ఢిల్లీ: తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో లైంగిక వేధింపులకు పాల్పడిన వారిపై పారదర్శకంగా దర్యాప్తు జరిపి, కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని ఎంపీ గురుమూర్తి కోరారు. ఈ మేరక కేంద్ర విద్యాశాఖ, నైపుణ్య అభివృద్ధి శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు లేఖ రాశారు. విద్యార్థినిలపై లెక్చరర్ల లైంగిక వేధింపుల అంశంలో జోక్యం చేసుకోవాలని విన్నవించారు.
‘సంస్కృత విశ్వవిద్యాలయంలో విశ్వవిద్యాలయంలో బీఈడీ మొదటి సంవత్సరం విద్యార్థినిపై లెక్చరర్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ లక్ష్మణ్ కుమార్ విద్యార్థినిపై తీవ్ర వేధింపులకు గురి చేయడంతో ఆమె చదువు మధ్యలోనే వదిలి వెళ్ళిపోయింది. ఈ అంశం నేపథ్యంలో బాధితురాలి ప్రాణాలకు హాని ఏర్పడింది. లైంగిక వేధింపులకు పాల్పడిన వారిపై పారదర్శకంగా దర్యాప్తు జరిపి , కఠిన చర్యలు తీసుకోవాలి. బాధితురాలు చదువు కొనసాగించేందుకు తగిన సురక్షిత వాతావరణం కల్పించాలి’ అని పేర్కొన్నారు.
కాగా, విద్యార్థినిని అధ్యాపకుడు లైంగికంగా వేధించిన ఘటన తిరుపతిలోని జాతీయ సంస్కృత వర్సిటీలో జరిగింది. ఒడిశాకి చెందిన అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థినిని వర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మణ కుమార్ లైంగిక వేధింపులకు గురిచేసి మాయ మాటలు చెప్పి లోబరుచుకున్నాడు. ఈ క్రమంలో విద్యార్థినితో డాక్టర్ లక్ష్మణ్ కుమార్ ఏకాంతంగా ఉంటుండగా ఆ దృశ్యాలను ఆ విద్యార్థినిపై కన్నువేసిన మరో అసిస్టెంట్ ప్రొఫెసర్ తన మొబైల్‌లో రికార్డు చేశాడు.
అనంతరం ఆ వీడియోను విద్యార్థినికి పంపించి తన కోరిక తీర్చమని బెదిరించాడు. దీంతో తనను వేధించి గర్భవతిని చేసిన డాక్టర్ లక్ష్మణ్ కుమార్, వీడియో అడ్డుపెట్టుకుని తనను బెదిరిస్తోన్న అసిస్టెంట్ ప్రొఫెసర్‌పై వీసీకి బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై వీసీ, రిజిస్ట్రార్ ప్రత్యేక విచారణ కమిటీని నియమించారు. తమ కుమార్తెకు టీసీ ఇస్తే వెళ్లిపోతామని, నిందితుడిపై చర్యలు తీసుకోవాలని కమిటీకి బాధితురాలి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.


