వాషింగ్టన్: అమెరికాలోని వాషింగ్టన్ వేదికగా కొనసాగుతున్న తాజా రాజకీయ పరిణామాలు గ్రీన్ లాండ్ భవిష్యత్తు దిశగా కదులుతున్నాయని స్పష్టంగా తెలుస్తోంది. డొనాల్డ్ ట్రంప్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ స్టీఫెన్ మిల్లర్ భార్య, మాజీ వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ కేటీ మిల్లర్ చేసిన ఒక సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో కలకలం రేపుతోంది.
గ్రీన్ లాండ్ భూభాగాన్ని అమెరికా జెండాతో కప్పేసిన మ్యాప్‌ను షేర్ చేసిన కేటీ మిల్లర్ దానికి ‘త్వరలో’ (Soon) అనే క్యాప్షన్‌ను జోడించారు. వెనెజువెలాపై అమెరికా దాడుల నేపథ్యంలో, ట్రంప్ సర్కార్ తదుపరి లక్ష్యం గ్రీన్ లాండ్ భూభాగమేనన్న సంకేతాలను ఈ పోస్ట్ మరింత బలపరుస్తోంది. కాగా కేటీ మిల్లర్ పోస్ట్‌పై డెన్మార్క్ రాయబారి జెస్పర్ మోలర్ సోరెన్సెన్ స్పందించారు. అమెరికా, డెన్మార్క్ దేశాల మధ్య ఉన్న దశాబ్దాల నాటి రక్షణ, స్నేహపూర్వక సంబంధాలను ఆయన గుర్తు చేశారు.
గ్రీన్ లాండ్ ఇప్పటికే నాటో (నాటో)లో భాగమని, ఆర్కిటిక్ ప్రాంతంలో భద్రత కోసం ఇరు దేశాలు కలిసి పనిచేస్తున్నాయని జెస్పర్ మోలర్ సోరెన్సెన్ పేర్కొన్నారు. అమెరికా భద్రతలో గ్రీన్ లాండ్, డెన్మార్క్‌ల పాత్ర కీలకమని చెబుతూనే, ఆయన ఆ రెండు దేశాలు పరస్పరం గౌరవించుకుంటూ, మిత్రదేశాలుగా మెలగాలని సూచించారు. ఇదే సమయంలో గ్రీన్ లాండ్ ప్రీమియర్ జెన్స్ ఫ్రెడరిక్ నీల్సన్ ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించారు.
కేటీ మిల్లర్ షేర్ చేసిన ఫొటోపై విస్మయం వ్యక్తం చేస్తూ, గ్రీన్ లాండ్ ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మకానికి సిద్ధంగా లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తరహా సోషల్ మీడియా పోస్టులు తమ దేశ భవిష్యత్తును నిర్ణయించలేవని, అయితే ఇలాంటి చర్యలు తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని మండిపడ్డారు. అంతర్జాతీయ చట్టాలు, పరస్పర గౌరవం ప్రాతిపదికన దేశాల మధ్య సంబంధాలు ఉండాలని ఆయన హితవు పలికారు.
కాగా గ్రీన్ లాండ్ విలీనంపై జరుగుతున్న ఈ చర్చ కేవలం ఒక పోస్ట్‌కే పరిమితం కాలేదు. గతంలో ట్రంప్.. అమెరికా జాతీయ భద్రత దృష్ట్యా గ్రీన్ లాండ్ అవసరమని పేర్కొన్నారని, ఆయన ఏదైనా చెబితే, అది కచ్చితంగా చేసి చూపిస్తారని సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో వ్యాఖ్యానించారు. ఏడాది క్రితం ట్రంప్ కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ గ్రీన్ లాండ్‌లో పర్యటించడం ‘రెక్కీ’లో భాగమేనన్న అనుమానాలను బలపరుస్తోందని విశ్లేషకులు అంటున్నారు.
ఇది కూడా చదవండి: వెనెజువెలా: ఇప్పుడైతే యుద్ధం.. రోజూ రాత్రి వేళ లక్ష మెరుపులు!


