వారు మా కార్మీకులకు నైపుణ్యాలు నేర్పించాలి
స్వదేశంలో వ్యతిరేకత వచ్చినా భరిస్తానని వెల్లడి
వాషింగ్టన్: వలసదారులపై ఇన్నాళ్లూ కఠిన వైఖరి ప్రదర్శించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మనసు మార్చుకున్నారు. అమెరికాకు వారి అవసరమేంటో ఆయనకు ఎట్టకేలకు తెలిసొచ్చింది. నైపుణ్యం కలిగిన వలసదారులను కచ్చితంగా స్వాగతిస్తామని చెప్పారు. కంప్యూటర్ చిప్స్, క్షిపణులు లాంటి సంక్లిష్టమైన ఉత్పత్తుల అభివృద్ధి విషయంలో అమెరికన్ కార్మీకులకు వలసదారులు శిక్షణ ఇవ్వాలని కోరారు. ఇమ్మిగ్రేషన్ నిబంధనలకు గతంలో మద్దతు ఇచ్చానని గుర్తుచేశారు. ఇప్పుడు వలసదారులకు పెద్దపీట వేస్తే స్వదేశంలో కొందరి నుంచి వ్యతిరేకత రావొచ్చని అన్నారు.
వ్యతిరేకతను భరిస్తానని చెప్పారు. బుధవారం యూఎస్–సౌదీ అరేబియా ఇన్వెస్ట్‌మెంట్ ఫోరమ్‌లో ట్రంప్ మాట్లాడారు. దేశ ఆర్థిక ప్రగతి కోసం పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సెల్‌ఫోన్లు, కంప్యూటర్లు, మిస్సైల్స్ వంటి కంపెనీల్లో పని చేయడానికి నిపుణులైన వలసదారులు కావాలని తెలిపారు. వారి పరిజ్ఞానం తమ కార్మీకులకు ఎంతగానో తోడ్పడుతుందని వివరించారు. వస్తువుల ఉత్పత్తికి అవసరమైన మానవ వనరులను విదేశాల నుంచి రప్పించుకోవచ్చని అమెరికా సంస్థలకు ట్రంప్ సూచించారు. వేలాది మంది వచ్చినా తప్పకుండా స్వాగతిస్తామని వ్యాఖ్యానించారు.
ఈ విషయంలో నన్ను క్షమించాలి
వలసదారుల రాకను వ్యతిరేకించేవారు నిజంగా చాలా తెలివైనవారు, నమ్మశక్యంకాని దేశభక్తులు అని డొనాల్డ్ ట్రంప్ కొనియాడారు. అయితే, అమెరికా కార్మీకులకు నైపుణ్యాలు నేరి్పంచాల్సిన అవసరం ఎంతో ఉందని, ఈ విషయం అందరూ అర్థం చేసుకోవాలని కోరారు. మన కంపెనీల్లో బిలియన్ల డాలర్లు పెట్టుబడులు పెట్టేవారిని అనుమతించకపోతే మనం విజయవంతమైన వ్యక్తులుగా ఎప్పటికీ ఎదగలేమని తేలి్చచెప్పారు.
ఒక పెద్ద కంపెనీ ఏర్పాటై, ఉత్పత్తి ప్రారంభం కావాలంటే విదేశాల నుంచి భారీగా పెట్టుబడులు, ఉద్యోగులు రావాల్సిందేనని స్పష్టంచేశారు. ఈ విషయంలో తనను క్షమించాలని కోరారు. మాగా(మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్)ను ఇప్పటికీ ఆరాధిస్తున్నానని, విదేశాల నుంచి మనకు కావాల్సిన నిపుణులను రప్పించుకోవడం కూడా ‘మాగా’అవుతుందని అమెరికా అధ్యక్షుడు వివరించారు. తనకు ఓటు వేసేవారి సంఖ్య తగ్గినా పట్టించుకోబోనని, చివరకు వారే అర్థం చేసుకుంటారని వ్యాఖ్యానించారు.


