సాక్షి,హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్. ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ సంక్రాంతి కానుక ప్రకటించారు. ఉద్యోగులకు మరో డీఏ ఇస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ సచివాలయంలో మీడియాతో మాట్లాడిన సీఎం రేవంత్ ప్రకటన చేశారు. డీఏ ఫైల్ మీద సంతకం చేసి వచ్చా. రేపో మాపో డీఏ జీవో వస్తుంది’అని తెలిపారు.
పెన్షనర్లకు డీఏ,డీఆర్ పెంపు
తెలంగాణ ప్రభుత్వం పెన్షనర్లకు డీఏ,డీఆర్ పెంపు ప్రకటించింది. ఈ నిర్ణయం రాష్ట్రంలోని వేలాది మంది పెన్షనర్లకు ఉపశమనం కలగనుంది. ప్రస్తుతం అమలులో ఉన్న 30.03శాతం డీఆర్‌ను 33.67శాతానికి పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పెంపు 2018 జూలై 1 తర్వాత రిటైర్డ్ అయిన పెన్షనర్లకు వర్తించనుంది. 2020 రివైజ్డ్ పే స్కేల్స్ ప్రకారం పెన్షన్ పొందుతున్న వారికి ఇది ప్రత్యక్ష లాభం కలిగిస్తుంది.
2018కి ముందు రిటైర్డ్ అయిన పెన్షనర్లకు కూడా డీఆర్ పెంపు వర్తించనుంది. 2015 పే స్కేల్స్ ప్రకారం పెన్షన్ పొందుతున్న వారికి డీఆర్ 68.628శాతం నుంచి 73.344శాతానికి పెరిగింది. 2016 పే స్కేల్స్ పెన్షనర్లకు డీఆర్ 42శాతం నుంచి 46శాతానికి పెంపు జరిగింది. UGC/AICTE 2006 పే స్కేల్స్ ప్రకారం పెన్షన్ పొందుతున్న వారికి డీఆర్ 221శాతం నుంచి 230శాతానికి పెరిగింది. ఈ పెంపు విద్యా రంగానికి చెందిన పెన్షనర్లకు గణనీయమైన లాభం కలిగించనుంది.
పెరిగిన డీఆర్ 2023 జూలై 1 నుంచి అమలులోకి వస్తుంది. 2023 జూలై నుంచి 2025 డిసెంబర్ వరకు పెరిగిన డీఆర్ బకాయిలు చెల్లించనున్నారు. ఈ బకాయిలు మొత్తం 30 నెలవారీ వాయిదాల్లో చెల్లించబడతాయి. 2026 జనవరి నెల పెన్షన్‌తో పెరిగిన డీఆర్ చెల్లింపులు ప్రారంభమవుతాయి. ఫిబ్రవరి 2026లో పెన్షన్ మరియు డీఆర్ చెల్లింపులు పూర్తిగా అమలులోకి వస్తాయి. ఈ పెంపు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ గ్రాంట్స్ పొందుతున్న వారికి వర్తించదు. కేవలం పెన్షన్ పొందుతున్న వారికి మాత్రమే ఈ లాభం అందుతుంది.
జిల్లాల పునర్విభజనపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్విభజనపై సీఎం రేవంత్ కీలక ప్రకటన చేశారు. త్వరలో ఈ అంశంపై కమిటీ ఏర్పాటు చేస్తామని ఆయన వెల్లడించారు. ‘జిల్లాల సరిహద్దులు మార్చాలని ప్రజల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. అందుకే జిల్లాల పునర్విభజన కోసం ఒక రిటైర్డ్ జడ్జి ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేయనున్నాం. ఈ కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటాం.
జిల్లాల పునర్విభజనపై అసెంబ్లీలో చర్చ జరిపి, సభ్యుల సలహాలు తీసుకున్నాకే తుది నిర్ణయం తీసుకుంటాం. ఈ అంశంపై అపోహలు పెట్టుకోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ముందుగా మండలాల రేషనలైజేషన్, తర్వాత రెవెన్యూ డివిజన్ల రేషనలైజేషన్, ఆ తర్వాతే జిల్లాల పునర్విభజన జరుగుతుంది’ అని తెలిపారు.


