ఎమ్మెల్యే గాలి జనార్దన్‌రెడ్డి ఇంటి వద్ద ఫ్లెక్సీలు, బ్యానర్లు కట్టేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే భరత్‌రెడ్డి అనుచరుల యత్నం
అడ్డుకున్న జనార్దన్‌రెడ్డి వర్గం
ఇంతలో భరత్‌రెడ్డి అనుచరుడు సతీష్‌రెడ్డి గన్‌మెన్ కాల్పులు..పరిస్థితి ఉద్రిక్తం
అదుపు చేసేందుకు పోలీసులూ ప్రతిగా కాల్పులు.. కాంగ్రెస్ కార్యకర్త మృతి
ఎమ్మెల్యే గాలి జనార్దన్‌రెడ్డి, శ్రీరాములు, గాలి సోమశేఖరరెడ్డి సహా 11 మందిపై కేసు
సాక్షి, బళ్లారి/శివాజీనగర: ఫ్లెక్సీలు, బ్యానర్లు కట్టడంలో తలెత్తిన వివాదం కర్ణాటక రాష్ట్రం బళ్లారిలో రణరంగానికి దారితీసింది. గంగావతి ఎమ్మెల్యే, మాజీమంత్రి గాలి జనార్దన్‌రెడ్డి, బళ్లారి కాంగ్రెస్ ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి వర్గీయుల మధ్య ఈ వివాదం చెలరేగింది. ఇది చినికి చినికి గాలివానగా మారి చివరకు కాల్పులకు దారితీసింది. కాల్పుల్లో కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్‌రెడ్డి మృతిచెందాడు. స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసిన ఈ ఘటన వివరాలివీ..
స్థానిక ఎస్‌పీ సర్కిల్ వద్ద మహర్షి వాలీ్మకి విగ్రహావిష్కరణ చేయాలని నారా భరత్‌రెడ్డి నిర్ణయించారు. ఇందుకోసం నగరంలో పెద్దఎత్తున ఫ్లెక్సీలు, బ్యానర్లను ఏర్పాటు చేస్తున్నారు. అయితే, గురువారం రాత్రి 8 గంటల సమయంలో గాలి జనార్దన్‌రెడ్డి ఇంటి ముందు కూడా బ్యానర్ కట్టాలని భరత్‌రెడ్డి అనుచరుడు, కాంట్రాక్టరు సతీ‹Ùరెడ్డి మరికొందరు వెళ్లారు. గాలి జనార్దన్‌రెడ్డి అనుచరులు వారిని అడ్డుకున్నారు. ఇక్కడ బ్యానర్ ఎందుకు కడుతున్నారని ప్రశి్నంచారు. ఇదే విషయాన్ని జనార్ధన్‌రెడ్డి కూడా వారికి చెప్పి బళ్లారి నుంచి గంగావతికి వెళ్లిపోయారు. కానీ, సతీష్‌రెడ్డి అక్కడే ఉండి బ్యానర్ కట్టాలని తన అనుచరులను ఆదేశించాడు. ఇది తెలిసి మాజీమంత్రి శ్రీరాములు అక్కడికి వెళ్లి పరిస్థితిని పరిశీలించారు.
పెద్దఎత్తున జనం చేరడంతో గాలి జనార్దన్‌రెడ్డి రాత్రికి బళ్లారిలోని తన ఇంటికి చేరుకున్నారు. అదే సమయంలో బీజేపీ–కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరడంతో పరిస్థితి వేడెక్కింది. అంతలోనే ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. దీంతో..సతీ‹Ùరెడ్డి ప్రైవేటు గన్‌మెన్ తన తుపాకీతో కాల్పులు జరిపాడు. అంతే.. వందలాది మంది పోలీసులు, వేలాది మంది ఇరు పారీ్టలకు చెందిన కార్యకర్తలు అక్కడకు చేరుకున్నారు. పరిస్థితిని అదుపుచేసేందుకు పోలీసులు ఎనిమిది రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్‌రెడ్డి అక్కడికక్కడే చనిపోయాడు.
ప్రైవేట్ వ్యక్తి కాల్పులవల్లే మరణం..
పోలీసులు గాలి జనార్దన్‌రెడ్డి, శ్రీరాములు, గాలి సోమశేఖరరెడ్డికి ఉన్న మొత్తం ఏడుగురు గన్‌మెన్లను పిలిపించి విచారణ జరిపారు.ఈ కాల్పులు జరిపింది ప్రభుత్వం నియమించిన గన్‌మెన్లు కాదని తేల్చారు. అక్కడ ప్రైవేటు వ్యక్తి జరిపిన కాల్పులవల్లే రాజశేఖర్‌రెడ్డి మృతిచెందినట్లు ఇన్‌చార్జి ఎస్పీ రంజిత్ బండారి వెల్లడించారు. ఇదిలా ఉంటే.. ఎమ్మెల్యే గాలి జనార్దన్‌రెడ్డి, శ్రీరాములు, గాలి సోమశేఖరరెడ్డి తదితర 11 మందిపై పోలీసులు కేసు నమోదుచేశారు. ఇక కాల్పుల ఘటనపై విచారణ జరిపి తనకు నివేదిక ఇవ్వాలని సీఎం సిద్దరామయ్య ఆదేశించారు.
నన్ను చంపాలని కుట్రపన్నారు: జనార్దన్‌రెడ్డి
తన ఇంటిపై దాడులు చేసి గొడవలు సృష్టిస్తే పేరు, గుర్తింపు వస్తుందనే ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి తనను అంతమొందించేందుకే కాల్పులు జరిపించారని గంగావతి బీజేపీ ఎమ్మెల్యే గాలి జనార్దన్‌రెడ్డి ఆరోపించారు. తన ఇంటి ముందుకొచ్చి గొడవ సృష్టించి.. కాల్పులు జరిపింది ఎవరో మీడియాలో కళ్లకు కట్టినట్లుగా ఉందన్నారు. 25–30 ఏళ్ల క్రితం నారా భరత్‌రెడ్డి తండ్రి నారా సూర్యనారాయణరెడ్డిది ఫ్యాక్షన్ మనస్తత్వమని ఆయన గుర్తుచేశారు. తన నివాసంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాల్పుల్లో ఓ యువకుడు మృతిచెందిన ఘటనలో ఆ తండ్రీకొడుకులు ఇద్దరినీ అరెస్టుచేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే అనుచరుడు సతీ‹Ùరెడ్డి గన్‌మెన్ కాల్పులు జరపడంవల్లే యువకుడు మృతిచెందాడని, సిట్టింగ్ న్యాయమూర్తి లేదా సీబీఐతో విచారణ జరిపించాలని కోరారు.
బాధ్యతలు స్వీకరించిన కొద్ది గంటల్లోనే.. బళ్లారి ఎస్పీ సస్పెన్షన్
జిల్లా ఎస్పీగా పవన్ నిజ్జుర్ బాధ్యతలు స్వీకరించిన కొన్ని గంటల్లోనే సస్పెన్షన్‌కు గురయ్యారు. బళ్లారిలో కాల్పుల ఘటన జరగడంతో ప్రభుత్వం ఆగ్రహించి ఆయన్ను సస్పెండ్ చేసింది.


