breaking news
Thermal center
-
కొంటున్నారా? కుమ్మక్కు అవుతున్నారా?
సాక్షి, హైదరాబాద్: థర్మల్ విద్యుత్ ప్లాంట్లలో వాడే రసాయనాల లెక్కలు తప్పుతున్నాయి. అధికారులు అవసరానికి మించి వాటిని కొనుగోలు చేస్తుండటంతోపాటు వాడకుండానే వాటిని గడువు తీరిందని భూస్థాపితం చేస్తున్నారు. దీనివల్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్లకు ఏటా రూ. కోట్లలో నష్టం వాటిల్లుతోంది. దీనిపై నియంత్రణ ఉండాలని కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి (సీఈఆర్సీ) అన్ని రాష్ట్రాల విద్యుదుత్పత్తి కేంద్రాలకు సూచించింది. అలాగే ఈ వ్యవహారంపై రాష్ట్రాల రెగ్యులరేటరీ కమిషన్లు కూడా దృష్టి పెట్టాలని కోరింది. అవసరం లేకున్నా ఎందుకు కొంటున్నారు? అసలు కొంటున్నారా లేక కేవలం లెక్కల్లో చూపిస్తున్నారా? అనే విషయాలు తెలియట్లేదని పేర్కొంది. విద్యుత్ అధికారులు మాత్రం ఈ విషయంలో భిన్న వాదన వినిపిస్తున్నారు. ఉత్పత్తి చేస్తామనే లక్ష్యంతో రసాయనాలు కొనుగోలు చేస్తున్నామంటున్నారు. మార్కెట్లో చౌక విద్యుత్ లభించడం వల్ల జెన్కో ప్లాంట్లను బ్యాకింగ్ డౌన్ (ఉత్పత్తి తగ్గించడం) చేస్తున్నామని చెబుతున్నారు. ఈ కారణంగానే రసాయనాలు నిరుపయోగమవుతున్నాయని చెబుతున్నారు. ఇవీ వాడే రసాయనాలు బొగ్గు ఆధారిత థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బాయిలర్‌లోకి పంపే నీళ్ళు అత్యంత స్వచ్ఛంగా ఉండాలి. నీళ్ళల్లో మలినాల తొలగింపునకు అలమ్, ఫెర్రిక్ క్లోరైడ్ వాడతారు. నీటి కాఠిన్యం తొలగించేందుకు లైమ్, కాఠిన్య నియంత్రణకు సోడియం కార్బొనేట్, క్రిములను తొలగించేందుకు హైడ్రోక్లోరిక్ ఆమ్లం వంటివి వాడతారు. బాయిలర్ ట్యూబుల్లో తుప్పు రాకుండా ఫాస్పేట్లు, హైడ్రోజన్, అమోనియా, ఆంటీ–ఫోమింగ్ ఏజెంట్లు వాడతారు. కండెన్సర్ పైపుల్లో ఫౌలింగ్ (వ్యర్థ పదార్థాలు పేరుకుపోవడం) రాకుండా బయోసైడ్లు, కాల్షియం డిపాజిట్లు తగ్గించేందుకు స్కేల్ ఇన్హిబిటర్లు, పైపుల రక్షణకు కరోషన్ ఇన్హిబిటర్లు (తుప్పు నిరోధక రసాయనాలు), సల్ఫ్యూరిక్ ఆమ్లం వాడతారు. థర్మల్ కేంద్రాల్లో బూడిద పెరగకుండా ఉండేందుకు డస్ట్ సప్రెషన్ కెమికల్స్ అవసరం. వాయు కాలుష్య నియంత్రణకు లైమ్, ఆక్టివేటెడ్ కార్బన్ వంటివి వాడాలి. థర్మల్ ప్లాంట్ సామర్థ్యాన్ని బట్టి ఏడాదికి ఎంత అవసరమో ముందే అంచనా వేస్తారు. ఆ మొత్తాన్ని కాంట్రాక్టు సంస్థలకు ఆర్డర్ ఇస్తారు. ఏ నెలలో ఏ కెమికల్ అందించాలో ముందే చెబుతారు. అనుకున్న ప్రకారం తీసుకోకపోతే జెన్కో కాంట్రాక్టు సంస్థకు పరిహారం చెల్లించాలి. ఒక వేళ అనుకున్న ప్రకారం అందించకపోతే కాంట్రాక్టు సంస్థకు జరిమానా విధిస్తారు. అయితే, ఫైన్ వేసే కన్నా ముందే కొనుగోలు చేయడం వల్ల ఉత్పత్తి సమయంలో ఇబ్బంది ఉండదని అధికారులు భావిస్తున్నారు. ఈ కారణంగా ఆరు నెలలకు ముందే కొంటున్నట్టు లెక్కల్లో చూపిస్తున్నారు. గడువు తీరేలోగా వాడలేకపోయామని, వాటిని భూస్థాపితం చేశామని అధికారులు వార్షిక నివేదికల్లో పేర్కొంటున్నారు. దీనికి ఎలాంటి ఆధారాలు ఉండటం లేదు. కొనుగోలు చేశారా? కాంట్రాక్టు సంస్థలతో అధికారులు కుమ్మక్కై బిల్లులు పెడతున్నారా? తెలియడం లేదని ఈఆర్సీ వర్గాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. రూ. కోట్లలో నష్టం ప్రతి రాష్ట్రంలోనూ కనీసం 10 వేల మెగావాట్ల సామర్థ్యం గల థర్మల్ విద్యుత్ కేంద్రాలున్నాయి. ప్రతి 800 మెగావాట్ల థర్మల్ ప్లాంట్‌లోనూ నెలకు గరిష్టంగా రూ. 4.7 కోట్ల మేర రసాయనాలకు వెచ్చిస్తారు. ఈ లెక్కన ప్రతి నెలా మొత్తంగా రూ. 50 కోట్ల మేర ఖర్చు అవుతుంది. ఏడాదికి రూ. 600 కోట్లపైనే వెచ్చిస్తున్నారు. అందులో దాదాపు 45 శాతం రసాయనాలను గడువులోగా వాడటం లేదు. దీనివల్ల రూ. కోట్లలో నష్టం వస్తోంది. ఈ మొత్తం ప్రజలపై విద్యుత్ చార్జీల రూపంలోనే పడుతోంది. థర్మల్ విద్యుత్ యూనిట్ సగటున రూ. 8 వరకు ఉంటోంది. మార్కెట్లో సగటున యూనిట్ రూ. 3లోపే లభిస్తోంది. ఈ కారణంగా పీక్ డిమాండ్ ఉన్నప్పుడు మాత్రమే జెన్కో ప్లాంట్లు ఉత్పత్తి చేస్తున్నాయి. కానీ ముందే వేసుకున్న అంచనాల ప్రకారం రసాయనాలు తెప్పిస్తున్నారు. ఈ విషయం గురించి తెలంగాణ విద్యుత్ అధికారులను వివరణ కోరగా కాంట్రాక్టు సంస్థలతో ఏడాదికి కాంట్రాక్టు చేసుకుంటామని.. అవసరమైనప్పుడే వాటిని తీసుకుంటున్నామని, నష్టాలను నివారించేందుకు మరిన్ని చర్యలు చేపడతామని పేర్కొన్నారు. -
ఉప్పూరులో థర్మల్ కేంద్రం
సాక్షి, చెన్నై : అన్నాడీఎంకే సర్కారు అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి మెరుగుపడ్డ విషయం తెలిసిందే. కొత్త ప్రాజెక్టుల ద్వారా ఫలాలు దక్కడంతో విద్యుత్ కొరతను అదిగమిస్తున్నారు. ఇక, మరిన్ని కొత్త ప్రాజెక్టుల దిశగా అడుగులు వేస్తున్న సీఎం జయలలిత రాష్ట్రంలో మిగులు విద్యుత్ లక్ష్యంగా కంకణం కట్టుకుని ఉన్నారు. ఇందులో భాగంగా పలు కొత్త ప్రాజెక్టులకు చర్యలు చేపట్టారు. రామనాథపురం ఉప్పూరులో 995 ఎకరాల విస్తీర్ణంలో తలా 800 మెగావాట్లు చొప్పున రెండు యూనిట్లతో నేల బొగ్గు సాయంతో ఉత్పత్తయ్యే థర్మల్ విద్యుత్ కేంద్రానికి నిర్ణయించారు. ఇందుకు గాను రూ. 12,778 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఈ పనులకు తగ్గ అన్ని కసరత్తులు పూర్తయ్యాయి. దీంతో ఉప్పూరు థర్మల్ విద్యుత్ కేంద్రం పనులకు సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం జయలలిత శంకుస్థాపన చేశారు. అలాగే, పనులకు గాను తొలి విడతగా రూ.5,580 కోట్లను కేటాయించారు. ఇందుకు తగ్గ ఒప్పంద పత్రాల్ని బిహెచ్ఈఎల్ చైర్మన్ అతుల్ సోబ్తికి అందజేశారు. ఇక, విల్లుపురం జిల్లా ఉలందూరు పేటలో, చెన్నై వ్యాసార్పాడిలో, కృష్ణగిరి గురుపర పల్లిలో, కంచి కున్నం పట్టులో 230-110 కేవి, తిరువళ్లూరు అలమాడి, మదురై నాడార్ మంగలం, పుదుకోట్టై పూ కొడి, వేలూరు పున్నం, కడలూరు అదరిలో 110-33 కేవీ, తిరుప్పూర్ వేదనూర్, పుదూర్, ఈరోడ్ మొండియం పాళయంలలో 110-22, తిరువణ్ణామలై అత్తిమూరు, అంబట్టూల్లో 33-11 కేవిలతో రూ. 42 కోట్లతో నెలకొల్పిన విద్యుత్ సబ్ స్టేషన్లను ప్రారంభించారు. రెవెన్యూ డివిజన్లు రెవున్యూశాఖ నేతృత్వంలో పుదుకోట్టై ఇలుప్పూర్లో కోటి 64 లక్షలతో నిర్మించిన రెవెన్యూ కార్యాలయం, అధికారుల క్వార్టర్స్‌ను ప్రారంభించారు. అలాగే, ఆ శాఖ పరిధిలో వివిధ ప్రాంతాల్లో రూ. 42 కోట్ల 81 లక్షలతో నిర్మించిన భవనాలు, అతిథి గృహాలు, క్వార్టర్స్‌లను కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఇక, చెన్నై ఎగ్మూర్, మదురై మేలూరు, కోయంబత్తూరు ఉత్తరం, విరుదునగర్ సాత్తూరుల్ని రెవెన్యూ డివిజన్లుగా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో పాటుగా సోమవారం నుంచి ఆ నాలుగు ప్రాంతాలు రెవెన్యూ డివిజన్లుగా అమల్లోకి తీసుకొచ్చారు. అలాగే, కీల్ పెన్నాత్తూరు, మేల్ మలయనూర్, కొండాచ్చిపురం, చూలగిరి, కరిమంగం, న ల్లవల్లి, కడయం, పల్లారం,పేర్నాంబట్టు, మానూరు, చెర్మింగాదేవి, కోరమ పాళయం, తలవాడి తదితర 16 రెవిన్యూ తాలుకాల్ని ప్రకటిస్తూ, అమల్లోకి తెచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నత్తం విశ్వనాథన్, ఆర్బీ.ఉదయకుమార్, విజయభాస్కర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జ్ఞాన దేశికన్, సలహదారు షీలా బాలకృష్ణన్ తదితరులు పాల్గొన్నారు. కాగా, వీడియో కాన్ఫరెన్స్ ప్రారంభోత్సవాల అనంతరం సీఎం జయలలిత రాష్ట్రంలో వివిధ ప్రమాదాల్లో మరణించిన పలు కుటుంబాల్ని ఆదుకుంటూ తలా రూ.మూడు లక్షలు ఆర్థిక సాయాన్ని ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. -
సమగ్ర దర్యాప్తు
కూడగి ఘటనపై సీఎం ఆదేశం బాధితులకు పరామర్శ 23 మందిపై 23 కేసులు నమోదు సాక్షి, బెంగళూరు : కూడగి థర్మల్ కేంద్రం ముట్టడి సందర్భంగా పోలీసులు జరిపిన కాల్పుల ఘటనకు సంబంధించి సమగ్ర దర్యాప్తునకు ఆదేశించినట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆదివారం వెల్లడించారు. బీజాపుర జిల్లా బసవన బాగేవాడి తాలూకా కూడగి వద్ద ప్రారంభించనున్న థర్మల్ విద్యుత్ కేంద్రం వల్ల తమ పంట పొలాలు నాశనమవుతాయని పలువురు రైతులు విద్యుత్ కేంద్రాన్ని శనివారం ముట్టడించిన సంగతి తెలిసిందే. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు జరిపిన కాల్పుల్లో రైతులు చంద్రప్ప పూజారి, సదాశివ గుణాచారి గాయపడ్డారు. వీరిని స్థానిక కేఎల్ఈ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స ఇప్పిస్తున్నారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శనివారం వీరిద్దరిని పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. జరిగిన సంఘటన చాలా దురదృష్టకరమని, ఈ విషయంపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించామన్నారు. గాయపడిన రైతులు మెరుగైన వైద్య సేవలను ప్రభుత్వ ఖర్చుతో అందివ్వనున్నట్లు చెప్పారు. కాగా, థర్మల్ కేంద్రం ముట్టడికి సంబంధించి 23 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిపై 23 కేసులు నమోదయ్యాయి. బాధితులను పరామర్శించిన వారిలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు హోంశాఖ మంత్రి కేజే జార్జ్, న్యాయశాఖ మంత్రి టీ.బీ జయచద్ర తదితరులు ఉన్నారు. రాజకీయం చేస్తున్నారు. మీడియాతో ఆదివారం బీజాపుర జిల్లా ఇన్చార్జి మంత్రి ఎంబీ పాటిల్ మాట్లాడుతూ... ‘థర్మల్ విద్యుత్ కేంద్రం కోసం భూములు ఇచ్చిన రైతులకు ఇప్పటికే పరిహారం అందించాం. ఉద్యోగ అవకాశాలు కల్పించే విషయం కూర్చొని చర్చిస్తే సరిపోతుంది. అయితే బయటి వారు వచ్చి విషయాన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారు. ధర్నాకు ముందస్తు అనుమతి కూడా తీసుకోలేదు. విషయం దర్యాప్తు అనంతరం బయట పడుతుంది. ఇక బాధితులకు పరిహారం అందించే విషయం ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో చర్చించిన తర్వాత చెబుతా’ అని పేర్కొన్నారు.


