సాక్షి, హైదరాబాద్: ఉపాధి హామీ పథకం మీద కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. నీతి ఆయోగ్ సూచనలతో కొత్త ఉపాధి హామీ పథకంలో మార్పులు తెచ్చినట్టు చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో బీఆర్‌ఎస్, ఎంఐఎంపై సంచలన విమర్శలు గుప్పించారు. ఎంఐఎం సూచనలు బీజేపీకి అవసరం లేదంటూ వ్యాఖ్యలు చేశారు.
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘ఉపాధి హామీ కొత్త చట్టంతో ఈ పథకంలో సాంకేతికత ఉపయోగించాం. పారదర్శకత, జవాబుదారీతనం తీసుకొచ్చాం. వంద రోజుల పని దినాలను 125కి పెంచాం. వ్యవసాయానికి అనుసంధానం చేస్తున్నాం. వ్యవసాయ పీక్ సీజన్‌లో కూలీల కొరత లేకుండా ఈ పథకంతో లబ్ది జరుగుతుంది. వ్యవసాయ సీజన్ లేనప్పుడు 125 పని దినాలు దొరికేలా కొత్త చట్టం చేశాం. రాష్ట్రాలకి అదనపు భారం వేయడమే కాదు.. కేంద్రం కూడా అదనంగా ఖర్చు పెడుతుంది. కేంద్రం కూడా 340 కోట్లు లాస్ట్ ఇయర్ కంటే ఎక్కువ రాష్ట్రానికి వస్తాయి.
కూలీల పేరుతో నకిలీ జాబ్ కార్డులు తయారు చేసే దళారీ వ్యవస్థను నిర్మూలించడం జరిగింది. నీతి ఆయోగ్ సూచనలతో కొత్త ఉపాధి హామీ పథకంలో మార్పులు చేశాం. పథకాన్ని నీరుగార్చడం కాదు పటిష్ఠం చేశాం. కాంగ్రెస్ తప్పుడు ఆరోపణలు చేస్తోంది. రాష్ట్రాలు కూడా బాధ్యత కూడా తీసుకోవాలి. కాంగ్రెస్ దేశంలో రెండు మూడు చిన్న రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉంది అని చెప్పుకొచ్చారు.
బీఆర్‌ఎస్‌కు కౌంటర్..
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి..‘బీఆర్ఎస్ పని అయిపోయింది. పార్లమెంట్, ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచి చూపించాం కదా. గాలివాటం అయితే దేశంలో మూడు సార్లు అధికారంలోకి వస్తామా?. మళ్లీ గెలిచి దేశంలో ప్రధానిగా మోదీ అధికారంలోకి వస్తారు. ఎవరిది గాలివాటమో ప్రజలకు తెలుసు’ అని అన్నారు.
ఎంఐఎంపై వ్యాఖ్యలు..
పాకిస్తాన్‌లో హిందువులు లేకుండా చేశారు. బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు జరుగుతున్నాయి. దేశంలో హిందువులు లేకుంటే ప్రజాస్వామ్యం ఉండదు. ముస్లిం మహిళ ప్రధాని కావాలని ఎంఐఎం నేత అనడంలో ఉద్దేశం ఏంటి?. దేశ ప్రజలను భయపెట్టే చర్యగా ఎంఐఎం నేతలు ఉన్నారు. అవగాహన లేకుండా దుందుడుకుగా వ్యవహరించడం అసద్‌కు అలవాటు. సర్జికల్ స్ట్రైక్, ఎయిర్ స్ట్రైక్ చేసి పాకిస్తాన్ భూభాగంలో ఉగ్రవాదులను మట్టుపెట్టారు. దేశం అభివృద్ధి చేసుకోవాలనే దృష్టి పెట్టాం. దేశ రక్షణకు మోదీ అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఎంఐఎం సూచనలు మాకు అవసరం లేదు అని ఘాటుగా విమర్శలు చేశారు.


