‘పుర హోరు’కు తెర | Telangana Municipal Election Campaign Ended | Sakshi
Sakshi News home page

‘పుర హోరు’కు తెర

Feb 10 2026 3:16 AM | Updated on Feb 10 2026 3:16 AM

Telangana Municipal Election Campaign Ended

సమావేశాలు, ర్యాలీలు సహా అన్ని రకాల ప్రచారంపై నిషేధం

సాక్షి, హైదరాబాద్‌: మున్సిపల్‌ ఎన్నికల్లో అత్యంత కీలకమైన ప్రచార ఘట్టానికి సోమవారం సాయంత్రం ఐదు గంటలకు తెర పడింది. ప్రచార గడువు ముగిసిన తర్వాత ఎలాంటి సభలు, ఊరేగింపులు నిర్వహించడం లేదా పాల్గొనకూడదని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. సినిమాలు, టీవీలు, ఇతర ప్రచార, ప్రసార మాధ్యమాల ద్వారా కూడా ఎలాంటి ఎన్నికల ప్రచారం చేయకూడదని హెచ్చరించింది. సంగీత విభావరులు, నాటకాలు, విందులు, ఇతర రూపాల్లో ప్రచారం చేసినా చర్యలు ఉంటాయని స్పష్టం చేసింది. బుధవారం సాయంత్రం ఐదు గంటలకు పోలింగ్‌ ముగిసే వరకు 48 గంటలపాటు ఎన్నికల సంఘం ఆదేశాలను కచ్చితంగా పాటించాలని పేర్కొంది. 

ఎన్నికల సంఘం ఆదేశాలను ఉల్లంఘించి ప్రచారం చేస్తే రెండేళ్ల జైలు శిక్షతోపాటు జరిమానా ఉంటుందని హెచ్చరించింది. మొబైల్‌ ఫోన్లు, సోషల్‌ మీడియా ద్వారా ఎన్నికల ప్రచారం చేసినా చర్యలు ఉంటాయని చెప్పింది. పోటీ చేస్తున్న అభ్యర్థులు, రాజకీయ పారీ్టలు, పార్టీ ప్రచారకర్తలు ఎన్నికల నియమావళి మేరకు వ్యవహరించాలని సూచించింది. ఈ మేరకు ఎన్నికల సంఘం కార్యదర్శి లింగ్యానాయక్‌ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. సోమవారం సాయంత్రం ఐదు గంటల నుంచి బుధవారం సాయంత్రం ఐదు గంటల వరకు ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో మద్యం దుకాణాలను మూసివేయాలని ఎక్సైజ్‌ శాఖను ఆదేశించారు. 

ఏర్పాట్లపై ఎస్‌ఈసీ వీడియో కాన్ఫరెన్స్‌ 
రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల పరిధిలో బుధవారం పోలింగ్‌ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ రాణీకుముదిని సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. జిల్లా కలెక్టర్లు, ఎన్నికల పరిశీలకులు ఈ ఇందులో పాల్గొన్నారు. ఈ నెల 11న జరగనున్న మున్సిపల్‌ ఎన్నికలను సజావుగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్‌ సెంటర్లు అన్ని విధాల సౌకర్యవంతంగా ఉండేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఎన్నికల కమిషనర్‌ ఆదేశించారు. సమర్థవంతమైన కమ్యూనికేషన్‌ ప్రణాళికతోపాటు ఎలాంటి లోటుపాట్లు లేకుండా పోలింగ్‌ నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. 

డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌ నుంచి బ్యాలెట్‌ బాక్సులు, బ్యాలెట్‌ పేపర్లు, పోలింగ్‌ మెటీరియల్‌తో సిబ్బందిని పోలింగ్‌ కేంద్రాలకు ఎస్కార్ట్‌ వాహనంతో మాత్రమే తరలించాలని స్పష్టం చేశారు. పోలింగ్‌ ముగిసిన తర్వాత బ్యాలెట్‌ బాక్సులను డీజీటీ వాహనంలో ఎస్కార్ట్‌ వాహనాలతో మాత్రమే స్ట్రాంగ్‌ రూములకు తరలించాలన్నారు. డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్‌ కేంద్రాలలో చేయాల్సిన ఏర్పాట్లు, పోలింగ్‌ కేంద్రాల వారీగా కౌంటర్ల ఏర్పాటు, పోలింగ్‌ మెటీరియల్‌ పంపిణీ, బ్యాలెట్‌ బాక్సుల నిర్వహణ, రూట్‌ వారీగా బస్సుల ఏర్పాటు, పోలింగ్‌కు ముందు రోజు కేంద్రాల్లో చేపట్టాల్సిన ఏర్పాట్లు తదితర అంశాలపై ఎన్నికల సంఘం కమిషనర్‌ పలు సూచనలు చేశారు. 

నేడు పోలింగ్‌ కేంద్రాలకు సిబ్బంది 
ఈ నెల 11న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జరిగే మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ నిర్వహణకు సిబ్బంది మంగళవారం డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్ల నుంచి బయలుదేరి వెళ్లనున్నారు. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలోని 2,996 వార్డుల్లో 12,993 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 123 చోట్ల ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేయగా, పోలింగ్‌ తర్వాత బ్యాలెట్‌ బాక్సులను చేర్చేందుకు 137 స్ట్రాంగ్‌ రూమ్‌లు సిద్దం చేశారు. ఒకే విడతలో జరిగే ఎన్నికల్లో 20 వేల మంది వివిధ విభాగాలకు చెందిన సిబ్బందితోపాటు సుమారు 25వేల మంది పోలీసులు బందోబస్తులో పాల్గొంటున్నారు. ఈ నెల 13న 136 చోట్ల ఓట్ల లెక్కింపు జరగనుంది. మొత్తం 8,195 పోలింగ్‌ స్టేషన్ల పరిధిలో 52.43 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement