కొంటున్నారా? కుమ్మక్కు అవుతున్నారా? | Thermal chemicals are going astray | Sakshi
Sakshi News home page

కొంటున్నారా? కుమ్మక్కు అవుతున్నారా?

Feb 10 2026 2:20 AM | Updated on Feb 10 2026 2:20 AM

Thermal chemicals are going astray

దారి తప్పుతున్న థర్మల్‌ రసాయనాలు

సాక్షి, హైదరాబాద్‌: థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్లలో వాడే రసాయనాల లెక్కలు తప్పుతున్నాయి. అధికారులు అవసరానికి మించి వాటిని కొనుగోలు చేస్తుండటంతోపాటు వాడకుండానే వాటిని గడువు తీరిందని భూస్థాపితం చేస్తున్నారు. దీనివల్ల థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్లకు ఏటా రూ. కోట్లలో నష్టం వాటిల్లుతోంది. దీనిపై నియంత్రణ ఉండాలని కేంద్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (సీఈఆర్‌సీ) అన్ని రాష్ట్రాల విద్యుదుత్పత్తి కేంద్రాలకు సూచించింది. అలాగే ఈ వ్యవహారంపై రాష్ట్రాల రెగ్యులరేటరీ కమిషన్లు కూడా దృష్టి పెట్టాలని కోరింది. అవసరం లేకున్నా ఎందుకు కొంటున్నారు? అసలు కొంటున్నారా లేక కేవలం లెక్కల్లో చూపిస్తున్నారా? అనే విషయాలు తెలియట్లేదని పేర్కొంది. విద్యుత్‌ అధికారులు మాత్రం ఈ విషయంలో భిన్న వాదన వినిపిస్తున్నారు. ఉత్పత్తి చేస్తామనే లక్ష్యంతో రసాయనాలు కొనుగోలు చేస్తున్నామంటున్నారు. మార్కెట్లో చౌక విద్యుత్‌ లభించడం వల్ల జెన్‌కో ప్లాంట్లను బ్యాకింగ్‌ డౌన్‌ (ఉత్పత్తి తగ్గించడం) చేస్తున్నామని చెబుతున్నారు. ఈ కారణంగానే రసాయనాలు నిరుపయోగమవుతున్నాయని చెబుతున్నారు. 

ఇవీ వాడే రసాయనాలు 
బొగ్గు ఆధారిత థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల్లో బాయిలర్‌లోకి పంపే నీళ్ళు అత్యంత స్వచ్ఛంగా ఉండాలి. నీళ్ళల్లో మలినాల తొలగింపునకు అలమ్, ఫెర్రిక్‌ క్లోరైడ్‌ వాడతారు. నీటి కాఠిన్యం తొలగించేందుకు లైమ్, కాఠిన్య నియంత్రణకు సోడియం కార్బొనేట్, క్రిములను తొలగించేందుకు హైడ్రోక్లోరిక్‌ ఆమ్లం వంటివి వాడతారు. బాయిలర్‌ ట్యూబుల్లో తుప్పు రాకుండా ఫాస్పేట్లు, హైడ్రోజన్, అమోనియా, ఆంటీ–ఫోమింగ్‌ ఏజెంట్లు వాడతారు. కండెన్సర్‌ పైపుల్లో ఫౌలింగ్‌ (వ్యర్థ పదార్థాలు పేరుకుపోవడం) రాకుండా బయోసైడ్లు, కాల్షియం డిపాజిట్లు తగ్గించేందుకు స్కేల్‌ ఇన్హిబిటర్లు, పైపుల రక్షణకు కరోషన్‌ ఇన్హిబిటర్లు (తుప్పు నిరోధక రసాయనాలు), సల్ఫ్యూరిక్‌ ఆమ్లం వాడతారు. థర్మల్‌ కేంద్రాల్లో బూడిద పెరగకుండా ఉండేందుకు డస్ట్‌ సప్రెషన్‌ కెమికల్స్‌ అవసరం. వాయు కాలుష్య నియంత్రణకు లైమ్, ఆక్టివేటెడ్‌ కార్బన్‌ వంటివి వాడాలి. 

థర్మల్‌ ప్లాంట్‌ సామర్థ్యాన్ని బట్టి ఏడాదికి ఎంత అవసరమో ముందే అంచనా వేస్తారు. ఆ మొత్తాన్ని కాంట్రాక్టు సంస్థలకు ఆర్డర్‌ ఇస్తారు. ఏ నెలలో ఏ కెమికల్‌ అందించాలో ముందే చెబుతారు. అనుకున్న ప్రకారం తీసుకోకపోతే జెన్‌కో కాంట్రాక్టు సంస్థకు పరిహారం చెల్లించాలి. ఒక వేళ అనుకున్న ప్రకారం అందించకపోతే కాంట్రాక్టు సంస్థకు జరిమానా విధిస్తారు. అయితే, ఫైన్‌ వేసే కన్నా ముందే కొనుగోలు చేయడం వల్ల ఉత్పత్తి సమయంలో ఇబ్బంది ఉండదని అధికారులు భావిస్తున్నారు. ఈ కారణంగా ఆరు నెలలకు ముందే కొంటున్నట్టు లెక్కల్లో చూపిస్తున్నారు. గడువు తీరేలోగా వాడలేకపోయామని, వాటిని భూస్థాపితం చేశామని అధికారులు వార్షిక నివేదికల్లో పేర్కొంటున్నారు. దీనికి ఎలాంటి ఆధారాలు ఉండటం లేదు. కొనుగోలు చేశారా? కాంట్రాక్టు సంస్థలతో అధికారులు కుమ్మక్కై బిల్లులు పెడతున్నారా? తెలియడం లేదని ఈఆర్‌సీ వర్గాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.  

రూ. కోట్లలో నష్టం 
ప్రతి రాష్ట్రంలోనూ కనీసం 10 వేల మెగావాట్ల సామర్థ్యం గల థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలున్నాయి. ప్రతి 800 మెగావాట్ల థర్మల్‌ ప్లాంట్‌లోనూ నెలకు గరిష్టంగా రూ. 4.7 కోట్ల మేర రసాయనాలకు వెచ్చిస్తారు. ఈ లెక్కన ప్రతి నెలా మొత్తంగా రూ. 50 కోట్ల మేర ఖర్చు అవుతుంది. ఏడాదికి రూ. 600 కోట్లపైనే వెచ్చిస్తున్నారు. అందులో దాదాపు 45 శాతం రసాయనాలను గడువులోగా వాడటం లేదు. దీనివల్ల రూ. కోట్లలో నష్టం వస్తోంది. ఈ మొత్తం ప్రజలపై విద్యుత్‌ చార్జీల రూపంలోనే పడుతోంది. థర్మల్‌ విద్యుత్‌ యూనిట్‌ సగటున రూ. 8 వరకు ఉంటోంది. మార్కెట్లో సగటున యూనిట్‌ రూ. 3లోపే లభిస్తోంది. 

ఈ కారణంగా పీక్‌ డిమాండ్‌ ఉన్నప్పుడు మాత్రమే జెన్‌కో ప్లాంట్లు ఉత్పత్తి చేస్తున్నాయి. కానీ ముందే వేసుకున్న అంచనాల ప్రకారం రసాయనాలు తెప్పిస్తున్నారు. ఈ విషయం గురించి తెలంగాణ విద్యుత్‌ అధికారులను వివరణ కోరగా కాంట్రాక్టు సంస్థలతో ఏడాదికి కాంట్రాక్టు చేసుకుంటామని.. అవసరమైనప్పుడే వాటిని తీసుకుంటున్నామని, నష్టాలను నివారించేందుకు మరిన్ని చర్యలు చేపడతామని పేర్కొన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement