అమెరికా తన సైనిక చర్యతో వెనెజువెలాపై విరుచుకుపడింది. ‘ఆపరేషన్ అబ్జల్యూట్ రిజాల్వ్’ పేరుతో భీకర బాంబులతో తెగబడింది. అమెరికాలోకి మాదకద్రవ్యాలను అక్రమంగా రవాణా చేస్తున్న ముఠాలకు వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోనే నాయకుడని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆరోపించారు. ఈ నేపధ్యంలోనే వెనెజువెలాపై దాడులకు ఆదేశాలిచ్చారు. ఈ నేపధ్యంలో వెనెజువెలా రాజకీయ సంక్షోభం నెలకొంది. ఈ విషయాన్ని అటుంచితే వెనెజువెలాకు ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఇవి ప్రపంచాన్ని ఎప్పటికప్పుడు ఆకర్షిస్తుంటాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
పెట్రోల్ ధరలు చవక
అపారమైన చమురు నిల్వలు, ప్రకృతి సౌందర్యానికి దక్షిణ అమెరికా దేశమైన వెనిజులా పేరొందింది. ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ ధరలు ఆకాశాన్ని తాకుతుంటే.. వెనెజువెలాలో మాత్రం లీటర్ పెట్రోల్ ధర సుమారు మూడు రూపాయలు (భారత కరెన్సీలో)మాత్రమే. ప్రపంచ పెట్రోల్ ధరల సగటుతో పోలిస్తే ఇది అత్యల్పం.
ఆర్కిడ్ పూలు, జీవవైవిధ్యంలో టాప్
ప్రకృతి సంపదలోనూ వెనెజువెలా ముందు వరుసరలో నిలుస్తుంది. ప్రపంచంలోని 17 అత్యంత జీవవైవిధ్యం (Megadiverse) కలిగిన దేశాలలో వెనెజువెలా ఒకటి. ఈ దేశంలో 25 వేల జాతులకు పైగా ఆర్కిడ్ పూలు పుష్పిస్తాయి. ఈ దేశపు జాతీయ పుష్పం ‘ఫ్లోర్ డి మేయో ఆర్కిడ్’. వెనెజువెలా భూభాగంలో 53శాతం ప్రాంతాన్ని వన్యప్రాణుల సంరక్షణ కోసం రక్షిత ప్రాంతంగా కేటాయించడం విశేషం.
ఆరు ‘మిస్ వరల్డ్’ కిరీటాలు
అందగత్తెలకు, అద్భుతమైన పర్యాటక ప్రాంతాలకు వెనిజులా పెట్టింది పేరు. ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో ఆరు ‘మిస్ వరల్డ్’ కిరీటాలను గెలుచుకున్న దేశం ఇదే.

అత్యంత ఎత్తైన జలపాతం
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన జలపాతం ‘ఏంజెల్ ఫాల్స్’ (979 మీటర్లు) ఇక్కడే ఉంది. ఈ జలపాతాన్ని 1950ల నాటి వరకు ఎవరూ గుర్తించలేదు. జేమ్స్ క్రాఫోర్డ్ ఏంజెల్ అనే పైలట్ దీనిని కనుగొన్నారు.
రోజూ రాత్రి వేళ లక్షకు పైగా మెరుపులు
ఈ దేశంలో కనిపించే మరో అద్భుతం ఏమిటంటే.. కాటాటుంబో నది ముఖద్వారం వద్ద ప్రతి రోజూ రాత్రి లక్షకు పైగా మెరుపులు సంభవిస్తాయి. దీనిని ‘నిత్యం మెరిసే మెరుపు’ (Everlasting Lightning) అని పిలుస్తారు. ఇది గిన్నిస్ వరల్డ్ రికార్డులలో కూడా చోటు సంపాదించుకుంది.
స్కేటింగ్ చేస్తూ క్రిస్మస్ వేడుకలు
వెనెజువెలాలో క్రిస్మస్ వేడుకలు ఎంతో విభిన్నంగా జరుగుతాయి. ఇక్కడి ప్రజలు క్రిస్మస్ రోజున చర్చికి ‘రోలర్ స్కేట్స్’పై వెళ్లడం ఒక ఆచారంగా పాటిస్తున్నారు. దీని కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ముందుగా అన్ని రోడ్లను కూడా క్లియర్ చేస్తుంది. క్రిస్మస్ నాడు చిన్న పిల్లలు తాము పడుకునేటప్పుడు ఒక తాడును తమ కాలి వేలికి కట్టుకుని, దానిని కిటికీ బయటకు వేలాడదీస్తారు. ఉదయం స్కేటింగ్ చేస్తూ వెళ్లేవారు ఆ తాడును నెమ్మదిగా లాగి, పిల్లలను నిద్ర నుంచి మేల్కొలుపుతారు.

30కి పైగా స్వదేశీ భాషలు
దేశ సాంస్కృతిక రంగం విషయానికి వస్తే ‘క్వాట్రో’ (చిన్న గిటార్ వంటిది) వీరి జాతీయ వాయిద్యం. 'జొరోపో' అనేది వీరి జాతీయ నృత్యం. ఇక్కడ స్పానిష్ అధికార భాష అయినప్పటికీ, మరో 30కి పైగా స్వదేశీ భాషలు వాడుకలో ఉన్నాయి.
ఘన పోరాట చరిత్ర
వెనెజువెలా చరిత్ర పోరాటాలతో ముడిపడివుంది. ఫ్రాన్సిస్కో డి మిరాండా తదితర వీరులు స్పెయిన్ పాలనకు వ్యతిరేకంగా పోరాడి, తొలి స్వతంత్ర జెండాను రూపొందించారు. 1830లో ఈ దేశం సంపూర్ణ స్వాతంత్ర్యం పొందింది.
ఒకవెపు గన్ ఫైరింగ్.. మరోవైపు రోడ్డు ప్రమాదాలు
ప్రస్తుతం వెనెజువెలా అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. ప్రపంచంలో గన్ ఫైరింగ్ సంబంధిత మరణాల్లో ఇది రెండో స్థానంలో ఉంది. అలాగే రోడ్డు ప్రమాదాల మరణాల రేటు ఇక్కడ ప్రతి లక్ష మందికి 37.2 శాతంగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. రాజధాని నగరం కారకస్‌లోని ‘హెలిక్స్’ అనే భవనం జైలుగా మారగా, ఇక్కడి ‘టవర్ ఆఫ్ డేవిడ్’ ఒకప్పుడు ప్రపంచంలోనే పెద్ద మురికివాడగా పేరొందింది.
ఇది కూడా చదవండి: విమానాలకు పవర్ బ్యాంకుల ముప్పు


