మన చుట్టూ ఉన్నవి శత్రు దేశాలే
* వాళ్లేం చేస్తున్నారో తెలుసుకోవాలి
* దేశ ఆస్తులను విధ్వంసం చేస్తున్న స్లీపర్ సెల్స్
* యాంటీడ్రోన్ టెక్నాలజీ లాంటివి అవసరం
* ఆపరేషన్ ఇంద్రజాల్ స్ఫూర్తిదాయకం
* సిగ్మా లాంటి సంస్థలే నిజమైన సైనికులు
* లెఫ్టినెంట్ జనరల్ వినోద్ జి. ఖండారే
హైదరాబాద్, నవంబర్ 28, 2025: మన చుట్టూ మనకు అస్సలు స్నేహంగా లేని శత్రుదేశాలే ఉన్నాయని.. వాళ్లను అర్థం చేసుకుని, వాళ్లేం చేస్తున్నారో గమనించడం చాలా ముఖ్యమని లెఫ్టినెంట్ జనరల్ వినోద్ జి. ఖండారే అన్నారు. భారత రక్షణ శాఖకు మాజీ ముఖ్య సలహాదారుగా పనిచేసిన ఆయన.. గురువారం నగరంలోని సిగ్మా ఎడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ వారు కొత్తగా రూపొందించిన యాంటీ డ్రోన్ వెహికిల్ ఇంద్రజాల్‌ను చూసి, ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు విషయాలు తెలిపారు.

‘‘మీరంతా టెక్నాలజీలో ముందున్నందుకు అభినందిస్తున్నాను. మీ కష్టపడేతత్వాన్ని, మంచి పనిని కొనసాగించండి. తక్కువ ధరలో ఉండే ఈ స్మార్ట్ సొల్యూషన్లు మనల్ని శత్రువుల కంటే ముందు ఉంచుతాయి. పాత రోజుల్లో మనం ఆత్మప్రబోధాన్ని వినేవాళ్లం. మన బలాబలాలు తెలుసుకునేవాళ్లం. అలాగే శత్రుఘోష కూడా వినేవాళ్లం. దాన్నిబట్టి మన శత్రువు ఎవరు, వాళ్ల బలాబలాలేంటో తెలిసేది. మన చుట్టూ మనకు అస్సలు స్నేహంగా లేని దేశాలే ఉన్నాయి. మనం వాళ్లని అర్థం చేసుకుని, వాళ్లేం చేస్తున్నారో తెలుసుకోవాలి.

మనమంతా ఒక సమర్థమైన ఆధునిక సైన్యం కోసం చూస్తున్నాం. ఇలాంటి స్టార్టప్‌లు, సిగ్మా లాంటివాళ్లు నిజమైన సైనికులు. వీళ్లే ఎల్ఓసీలో గానీ, ఎల్ఏసీలో గానీ, అంతర్జాతీయ సరిహద్దుల్లో గానీ, చివరకు దేశం నడిబొడ్డున కూడా మమ్మల్ని బలోపేతం చేస్తున్నారు. వీళ్లు రూపొందించిన యాంటీ డ్రోన్ వాహనం ఇంద్రజాల్ లాంటివి మనకు చాలా అవసరం. ఆపరేషన్ ఇంద్రజాల్ చాలా స్ఫూర్తిదాయకం. ప్రస్తుతం కైనెటిక్, నాన్ కైనెటిక్ యుద్ధాలు జరుగుతాయి.

స్లీపర్ సెల్స్ దేశంలోకి ప్రవేశించి దేశ ఆస్తులను నాశనం చేస్తున్నాయి, ప్రాణాలు తీస్తున్నాయి. ఇలాంటి సమయంలో కౌంటర్ డ్రోన్ పరిష్కారాలు చాలా అవసరం. ఇలాంటివాటి కోసమే మనం చూస్తున్నాం. ఇవి మనల్ని రక్షించడంతో పాటు ముందుండేలా చేస్తాయి. హ్యూమన్ క్యాపిటల్ స్మార్ట్‌గా ఉండాలి, దూరదృష్టి కలిగి ఉండాలి. ఇది జాతీయ నాయకత్వం ఏం ఆలోచిస్తోందో దానికి తగినట్లుగా మనం పరిష్కారాలు సూచించగలగాలి, అప్పుడే మనం యుద్ధాల్లో విజయం సాధించగలం.

నేను మాట్లాడడం మొదలుపెట్టేటప్పుడు జై హింద్ అన్నాను. దానికి అర్థం మన దేశానికి విజయం రావాలని. ఆ విజయం ఒలింపిక్ క్రీడల్లో కావచ్చు, ఆర్థికరంగంలో కావచ్చు, విజ్ఞానంలో, టెక్నాలజీలో కావచ్చు, యుద్ధాల్లోనైనా కావచ్చు. చాలామంది సైన్యం అంటే యుద్ధాలు చేయడానికే ఉందనుకుంటారు. కానీ బలమైన సైన్యం యుద్ధాన్ని నివారిస్తుందని మీరంతా తెలుసుకోవాలి. బలమైన అంటే కేవలం సంఖ్యలో కాదు.. సామర్థ్యంలో. ప్రజలు కావాలనుకున్నప్పుడే సైన్యం యుద్ధానికి దిగుతుంది.

మనమంతా దేశమే ముందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. మనమంతా మనలో విభేదాలు మర్చిపోయి, దేశం ముందుండాలని తెలుసుకోవాలి. అప్పుడు మనకు కేటాయించిన లక్ష్యం.. వికసిత్ భారత్ 2047ను సులభంగా సాధించగలం. ఇంకా ఆ లక్ష్యాన్ని పదేళ్ల ముందే చేరుకోగలం. వింగ్ కమాండర్ చెప్పినట్లు ప్రతి ఒక్క పౌరుడూ సైనికుడే’’ అని లెఫ్టినెంట్ జనరల్ వినోద్ జి. ఖండారే అన్నారు. ఈ కార్యక్రమంలో ఇంకా.. సిగ్మా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ భాగస్వామి, డైరెక్టర్ మంకెన శ్రీనివాసరెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ సి. దామోదర్ రెడ్డి, డైరెక్టర్లు సునీల్ కుమార్, మల్లెల సాయి, సంజయ్ కుమార్, ఇంద్రజాల్ సీఓఓ పరమేశ్వర్ రెడ్డి, ఢిల్లీ వసంత్ తదితరులు పాల్గొన్నారు.


