8 వరుసల ప్రతిపాదనపై విముఖత
2047 వరకు ట్రాఫిక్‌కు 6 వరుసలు సరిపోతాయని నిర్ధారణ
8 లేన్లు నిర్మిస్తే.. ఖర్చు నిరర్థకమేనని భావన
రెండు వరుసలు తగ్గించటంతో రూ.2 వేల కోట్లకు పైగా ఆదా
ఒకేసారి ఆరు లేన్లతో రోడ్డు నిర్మాణానికి నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగురోడ్డు విషయంలో కేంద్ర ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఔటర్ రింగు రోడ్డు తరహాలో దీనిని ఎనిమిది వరుసలతో నిర్మించాలని నిర్ణయించి కసరత్తు చేయగా, ఇప్పుడు దాన్ని ఆరు వరుసలకే పరిమితం చేయనుంది. 2047 వరకు పెరిగే ట్రాఫిక్‌కు ఆరు వరుసలు సరిపోతాయని తాజాగా కేంద్ర ప్రభుత్వం తేలి్చంది. కొన్ని నెలల క్రితం నిర్వహించిన ట్రాఫిక్ స్టడీ నివేదికను కేంద్ర ఉపరితల రవాణాశాఖ అదీనంలోని ప్రాజెక్టు అప్రైజల్ అండ్ టెక్నికల్ స్రూ్కటినీ కమిటీ (పీఏటీఎస్‌సీ) మదించినప్పుడు.. ట్రాఫిక్ పెరుగుదల, రోడ్డు నిర్మాణం తర్వాత అమాంతం పెరిగే ట్రాఫిక్‌ను అంచనా వేసి వచ్చే 20 ఏళ్లకు ఆరు వరుసలు సరిపోతాయని తేల్చింది. ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లటంతో, ప్రస్తుతానికి ఆరు వరుసల రింగురోడ్డు సరిపోతుందని, అంతకే బడ్జెట్‌ను ఆమోదించాలని ఆదేశించింది. దీంతో ఆరు వరుసల రోడ్డును మాత్రమే చేపట్టేందుకు వీలుగా అధికారులు డిజైన్లు సిద్ధం చేశారు. మరికొద్ది రోజుల్లో జరిగే కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ అప్రైజల్ కమిటీ (పీపీపీఏసీ) ఆ మేరకు బడ్జెట్‌ను ఆమోదించనుంది.
నిరర్థక వ్యయం అవుతుందని..
రీజినల్ రింగు రోడ్డు ఉత్తర భాగం 162.46 కి.మీ. నిడివి నిర్మాణానికి రూ.18,600 కోట్లు ఖర్చవుతాయని ఎన్‌హెచ్‌ఏఐ తేల్చింది. ఎనిమిది వరుసల రోడ్డు నిర్మాణానికి (సివిల్‌కాస్ట్) కి.మీ.కు రూ.60 కోట్ల వరకు అవుతుందని పేర్కొంది. రెండోసారి మోదీ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత భారత్‌మాల పరియోజనకు బదులు విజన్ 2047 ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. 2047 నాటికి చేపట్టాల్సిన ప్రాజెక్టులను ఇందులో డిజైన్ చేసింది. అప్పుటికి పెరిగే జనాభా అవసరాలను దృష్టిలో పెట్టుకొని వాటిని చేపట్టబోతోంది. అప్పటికి ఆరు వరుసల రీజినల్ రింగు సరిపోతుందని నిర్ధారించిన నేపథ్యంలో రూ.18,600 కోట్లను ఉత్తర రింగుపై ఖర్చు చేయటం నిరర్థకమవుతుందని తాజాగా గుర్తించింది. దీంతో ఖర్చును తగ్గించుకునేందుకు ఆరు వరుసలను ఖరారు చేసింది. ఇప్పటి వరకు రోడ్డు నిర్మాణానికే రూ.9 వేల కోట్లకు పైగా ఖర్చవుతుందని లెక్కలేసిన నేపథ్యంలో, రెండు వరుసల రోడ్డును తగ్గిస్తే కి.మీ.కు రూ.15 కోట్లకు పైగా ఆదా అవుతుందని తేల్చింది. ఈ మేరకు అధికారులు చేసిన తాజా అంచనా ప్రకారం, సివిల్ కాస్ట్ రూ.7,300 కోట్లు అవుతోంది. వెరసి భూసేకరణతో కలిపి 16 వేల కోట్లతో ఉత్తర రింగు పూర్తవుతుంది.
ఒకేసారి ఆరు వరుసల నిర్మాణం
వచ్చే ఏడాది మే నెలలో రోడ్డు నిర్మాణ పనులు మొదలయ్యే అవకాశముంది. అప్పుడు ఒకేసారి ఆరు వరుసల రోడ్డును పూర్తి చేస్తారు. ప్రాజెక్టు డిజైన్ చేసిన కొత్తలో, తొలుత నాలుగు వరుసల రోడ్డు, భవిష్యత్‌లో ట్రాఫిక్ పెరిగిన తర్వాత మిగతా నాలుగు వరుసలు నిర్మించాలనుకున్నారు. ఈ ఏడాది ప్రథమార్థంలో నిర్ణయాన్ని సవరించుకొని, తొలుత ఆరు వరుసల రోడ్డు, భవిష్యత్‌లో మిగతా రెండు వరుసలు నిర్మించాలని నిర్ణయించారు. ఇప్పుడు రోడ్డు వెడల్పును ఆరు వరుసలకే పరిమితం చేసినందున.. మొత్తం రోడ్డు ఒకే దఫాలో సిద్ధం కానుంది. ఉత్తర భాగంలో 11 ఇంటర్ చేంజ్ స్ట్రక్చర్లుంటాయి. ఇతర రోడ్లను క్రాస్‌చేసే చోట వీటిని నిర్మిస్తారు.
మూడు నదులపై మూడు భారీ వంతెనలు, 105 మధ్యస్థ వంతెనలు, 85 కల్వర్టులుంటాయి. వీటన్నింటిని ఒకేసారి ఆరు వరుసల రోడ్డుకు సరిపడా నిర్మిస్తారు. భవిష్యత్‌లో రోడ్డు ఇరుకైతే సెంట్రల్ మీడియన్ స్థలంలో రెండు అదనపు వరుసలు...2045 నాటికి పెరిగే ట్రాఫిక్‌ను ఆరు వరుసల రోడ్డు తట్టుకుంటుందని తాజాగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించి ఆరు వరుసల రోడ్డు సరిపోతుందని తేల్చింది. కానీ, రోడ్డు నిర్మాణం తర్వాత భవిష్యత్‌లో అనూహ్యంగా ట్రాఫిక్ పెరిగి ఆరు వరుసల రోడ్డు ఇరుకుగా మారినా, 20 ఏళ్ల తర్వాత ఆరు వరుసలు సరిపోదని తేల్చినా... అదనంగా రెండు వరుసలు నిర్మించి ఎనిమిది లేన్లకు పెంచుతారు. ఇందుకు సెంట్రల్ మీడియన్‌ను తగ్గించి ఆ స్థలాన్ని వాడతారు. సెంట్రల్ మీడియన్‌కు ప్రస్తుతం 15 మీటర్ల స్థలం వదులుతున్నారు. భవిష్యత్‌లో దానిని ఏడున్నర మీటర్లకు కుదించి ఏడున్నర మీటర్ల స్థలాన్ని రెండు అదనపు వరుసల రోడ్డు నిర్మాణానికి వాడుతారు. ప్రస్తుతం ఆరు వరుసలకే కుదించటం వల్ల మిగిలే స్థలాన్ని స్ట్రీల్ లైట్లు, వాన నీటి డెయిన్లు, మొక్కల పెంపకానికి వినియోగిస్తారు.


