సాక్షి, ఢిల్లీ: విమానంలో శబరిమలకు వెళ్లే స్వాములకు కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. ఇరుముడిని తమతో పాటు తీసుకెళ్లేందుకు అనుమతిస్తూ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో చెక్‌ఇన్ లగేజీగా పంపేలా ఇంతకాలం ఉన్న ఆదేశాలను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపింది. దీంతో కేబిన్ బ్యాగేజీగా తమ వెంట తీసుకెళ్లడానికి స్వాములకు వీలు కలగనుంది.
తాజా నిర్ణయంతో.. శబరిమల యాత్రకు వెళ్లే భక్తులు, ఎయిర్‌పోర్టు భద్రతా తనిఖీలను పూర్తి చేసిన అనంతరం, తమ ఇరుముడిని చేతి సామానుగా విమాన క్యాబిన్‌లో తమతో పాటు తీసుకువెళ్ళవచ్చు. భక్తుల విశ్వాసానికి విలువ ఇస్తూ.. సంబంధిత భద్రతా శాఖలతో సమీక్షించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు తెలిపారు. జనవరి 20వ తేదీ వరకు ఇది వర్తిస్తుందని అన్నారాయన.
శబరిమల దర్శనానికి వెళ్లే అయ్యప్ప భక్తులు విమాన ప్రయాణం సమయంలో తమ పవిత్ర ఇరుముడిని (కొబ్బరికాయతో సహా) ఇప్పుడు చేతి సామానుగా తమతో పాటు తీసుకెళ్లుకునే విధంగా ప్రత్యేక వెసులుబాటు కల్పించనున్నారు. ఇప్పటివరకు అమలులో ఉన్న భద్రతా నియమావళి ప్రకారం ఇరుముడిని తప్పనిసరిగా చెక్-ఇన్ లగేజీగా పంపాల్సి రావడం వల్ల భక్తులు కొంత అసౌకర్యాన్ని ఎదుర్కొంటూ వచ్చారు. ఈ కారణంగానే చాలామంది స్వాములు విమాన ప్రయాణాలకు దూరంగా ఉంటూ వచ్చేవారు.
అయితే భక్తుల ఇక్కట్ల నేపథ్యంలో ప్రత్యేక మినహాయింపు అమలు చేయాలని నిర్ణయించారు. ఈ ప్రత్యేక సడలింపు ఈ రోజు నుంచే(నవంబర్ 28, 2025) అమల్లోకి వస్తూ, మండల పూజల కాలం నుంచి మకర విలక్కు ముగిసే జనవరి 20 వరకు దేశవ్యాప్తంగా వర్తిస్తుందని, భక్తులు సహకరించాలని పౌర విమానయాన విజ్ఞప్తి చేసింది.


