గ్రీన్‌లాండ్‌పై అమెరికా జెండా పాతుతున్న ట్రంప్
కెనడా, వెనెజువెలా, గ్రీన్‌లాండ్‌తోఅమెరికా మ్యాప్!
గ్రీన్‌లాండ్‌పై అమెరికా జెండా
కలకలం రేపుతున్న ట్రంప్ ఫొటోలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీరు నానాటికీ శ్రుతి మించి రాగాన పడుతోంది. అర్ధరాత్రి అధ్యక్ష దంపతులను కిడ్నాప్ చేసి చెరబట్టిన వెనెజువెలాతో పాటు గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకోవాలని కలలుగంటున్న ట్రంప్ దృష్టి పొరుగుదేశం కెనడా పైనా పడింది. ఆ మూడు దేశాలనూ అమెరికా మ్యాప్‌లో చేర్చేసి మురిసిపోయారాయన! కెనడా, వెనెజువెలా, గ్రీన్‌లాండ్‌తో కలిపిన అమెరికా మ్యాప్‌ను సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ట్రూత్ సోషల్‌లో ట్రంప్ మంగళవారం పోస్టు చేశారు. తద్వారా అవి ఎప్పటికైనా అమెరికా భూభాగాలేనన్న సంకేతాలిచ్చారు! ఈ మేరకు ట్రంప్ పోస్టు చేసిన ఏఐ ఫొటో వైరల్‌గా మారింది. అందులో వైట్‌హౌస్‌లోని ఓవల్ ఆఫీసులో పలువురు దేశాధినేతలతో ఆయన ఏదో సీరియస్‌గా చర్చిస్తూ కన్పిస్తున్నారు.
నేపథ్యంలో మూడు దేశాలను అమెరికా భూభాగంతో కలిపి చూపుతున్న ఆ దేశ సరికొత్త మ్యాప్ ప్రముఖంగా కన్పిస్తోంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ, బ్రిటన్ ప్రధాని కియర్ స్టార్మర్, యూరోపియన్ కమిషన్ చీఫ్ ఉర్సులా వాండెర్ లెయన్, నాటో ప్రధాన కార్యదర్శి మార్క్ రుట్టె తదితరులు ఫొటోలో ఉన్నారు. తద్వారా... కెనడా, వెనెజువెలా, గ్రీన్‌లాండ్ స్వాధీనానికి ఆయా దేశాల ఆమోదముందని చెప్పడం ట్రంప్ ఉద్దేశమని విశ్లేషిస్తున్నారు.
ట్రంప్ అక్కడితో ఆగలేదు! గ్రీన్‌లాండ్ గడ్డపై తాను సగర్వంగా అమెరికా జెండా పాతుతున్నట్టుగా మరో ఏఐ ఆధారిత ఫొటోను కూడా పోస్ట్ చేశారు. ఆయనతో పాటు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఫొటోలో కన్పిస్తున్నారు. ‘‘గ్రీన్‌లాండ్, అమెరికా భూభాగం, స్థాపితం: 2026’ అని రాసిన బోర్డు కూడా ఫొటోలో దర్శనమిస్తోంది. కెనడా స్వచ్ఛందంగా అమెరికాలో 51వ రాష్ట్రంగా చేరాలని గతంలో ట్రంప్ వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. ఇక డెన్మార్క్ అధీనంలోని స్వయంపాలిత ప్రాంతమైన గ్రీన్‌లాండ్ స్వాధీ నానికి ఆయన చేస్తున్న ప్రయత్నాలు, ఆ క్రమంలో చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలు కొంతకాలంగా అంతర్జాతీయ రగడకు దారితీస్తు న్నాయి. డెన్మార్క్ తో పాటు గ్రీన్‌లాండ్ కూడా ట్రంప్ యత్నాలను ముక్త కంఠంతో వ్యతిరేకించాయి. అమెరికాలో కలిసేది లేదని గ్రీన్‌లాండ్ స్పష్టం చేసింది.
గ్రీన్‌లాండ్‌కు యూఎస్ విమానం!
డెన్మార్క్‌తో నానాటికీ తీవ్రతరమవుతున్న ఉద్రిక్తతల నడుమ, గ్రీన్‌లాండ్‌లోని అమెరికా సైనిక స్థావరంలో యుద్ధ విమానాన్ని మోహరించాలని ట్రంప్ తాజాగా మరో వివాదాస్పద నిర్ణ యం తీసుకున్నారు. అక్కడి పిటుఫిక్ స్థావరంలో దీర్ఘకాలిక అవసరాల నిమిత్తం ఈ చర్య చేపడుతున్నట్టు వైట్‌హౌస్ చెప్పుకొచ్చింది.


