సాక్షి, న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించే ‘పరీక్షా పే చర్చ’కార్యక్రమం తొమ్మిదో విడత షెడ్యూల్ ఖరారైంది. 2026 జనవరిలో కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యా శాఖ శనివారం తెలిపింది. పరీక్షల సమయంలో విద్యార్థులు ఎదుర్కొనే ఒత్తిడిని తగ్గించి, పరీక్షలను ఒక ఉత్సవంలా భావించేలా ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం ఉద్దేశం.
ఈ కార్యక్రమంలో పాల్గొనే ఆసక్తి గల వారి ఎంపిక కోసం ఆన్‌లైన్ ద్వారా పోటీలను నిర్వహిస్తున్నారు. ఇందుకుగాను ఇన్నోవేట్ ఇండియా వన్ అధికారిక పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. డిసెంబర్ 1న ప్రారంభమైన రిజిస్ట్రేషన్లు 2026 జనవరి 11 వరకు కొనసాగుతాయి. 6 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు, అలాగే ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఈ పోటీలో పాల్గొనవచ్చు. బహుళ ఐచి్ఛక ప్రశ్నల రూపంలో ఈ ఆన్‌లైన్ పోటీ ఉంటుంది. పాల్గొన్న వారందరికీ పార్టిసిపేషన్ సర్టిఫికెట్ అందజేస్తారు.
రికార్డు స్థాయి భాగస్వామ్యం
2025 ఫిబ్రవరిలో జరిగిన 8వ విడత ‘పరీక్షా పే చర్చ’కు రికార్డు స్థాయిలో 3.56 కోట్ల మంది రిజిస్టర్ చేసుకున్నారని, ఇది గిన్నిస్ వరల్డ్ రికార్డుగా నమోదైందని విద్యా శాఖ పేర్కొంది. 2018లో కేవలం 22 వేల మందితో ప్రారంభమైన ఈ కార్యక్రమం, ప్రస్తుతం కోట్లాది మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులను ఆకర్షిస్తోందని అధికారులు తెలిపారు.


