ఏందిరాబై మీ ఊరి సర్పంచ్ పదవికి పోటీ బాగా ఉందంట గదా... అవు మల్లా ఏమనుకుంటున్నావు... పోటీలో ఎందరు ఉన్నా ఇద్దరి మధ్యనే ప్రధాన పోటీ, ఒక్కో అభ్యర్థి రూ.కోటి వరకూ ఖర్చు పెడతా అంటున్నాడు... అగో గిదేంది మరి అంత ఖర్చా... అవురా మరి సర్పంచ్ సీటు అంటే అంత క్రేజీ ఉంది. ఎవరైనా పోటీలో దిగాలంటే కనీసం రూ. కోటి జమ ఉంచుకోవాల్సిందే.. ఇది మేజర్ పంచాయతీలలో జరుగుతున్న చర్చ.
మోర్తాడ్(బాల్కొండ): పంచాయతీ ఎన్నికలు ప్రారంభం కావడంతో గ్రామాల్లో ఎలక్షన్స్ హీట్ పెరిగింది. మండల కేంద్రాలు, మేజర్ గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ పదవికి పోటీ చేసేవారు రూ. కోటి ఖర్చుకు కూడా వెనుకాడటం లేదు. గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం వెలువరించడంతో ఎక్కడ చూసినా ఖర్చుపైనే చర్చ సాగుతుంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల సంఘానికి నామమాత్రం లెక్క చూపుతున్నా, క్షేత్ర స్థాయిలో మాత్రం భారీగా సొమ్ము కుమ్మరించాల్సి వస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
మండల కేంద్రాలు, జాతీయ రహదారిని ఆనుకొన్ని ఉన్న గ్రామాలలో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతుండటంతో అక్కడ సర్పంచ్ పదవిని పొందడానికి అభ్యర్థులు రూ. కోటి వరకూ సిద్ధం చేసుకుంటున్నారు. సర్పంచ్ స్థానం ఏ సామాజిక వర్గానికి రిజర్వు చేసినా ఖర్చు విషయంలో మాత్రం అభ్యర్థులు వెనుకంజ వేయకపోవడం చూస్తుంటే పదవిపై ఉన్న వ్యామోహం అంతా ఇంతా కాదని స్పష్టమవుతుంది. మోర్తాడ్, ముప్కాల్‌లలో సర్పంచ్‌కు పోటీ చేసే అభ్యర్థులు రూ. కోటి వరకూ ఖర్చు చేయాలని ఆలోచన చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. కమ్మర్‌పల్లి, మెండోరా, బాల్కొండ, వేల్పూర్, అంక్సాపూర్, లక్కోరా తదితర గ్రామాలలో పోటీ చేసే ఆశావాహులు రూ.25లక్షల నుంచి రూ.50లక్షల వరకూ ఖర్చు చేయాలనే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది.
చిన్నచితకా పంచాయతీల్లో ఆదాయం మాట ఎలా ఉన్నా పదవి పొందాలనే ఉద్దేశ్యంతో రూ.5లక్షల నుంచి రూ.10లక్షల వరకూ ఖర్చు చేయాలనే భావనలో అభ్యర్థులు ఉన్నారు. ఎన్నికల సంఘానికి అభ్యర్థులు చూపే ఖర్చు క్రమ పద్ధతిలోనే ఉంటుంది. క్షేత్ర స్థాయిలో మాత్రం అభ్యర్థుల ఖర్చు అంచనాలను మించిపోతుంది. సర్పంచ్ పదవికి ఫుల్ డిమాండ్ ఉండటం, ఎక్కడ చూసినా రియల్ ఎస్టేట్ ప్రభావం పెరిగిపోవడంతో పదవి కోసం అభ్యర్థులు అంచనాలను మించి ఖర్చు చేయాలని భావిస్తున్నారు. ఏదేమైనా సర్పంచ్ పదవిపై మోజుతో జేబులు ఖాళీ చేసుకోవడానికి ఎంతో మంది అభ్యర్థులు ముందుకు వస్తున్నారని చెప్పవచ్చు.


