న్యూఢిల్లీ: విమాన ప్రయాణాల్లో ప్రయాణికుల పవర్ బ్యాంకులు పెనుముప్పుగా మారాయి. దీనిని గుర్తించిన నిపుణులు విమానయాన శాఖకు పలు సూచనలు చేశారు. దీంతో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) సరికొత్త నిబంధనలను అమలులోకి తెచ్చింది. ఇకపై విమాన ప్రయాణంలో ఎలక్ట్రానిక్ పరికరాలను ఛార్జ్ చేయడానికి పవర్ బ్యాంకులను ఉపయోగించకూడదని స్పష్టం చేసింది. అంతేకాకుండా విమాన సీట్ల వద్ద ఇచ్చే పవర్ సాకెట్ల ద్వారా పవర్ బ్యాంకులను ఛార్జ్ చేయడంపై కూడా నిషేధం విధించింది. విమానాల్లో ఇటీవల సంభవిస్తున్న అగ్నిప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
చేతి సంచుల్లోనే..
సాధారణంగా విమాన ప్రయాణికులు తమ పవర్ బ్యాంకులను లేదా బ్యాటరీలను సీట్ల పైన ఉండే ఓవర్‌హెడ్ బిన్లలో ఉంచుతుంటారు. అయితే కొత్త నిబంధనల ప్రకారం వీటిని అక్కడ ఉంచడం నిషిద్ధం. పవర్ బ్యాంకులను కేవలం చేతి సంచుల్లో (Hand Bags) మాత్రమే ఉంచుకోవాలి. లిథియం బ్యాటరీల కారణంగా అకస్మాత్తుగా మంటలు వ్యాపించే ప్రమాదం ఉన్నందున, అవి సిబ్బందికి అందుబాటులో ఉండేలా ప్రయాణికుల వద్దే ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
‘ఇండిగో’ ప్రమాదం దరిమిలా..
ఇటీవల ఇండిగో విమానంలో బ్యాటరీ కారణంగా మంటలు చెలరేగడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటన నేపథ్యంలో డీజీసీఏ ‘డేంజరస్ గుడ్స్ అడ్వైజరీ సర్క్యులర్’ను జారీ చేసింది. ప్రయాణికులు తమ వద్ద ఉన్న పరికరాల నుంచి పొగ రావడం, వేడెక్కడం లేదా అసాధారణ వాసన రావడం గమనిస్తే, వెంటనే క్యాబిన్ సిబ్బందికి సమాచారం అందించాలని సూచించింది. ఎమిరేట్స్, సింగపూర్ ఎయిర్ లైన్స్ వంటి అంతర్జాతీయ సంస్థలు ఇప్పటికే ఇటువంటి నిబంధనలను పాటిస్తున్నాయి.
‘బేగేజ్ హోల్డ్’ డేంజర్
సాధారణంగా విమానాల్లో ఓవర్‌హెడ్ బిన్లు నిండిపోయినప్పుడు, సిబ్బంది.. ప్రయాణికుల హ్యాండ్ బ్యాగులను తీసుకుని, విమానం కింది భాగంలోని ‘బేగేజ్ హోల్డ్’లో ఉంచుతారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇది అత్యంత ప్రమాదకరం. చెక్-ఇన్ బ్యాగుల్లో పవర్ బ్యాంకులు ఉండకూడదనే నిబంధన ఉన్నప్పటికీ, హ్యాండ్ బ్యాగులను బేగేజ్ హోల్డ్‌లోకి పంపడం వల్ల భద్రతకు ముప్పు ఏర్పడుతుంది. బ్యాటరీ అక్కడ పేలితే మంటలు అంటుకున్న విషయం ఎవరికీ తెలియదు, ఇది విమాన ప్రమాదానికి దారితీస్తుంది.
లిథియం బ్యాటరీలతో ముప్పు
లిథియం బ్యాటరీల వాడకం విపరీతంగా పెరగడంతో విమానాల్లో అగ్నిప్రమాదాల ముప్పు కూడా పెరిగింది. ఈ బ్యాటరీలు నాణ్యత లేకపోయినా, పాతవి అయినా లేదా ఒత్తిడికి గురైనా ‘సెల్ఫ్ సస్టైనింగ్’ (తమంతట తాము మండే) మంటలను సృష్టిస్తాయి. వీటిని ఆర్పడం సాధారణ అగ్నిమాపక పద్ధతులతో సాధ్యం కాదు. అందుకే, ఇవి ప్రయాణికుల కళ్ల ముందు ఉంటేనే పొగ రాగానే వెంటనే స్పందించే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
‘ఒకే హ్యాండ్ బ్యాగ్’ నిబంధన
విమానయాన నిపుణుల ప్రకారం.. ‘ఒక ప్రయాణికుడికి ఒకే హ్యాండ్ బ్యాగ్' నిబంధనను కఠినంగా అమలు చేయాలి. ప్రయాణికులు ఎక్కువ బ్యాగులు తీసుకురావడం వల్లే ఓవర్‌హెడ్ బిన్లు నిండిపోయి, బ్యాగులను బేగేజ్ హోల్డ్‌కు పంపాల్సి వస్తోంది. ప్రతి ప్రయాణికుడు కేవలం ఒక చిన్న బ్యాగును మాత్రమే క్యాబిన్‌లోకి అనుమతించడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించవచ్చని సీనియర్ పైలట్లు అభిప్రాయపడుతున్నారు. రవాణా రంగంలో సాంకేతికత ఎంత వేగంగా దూసుకుపోతున్నా, ప్రయాణికుల అప్రమత్తతే అసలైన రక్షణగా మారింది. పవర్ బ్యాంకుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే అది వందలాది మంది ప్రాణాలకే ముప్పుగా మారుతుందని, అందుకే డీజీసీఏ నిబంధనలను పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.


