జాతీయ ప్రవేశ పరీక్షల్లో కీలకపాత్ర పోషించనున్న కృత్రిమ మేధ
డేటా ఆధారిత ప్రశ్నపత్రాల రూపకల్పన
తొలుత జేఈఈ మెయిన్స్‌తో ప్రయోగం
తర్వాత అన్ని పోటీ పరీక్షలకు ఏఐ టూల్
బాంబే ఐఐటీ నివేదిక
సవాళ్లను తేలికగా తీసుకోవద్దు అంటున్న మద్రాస్ ఐఐటీ
సాక్షి, హైదరాబాద్: జాతీయ పోటీ పరీక్షల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కీలకపాత్ర పోషించబోతోంది. కేంద్ర విద్యాశాఖ ఈ దిశగా కీలక నిర్ణయం తీసుకోనుంది. ప్రధానంగా జేఈఈ మెయిన్స్‌లో వీలైనంత త్వరగా ఏఐని అందుబాటులోకి తేనున్నారు. కాన్సెప్ట్ క్లారిటీ మాడ్యూల్స్‌ను రంగంలోకి దించబోతున్నారు. ఐఐటీ ముంబై ఇందుకు సంబంధించిన అధ్యయనం పూర్తిచేసింది. సాధ్యాసాధ్యాలపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఐఐటీలు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీతో కేంద్ర విద్యాశాఖ ఉన్నతాధికారులు త్వరలో సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. వచ్చే ఏడాది జరిగే జేఈఈ మెయిన్స్ రెండో విడత పరీక్షలో కొంతమేర దీన్ని అనుసరించాలని నిర్ణయించినట్టు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ ప్రయోగంలో ఎదురయ్యే సవాళ్లపై సమీక్షిస్తారు. మార్పులు, చేర్పుల తర్వాత 2027లో పూర్తిస్థాయిలో ఏఐని అందుబాటులోకి తేవాలని భావిస్తున్నారు. తొలుత జేఈఈ వరకూ పరిమితం చేసి, ఆ తర్వాత నీట్, ఇతర ప్రవేశ పరీక్షలకు ఏఐని అందుబాటులోకి తేవాలనే యోచనలో ఉన్నారు.
సెక్యూరిటీ మాడ్యూల్స్‌పై కసరత్తు
జేఈఈ పరీక్షను దేశవ్యాప్తంగా 10 లక్షల మందికిపైగా విద్యార్థులు రాస్తున్నారు. ఆన్‌లైన్ విధానంలో జరిగే ఈ పరీక్షకు ప్రశ్నపత్రం రూపకల్పన మొదలు, మూల్యాంకనం వరకూ జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో పటిష్టమైన సెక్యూరిటీ ఫీచర్స్ ఉండాలని ఐఐటీ–బాంబే కేంద్రానికి సూచించింది. ప్రతీ పోటీ పరీక్షకు ప్రత్యేక లాంగ్ లెర్నింగ్ మాడ్యూల్స్ అవసరం ఉందని పేర్కొంది. ప్రశ్నపత్రాల తయారీ, ఏఐ ఆధారిత డేటా అనలిటిక్స్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపింది. అమెరికా, కెనడా, ఆ్రస్టేలియాతోపాటు పలు దేశాల్లో ఏఐ ఆధారిత మాడ్యూల్స్‌ను ప్రత్యేకంగా రూపొందించారు.
సైబర్ నేరాలకు సాధ్యం కాని ఫైర్‌వాల్స్ రూపొందించినట్లు ముంబై–ఐఐటీ అధ్యయనంలో వెల్లడైంది. ప్రస్తుతం జేఈఈ ప్రశ్నపత్రాన్ని దాదాపు పది సెట్లుగా తయారు చేస్తారు. ఇందులో కఠినం, మధ్యస్థం, సాధారణ ప్రశ్నలు ఉంటాయి. వీటిలో సాఫ్ట్‌వేర్ ఆధారంగానే పది సెట్ల నుంచి ప్రశ్నలు ఎంపికవుతాయి. ఏఐ టెక్నాలజీతో చాప్టర్స్, సిలబస్ ఆధారంగా డేటాను ఫీడ్ చేస్తారు. వీటిలో ఏఐ మాడ్యూల్స్ అవసరమైన ప్రశ్నలను ఎంపిక చేస్తాయి. తుది కూర్పు తర్వాత ప్రశ్నపత్రం కేంద్రీకృత అధికారి పాస్‌వర్డ్‌తోనే పరీక్ష కేంద్రాల్లో ఓపెన్ అవుతుంది. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ హాక్ అవ్వడానికి, ప్రశ్నపత్రం లీక్ అయ్యేందుకు ఆస్కారం ఉండదని నిపుణులు అంటున్నారు. ఏఐకి అందించే డేటా కూడా అత్యంత గోప్యంగా ఉండాలని చెబుతున్నారు.
సమస్యల పరిష్కారంపై సాధన
డేటా ప్రైవసీ, అల్గారిథమ్‌లో కొన్ని సమస్యలున్నాయని ఐఐటీ–మద్రాస్ నిపుణులు అంటున్నారు. ఫీడ్ చేసే డేటా ఇతర సంస్థలకు వెళ్తే, ఏఐ టూల్ అక్కడా ఉంటే ప్రశ్నలు కొన్ని ముందే తెలిసే వీలుందని భావిస్తున్నారు. సంప్రదాయంగా జరిగే ప్రశ్నపత్రం కూర్పులో మేథ్స్, ఫిజిక్స్‌లో ట్విస్ట్ చేసే ప్రశ్నల తయారీ కోసం ఏఐకి సరికొత్త మాడ్యూల్స్ అందించాలి. లేకపోతే చాప్టర్ ఆధారంగానే సాధారణ ప్రశ్నావళి వస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఏఐ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది.. అనేక దేశాల డేటా కేంద్రాలకు సమన్వయం అవుతుంది. కాబట్టి ప్రశ్నావళి రూపకల్పనలో ఇతర డేటాను ఏఐ తీసుకుంటే, విద్యార్థులు గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంటుంది. దేశంలోని పోటీ పరీక్షలకు, అందులోనూ ప్రతీ సబ్జెక్టుకు విస్తృతమైన దేశీయ డేటాను డేటా సెంటర్‌కు ఫీడ్ చేయడం, దాన్ని నిర్వహించడంపై కసరత్తు జరగాలని సూచిస్తున్నారు.
కోచింగ్‌లోనూ ఏఐ దూకుడు
వాస్తవానికి ఆన్‌లైన్ కోచింగ్ కేంద్రాలు, కార్పొరేట్ కాలేజీలు ఇప్పటికే ఏఐని విరివిగా వాడుతున్నాయి. విద్యార్థి బలాలు, బలహీనతలు,వ్యక్తిగత స్టడీప్లాన్, రోజువారీ ప్రాక్టీస్ ప్రశ్నలు, సందేహాల నివృత్తికి 6.5 లక్షల మంది జేఈఈ రాసే విద్యార్థులు ఏఐ, చాట్‌బాట్‌ను వాడుతున్నారు. గత రెండేళ్ల ప్రశ్నల ఆధారంగా ట్రెండ్ అనాలసిస్‌ను ఏఐ అందిస్తోంది.
విద్యార్థి స్థాయికి అనుగుణంగా ప్రశ్నలు తయారు చేస్తూ మాక్ టెస్టులు, అడాప్టివ్ లెర్నింగ్ టెస్టులను ఏఐ ట్యూటర్లు అందిస్తున్నాయి. సమయ పాలన, స్కోర్, ర్యాంకు అంచనాలను ఎప్పటికప్పుడు విశ్లేషించే ఏఐ అనుసంధాన ప్రిపరేషన్ మాడ్యూల్స్ అందుబాటులోకి వచ్చాయి.
ఏఐ ప్రాక్టరింగ్‌తో ఫేస్ రికగ్నిషన్, విద్యార్థి ప్రవర్తనను గుర్తించే ఎల్‌ఎల్‌ఆర్‌ఎంలు రెండేళ్లుగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. దీని ఆధారంగా పోటీ పరీక్షల్లో విద్యార్థిస్థాయి, ఆందోళనను ఆన్‌లైన్‌లో అందిస్తున్నారు. సలహాలు, సూచనలు ఏఐ నుంచి అందుతున్నాయి. ఏఐ ఆధారిత డిజిటల్ ప్లాట్‌ఫాంతో స్మార్ట్ కోచింగ్ వల్ల గ్రామీణ విద్యార్థులు నాణ్యమైన కంటెంట్ అందుకుంటున్నారు. ఆబ్జెక్టివ్ ప్రశ్నల్లో వేగంగా ఫలితాలు వస్తున్నాయి.


