ఐఐటీ మద్రాస్‌లో రామ్ జెట్ గోళీల అభివృద్ధి
ఆయుధ శక్తి తగ్గకుండా దూర లక్ష్యాలపై దాడికి దోహదం
సాక్షి, చెన్నై: దేశీయ రక్షణ పరిశోధనలో ఐఐటీ మద్రాస్ మరో కీలక ముందడుగు వేసింది. తుపాకుల కాల్పుల పరిధిని సుమారు 50% వరకు పెంచే రామ్ జెట్ సాంకేతికతతో కూడిన ఆరి్టలరీ గోళీలను ఐఐటీ మద్రాస్ శాస్త్రవేత్తలు విజయవంతంగా అభివృద్ధి చేశారు. ఈ కొత్త గోళీలతో ఆయుధ ఘాతుక శక్తి ఏమాత్రం తగ్గకుండా ఎక్కువ దూరంలోని లక్ష్యాలను ఛేదించవచ్చని పరిశోధకులు తెలిపారు. ఈ వివరాలను సోమవారం ఐఐటీ మద్రాస్ ప్రకటించింది. 155 ఎంఎం ఆర్టిలరీ గోళీలో సంప్రదాయ బేస్–బ్లీడ్ యూనిట్ స్థానంలో రామ్‌జెట్ ఇంజి న్ ను అమర్చడం ఈ పరిశోధన ప్రత్యేకతగా పేర్కొన్నారు. తుపాకీ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఈ గోళీకి నిరంతర త్రస్ట్ లభించడంతో కాల్పుల పరిధి గణనీయంగా పెరుగుతోందని వివరించారు.
తుపాకుల పరిధి ఇలా..
బోఫోర్స్, యూఎల్‌హెచ్ 24 కి.మీ నుంచి 43 కి.మీ, ధనుష్ 30 కి.మీ నుంచి 55 కి.మీ, వజ్ర 36 కి.మీ నుంచి 62 కి.మీ, ఆటాగ్స్ 40 కి.మీ నుంచి 70 కి.మీ దూరంగా ఉన్న లక్ష్యాలను ఛేదించేందుకు వీలుంటుందని పరిశోధన బృందంలోని ఐఐటీ మద్రాస్ ఏరోస్పేస్ ఇంజినీరింగ్ విభాగం ప్రొఫెసర్ పీఏ రామకృష్ణ తెలిపారు. ఈ సాంకేతికత అమలులోకి వస్తే కొత్త తుపాకులు లేదా ఖరీదైన క్షిపణుల అవసరం లేకుండానే భారతీయ ఆరి్టలరీ దళాలకు ఎక్కువ దూరం దాడి చేసే సామర్థ్యం లభిస్తుందని వివరించారు. ఇది ఆత్మనిర్భర్ భారత్ దిశగా మరో ముందడుగు అని చెప్పారు.
విజయవంతమైన పరీక్షలు
భారత సైన్యంతో కలిసి 2020లో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ పలు దశల పరీక్షలను పూర్తిచేసింది. 2025 సెప్టెంబర్‌లో డియోలాలి ఆరి్టలరీ పాఠశాలలో, డిసెంబర్‌లో పోఖ్రాన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్‌లో నిర్వహించిన ప్రయోగాల్లో గోళీ సాఫీగా తుపాకీ నుంచి బయటకురావడం, స్థిరంగా ప్రయాణించడం, రామ్‌జెట్ ఇగి్నషన్ పరీక్షలు విజయవంతమైనట్లు ప్రకటించారు. దేశీయ పరిశోధనతో ఉన్న ఆయుధ వ్యవస్థలను అప్‌గ్రేడ్ చేయవచ్చని ఈ ప్రాజెక్ట్ నిరూపించిందని రక్షణ నిపుణులు అభిప్రాయపడుతున్నారన్నారు.


