సాక్షి, ఢిల్లీ: పోలవరం-నల్లమల్ల సాగర్ ప్రాజెక్ట్ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. తెలంగాణ దాఖలు చేసిన పిటిషన్ విచారణకు అర్హత లేదని సుప్రీంకోర్టు చెప్పుకొచ్చింది. ఈ కేసుతో కర్ణాటక, మహారాష్ట్ర అంశాలు ముడిపడి ఉన్నాయి అంటూ వ్యాఖ్యలు చేసింది.
అయితే, పోలవరం-నల్లమల్ల సాగర్ ప్రాజెక్ట్‌పై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ లాయర్ అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. అనంతరం, తెలంగాణ దాఖలు చేసిన పిటిషన్ విచారణకు అర్హత లేదని ధర్మాసనం తేల్చి చెప్పింది. ఈ క్రమంలో ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పరిష్కారం పొందేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో, తమ పిటిషన్ ఉపసంహరించుకుంటున్నామని అభిషేక్ సింఘ్వీ తెలిపారు.
రిట్ పిటిషన్ ఉపసంహరించుకుంది. అయితే, గోదావరి నది జలాల విషయంలో మహారాష్ట్ర, కర్ణాటక వాదనలు కూడా వినాల్సి ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నీటి కేటాయింపుల ఉల్లంఘనలపై అన్ని రాష్ట్రాల వాదనలు వినేందుకు సివిల్ సూట్ ఫైల్ చేయాలని ధర్మాసనం సూచనలు చేసింది. దీంతో, సివిల్ సూట్ ఫైల్ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం.. సుప్రీంకోర్టుకు తెలిపింది.


