
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడి
చెన్నై: జాతీయ విద్యా విధానం–2020 సిఫారసు మేరకు 11, 12వ తరగతుల్లో నైపుణ్య ఆధారిత పాఠ్యాంశాలను చేర్చే విషయం పరిశీలిస్తున్నట్లు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. మద్రాస్ ఐఐటీలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఒక సర్టిఫికెట్ లేదా డిగ్రీకే విద్యా విధానం పరిమితం కారాదని, విద్యార్థులను పోటీకి అనుగుణంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని అన్నారు.
జాతీయ విద్యా విధానంలో నైపుణ్యాధారిత విద్య ప్రముఖంగా ఉందని చెప్పారు. గతంలో నైపుణ్యాధారిత విద్య ఆప్షనల్‌గా ఉండేదని∙ఇకపై విద్యలో ఇదో భాగంగా మారనుందన్నారు. ఆరోగతి నుంచే నైపుణ్య ఆధారిత విద్యాబోధనను ప్రవేశపెట్టే యోచన ఉందని మంత్రి వివరించారు. దేశంలోని ఏ రాష్ట్రంపైనా ఏ భాషనూ కేంద్రం బలవంతంగా రుద్దడం లేదని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. త్రిభాషా విధానంపై కేంద్రం రాష్ట్రాలను బలవంతం చేస్తోందంటూ కొందరు చేసే ఆరోపణలను రాజకీయ ప్రేరేపితమైనవిగా ధర్మేంద్ర ప్రధాన్ అభివర్ణించారు.