హైదరాబాద్: పోలీసులు వద్దు వద్దంటున్నా కొందరు చైనా మాంజా వాడుతున్నారు. కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నా వాడుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. ద్విచక్రవాహనాల్లో వెళుతున్న వారు అది తగిలి ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఊ బైక్‌పై వెళుతున్న ఓ యువకుడు చైనా మాంజా కారణంగా తీవ్రంగా గాయపడ్డాడు. బొటానికల్ గార్డెన్–కొత్తగూడ ఫ్లై ఓవర్‌పై ఈ సంఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. వైజాగ్‌కు చెందిన కుందుం సూర్య తేజ(33) మియాపూర్‌లోని ఎస్‌ఆర్ ఎస్టేట్‌లో నివాసం ఉంటూ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు.
ఆదివారం మధ్యాహ్నం ఇంటికి వెళుతుండగా బొటానికల్ గార్డెన్–కొత్తగూడ ఫ్లై ఓవర్‌పై చైనా మాంజా ఎడమ భుజానికి తాకింది. చూసుకునే లోపు అది తీవ్ర గాయం చేసింది. స్నేహితులకు ఫోన్ చేయడంతో హుటాహుటిన వచ్చిన వారు 108 అంబులెన్స్‌లో మాదాపూర్ యశోద హస్పిటల్‌కు తరలించారు. దాదాపు 15 సెంటీ మీటర్ల గాయం కాగా డాక్టర్లు శస్త్ర చికిత్స చేసినట్లు స్నేహితులు తెలిపారు. గచి్చబౌలి పోలీసులు వెంటనే యశోద ఆస్పత్రికి వెళ్లి బాధితుని స్టేట్‌మెంట్ రికార్డు చేసి కేసు నమోదు చేశారు. చైనా మాంజాలు వాడవద్దని, ఎవరైనా అమ్మినా, వాడినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఇన్‌స్పెక్టర్ బాలరాజు హెచ్చరించారు.
బాలుడికి తీవ్ర గాయాలు
నాగోలు గణేష్‌నగర్ కాలనీ చెందిన వెల్టూరు గోపాల్ కుమారుడు మనోజ్(14) 9 వ తరగతి చదువుతున్నాడు. శనివారం సాయంత్రం స్కూల్ నుంచి బైక్‌పై వెనుక కూర్చుని ఇంటికి వస్తుండగా, రోడ్డుపై పడివున్న చైనా మాంజా దారం కుడి పాదానికి చుట్టుకోవడంతో తీవ్రంగా గాయమై రక్తస్రావం జరిగింది. కుటుంబ సభ్యులు వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, వైద్యులు పరీక్షించి కాలి వేలుకు రక్తం సరఫరా చేసే నరం తెగిపోయిందని తెలిపారు. ఎనిమిది కుట్లు వేసి చికిత్స అందించారు. ప్రస్తుతం మనోజ్ అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని వైద్యులు తెలిపారు.


