కూడగి థర్మల్ కేంద్రం ముట్టడి సందర్భంగా పోలీసులు జరిపిన కాల్పుల ఘటనకు సంబంధించి సమగ్ర దర్యాప్తునకు ఆదేశించినట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆదివారం వెల్లడించారు.
- కూడగి ఘటనపై సీఎం ఆదేశం
- బాధితులకు పరామర్శ
- 23 మందిపై 23 కేసులు నమోదు
సాక్షి, బెంగళూరు : కూడగి థర్మల్ కేంద్రం ముట్టడి సందర్భంగా పోలీసులు జరిపిన కాల్పుల ఘటనకు సంబంధించి సమగ్ర దర్యాప్తునకు ఆదేశించినట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆదివారం వెల్లడించారు. బీజాపుర జిల్లా బసవన బాగేవాడి తాలూకా కూడగి వద్ద ప్రారంభించనున్న థర్మల్ విద్యుత్ కేంద్రం వల్ల తమ పంట పొలాలు నాశనమవుతాయని పలువురు రైతులు విద్యుత్ కేంద్రాన్ని శనివారం ముట్టడించిన సంగతి తెలిసిందే.
పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు జరిపిన కాల్పుల్లో రైతులు చంద్రప్ప పూజారి, సదాశివ గుణాచారి గాయపడ్డారు. వీరిని స్థానిక కేఎల్‌ఈ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స ఇప్పిస్తున్నారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శనివారం వీరిద్దరిని పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. జరిగిన సంఘటన చాలా దురదృష్టకరమని, ఈ విషయంపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించామన్నారు.
గాయపడిన రైతులు మెరుగైన వైద్య సేవలను ప్రభుత్వ ఖర్చుతో అందివ్వనున్నట్లు చెప్పారు. కాగా, థర్మల్ కేంద్రం ముట్టడికి సంబంధించి 23 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిపై 23 కేసులు నమోదయ్యాయి. బాధితులను పరామర్శించిన వారిలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు హోంశాఖ మంత్రి కేజే జార్జ్, న్యాయశాఖ మంత్రి టీ.బీ జయచద్ర తదితరులు ఉన్నారు.
రాజకీయం చేస్తున్నారు.
మీడియాతో ఆదివారం బీజాపుర జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఎంబీ పాటిల్ మాట్లాడుతూ... ‘థర్మల్ విద్యుత్ కేంద్రం కోసం భూములు ఇచ్చిన రైతులకు ఇప్పటికే పరిహారం అందించాం. ఉద్యోగ అవకాశాలు కల్పించే విషయం కూర్చొని చర్చిస్తే సరిపోతుంది. అయితే బయటి వారు వచ్చి విషయాన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారు. ధర్నాకు ముందస్తు అనుమతి కూడా తీసుకోలేదు. విషయం దర్యాప్తు అనంతరం బయట పడుతుంది. ఇక బాధితులకు పరిహారం అందించే విషయం ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో చర్చించిన తర్వాత చెబుతా’ అని పేర్కొన్నారు.