‘‘ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా... బుల్లెట్ దిగిందా లేదా?’’ అంటాడో హీరో. ఇప్పుడీ డైలాగును ఐఐటీ మద్రాస్ కూడా గర్వంగా కొట్టేయవచ్చు. అవును మరి.. ప్రపంచంలోని ఏ దేశానికీ లేని సరికొత్త, వినూత్నమైన తుపాకీ గుండును ఈ సంస్థ విజయవంతంగా తయారు చేసి పరీక్షించింది కూడా. ఈ సరికొత్త తుపాకీ గుండును, ధనుష్ హోవిట్జర్, కే-9 వజ్ర-టీ, బోఫోర్స్ వంటి తుపాకుల్లో పెట్టి కాల్చామనుకోండి... ఒకొక్కటీ మామూలు బుల్లెట్ల కంటే సగం దూరం ఎక్కువ ప్రయాణిస్తాయి. అదే సమయంలో వీటి విధ్వంసక శక్తి ఏమాత్రం తగ్గకపోవడం విశేషం. ఈ అద్భుత ఆవిష్కరణ విశేషాలు...
దేశ సరిహద్దుల రక్షణలో శతఘ్ని వ్యవస్థల పాత్ర చాలా కీలకం. అయితే వీటితో ఒక చిక్కుంది. ధనుష్ హోవిట్జర్‌సహా 155 మిల్లీమీటర్ల గుండ్లు వాడే తుపాకులు ప్రయాణించగలిగే దూరం 40 కిలోమీటర్లకు మించదు. అందుకే మన భద్రత దళాలు వీటిని సరిహద్దుల్లో అతి దగ్గరి నుంచి జరిపే దాడులకు మాత్రమే ఉపయోగిస్తూంటారు. కొంచెం ఎక్కువ దూరంలోని లక్ష్యాలను తాకాలంటే ప్రళయ్ (150 - 500 కిలోమీటర్లు) లేదా పినాక (40 - 90 కి.మీ)లు వాడాల్సి ఉంటుంది. తుపాకులతో పోలిస్తే రాకెట్లతో పనిచేసే క్షిపణుల తయారీ, మోహరించడం రెండూ వ్యయ, ప్రయాసలతో కూడుకున్నవే. ఇలా కాకుండా.. తూపాకులతోనే వంద కిలోమీటర్ల దూరాన్ని కూడా తాకగలిగితే...? ఐఐటీ మద్రాస్ అభివృద్ధి చేసి, విజయవంతంగా పరీక్షించిన రామ్‌జెట్ ఇంజిన్లు సరిగ్గా ఇదే పని చేస్తాయి.

ఏమిటీ రామ్‌జెట్?
రాకెట్ ఇంజిన్ మాదిరిగానే ఇది కూడా ఓ ఇంజిన్. అంతే. కాకపోతే.. రాకెట్ ఇంజిన్ల మాదిరి వీటిల్లో బోలెడన్ని విడిభాగాలు ఉండవు. గాలిని పీల్చుకుని, తనలోని ఇంధనానికి కలిపి ముందుకు దూసుకెళుతూంటుంది. ధ్వని కంటే మూడు నుంచి ఆరు రెట్లు ఎక్కువ వేగంతో వెళ్లగలదు. ఇంజిన్లతో పనిచేసే క్షిపణులు రష్యాతోపాటు ఫ్రాన్స్, ఇండియా, ఫ్రాన్స్, చైనా, స్వీడన్, యూకేల వద్ద మాత్రమే ఉన్నాయి. అగ్రరాజ్యం అమెరికా వద్ద కూడా లేవు. ఐఐటీ మద్రాస్ శాస్త్రవేత్తల పరిశోధనల పుణ్యమా అని ఇప్పుడు ఈ టెక్నాలజీ క్షిపణుల కంటే చాలా తక్కువ సైజులో ఉండే తుపాకీ గుళ్లలోకి చేరిపోయింది. భారత ఆర్మీ బోర్డు, ఐఐటీ మద్రాస్‌లు సంయుక్తంగా తయారు చేసిన రామ్‌జెట్ ఆధారిత తుపాకీ గుండ్లను ప్రోఖ్రాన్‌లో విజయవంతంగా పరీక్షించారు. ప్రొఫెసర్తు పి.ఎ.రామకృష్ణ, హెచ్‌ఎస్‌ఎన్ మూర్తి, జి.రాజేశ్, ఎం.రామకృష్ణ, మురుగయన్, లాజర్‌లతోపాటు విశ్రాంత లెఫ్టినెంట్ జనరల్ పి.ఆర్.శంకర్, లెఫ్టినెంట్ జనరల్ హరి మోహన్ అయ్యర్, డాక్టర్ యేగేశ్ కుమార్ వేలరిలతో కూడిన బృందం రామ్‌జెట్ ఆధారిత తుపాకీ గుండ్ల తయారీలో కీలకపాత్ర పోషించారు.

క్షిపణుల్లోనూ వాడవచ్చు: ప్రొఫెసర్ రామకృష్ణ
రామ్‌జెట్ టెక్నాలజీని బోఫోర్స్ మినహా ఇతర క్షిపణుల్లో వాడేందుకు తాము అభివృద్ధి చేసిన టెక్నాలజీ ఉపయోగపడుతుందని ఐఐటీ మద్రాస్‌లోని ఏరోస్పేస్ ఇంజినీరింగ్ విభాగపు అధ్యక్షుడు ప్రొఫెసర్ పి.ఎ.రామకృష్ణ తెలిపారు. ఈ దిశగా ఇప్పటికే కొన్ని ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలిపారు. తొలుత తాము 76 మిల్లీమీటర్ తుపాకులతో రామ్‌జెట్ ఆధారిత తుపాకీ గుండ్లను పరీక్షించి చూశౠమని, ఆ తరువాత దశలవారీగా 155 మిల్లీమీటర్ల శతఘ్ని వ్యవస్థకు విస్తరించామని వివరించారు. గత ఏడాది సెప్టెంబరులో దియోలాలీలోని స్కూల్ ఆఫ్ ఆర్టిలరీలో విజయవంతంగా పరీక్షలు నిర్వహించామని, తుపాకీ నుంచి గుండు చాలా స్పష్టంగా బయటపడటంతోపాటు స్థిరమైన వేగంతో ప్రయాణించిందని, రామ్‌జెట్ ఇంజిన్ కూడా సకాలంలో మండిందని ఆయన వివరించారు. డిసెంబరులో వీటిని పోఖ్రాన్‌లోని ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్‌లో పరీక్షించామని తెలిపారు. ప్రస్తుతం ఈ టెక్నాలజీకి తుదిమెరుగులు దిద్దుతున్నామని, అన్నీ సవ్యంగా సాగి భద్రత దళాలు వాడటం మొదలుపెడితే ఖర్చు కలిసిరావడమే కాకుండా.. వ్యూహాత్మకంగానూ ఎన్నో ప్రయోజనాలుంటాయని చెప్పారు.


