరితంగా బిడ్డింగ్ సాగగా 15వ ప్లాట్‌లో గరిష్ట ధర పలికింది. ఈ ప్లాట్‌ను లక్ష్మీనారాయణ గుమ్మడి, కార్తీక్‌రెడ్డి మద్గుల, శరత్ వెంట్రప్రగడ, శ్యామ్‌సుందర్‌రెడ్డి వంగాల కొనుగోలు చేశారు. అలాగే 16వ ప్లాట్‌లో గోద్రెజ్ ప్రాపర్టీస్ సంస్థ గరిష్ట ధర చెల్లించి ఎకరా భూమిని కొనుగోలు చేసింది.


