
న్యూఢిల్లీ: భారతదేశ రక్షణ రంగంలో స్వయం సమృద్ధిని సాధించేందుకు మరో కీలక అడుగు పడింది. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (AICTE), ఇండియన్ డిఫెన్స్ మాన్యుఫాక్చరర్స్ సంఘం (SIDM) సంయుక్తంగా డిఫెన్స్ టెక్నాలజీలో మైనర్ డిగ్రీ కోసం మోడల్ కరికులమ్‌ను విడుదల చేశాయి.
ఈ కొత్త విద్యా కార్యక్రమం ద్వారా ఇంజినీరింగ్ విద్యార్థులకు విమానయాన, నావికా వ్యవస్థలు, సైబర్ సెక్యూరిటీ, అధునాతన పదార్థాలు వంటి రక్షణ రంగానికి సంబంధించిన ప్రత్యేక శిక్షణ అందించనున్నారు. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా ప్రముఖ శాస్త్రవేత్త, డీఆర్‌డీవో మాజీ చైర్మన్ డాక్టర్ జీ సతీష్‌రెడ్డి నేతృత్వంలో ఈ కరికులమ్ తయారైంది.
ఈ కరికులమ్ ప్రకారం.. ఉన్నత రక్షణ సాంకేతికతలపై ప్రత్యేక మాడ్యూల్స్, అలాగే పరిశ్రమలతో భాగస్వామ్యం ద్వారా ప్రాక్టికల్ శిక్షణ అందిస్తారు. తద్వారా విద్యా వ్యవస్థ, పరిశ్రమల మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించి, రక్షణ రంగానికి అవసరమైన నైపుణ్యాలు కలిగిన యువతను తయారు చేయడం లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు.
