కొచ్చి: కేరళలోని కొచ్చిలో భూటాన్ కార్ల స్మగ్లింగ్ ముఠా గుట్టు రట్టయ్యింది. భూటాన్ నుండి అక్రమంగా భారత్‌కు తరలించిన టయోటా ల్యాండ్ క్రూయిజర్ కారును.. భారత రాయబార కార్యాలయం (Indian Embassy) వాహనంగా నమ్మించి, విక్రయించిన ఘటనపై కొచ్చి పోలీసులు కేసు నమోదు చేశారు. ఢిల్లీకి చెందిన రోహిత్ బేడీ అనే వ్యక్తి ఎడపల్లి(కేరళ)కి చెందిన మహమ్మద్ యాహ్యాను నమ్మించి, కారు విక్రయానికి రూ. 14 లక్షలకు డీల్ కుదుర్చుకున్నాడు.
విలాసవంతమైన కార్లను తక్కువ ధరకే విక్రయించడానికి మోసగాళ్లు వాటిని ‘ఎంబసీ వెహికల్’గా చెబుతుంటారు. దీనిని నమ్మిన బాధితుడు, దఫదఫాలుగా నగదు రూపంలోనూ, బ్యాంక్ బదిలీల ద్వారా కారు కొనుగోలుకు మొత్తం సొమ్మును చెల్లించాడు. గత ఏడాది అక్టోబర్‌లో కస్టమ్స్ విభాగం చేపట్టిన ‘ఆపరేషన్ నుంఖోర్’లో భాగంగా హిమాచల్ ప్రదేశ్ రిజిస్ట్రేషన్ కలిగిన ఈ ల్యాండ్ క్రూయిజర్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. భూటాన్ నుండి అక్రమ మార్గాల్లో దిగుమతి చేసుకుని, నకిలీ పత్రాలతో భారత్‌లో రిజిస్ట్రేషన్ చేయించిన వాహనాలను అరికట్టేందుకు ఈ ఆపరేషన్ ప్రారంభమైంది.
తాను కొనుగోలు చేసిన కారు ఎంబసీ వాహనం కాదని, అక్రమంగా స్మగ్లింగ్ చేసినదని గుర్తించిన బాధితుడు యాహ్యా, తనను మోసం చేసిన బ్రోకర్‌పై ఎర్నాకులం సెంట్రల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తులో దీని వెనుక భారీ నెట్‌వర్క్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. భూటాన్‌లో పన్నులు తక్కువగా ఉన్న కారణంగా, అక్కడి నుంచి కార్లను దిగుమతి చేయడం లేదా పాత కార్లను కొనుగోలు చేసి భారత్‌కు తరలించడం లాంటి పనులను ముఠా సభ్యులు చేస్తుంటారు. అలాగే భారీ దిగుమతి సుంకాలను తప్పించుకునేందుకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ లేదా భారత సైన్యానికి చెందిన నకిలీ ఎన్‌ఓసీలను సృష్టిస్తారు. తరువాత హిమాచల్ ప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేసి, కేరళ తదితర దక్షిణాది రాష్ట్రాల్లోని కొనుగోలుదారులకు భారీ ధరలకు ఆ కార్లను విక్రయిస్తుంటారు.
బాధితుడి ఫిర్యాదు మేరకు నిందితుడు రోహిత్ బేడీపై ఐపిసి సెక్షన్ 406 (నమ్మక ద్రోహం), 420 (చీటింగ్) కింద పోలీసులు కేసు నమోదు చేశారు. సబ్ ఇన్‌స్పెక్టర్ అనూప్ సి నేతృత్వంలో ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది. కొనుగోలుకు సంబంధించిన పత్రాలను, బ్యాంక్ లావాదేవీల వివరాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ స్మగ్లింగ్ రాకెట్‌లో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందనే కోణంలో విచారణ జరుపుతున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: పతంగులు ఎగురవేసిన ప్రధాని మోదీ


