బెంగళూరు: బళ్లారి ఎస్పీ పవన్ నిజ్జూర్ ఆత్మహత్యాయత్నం చేశారు. తుముకూరులో నిద్ర మాత్రలు మింగారు ఐపీఎస్ అధికారి పవన్ నిజ్జూర్. బళ్లారి అల్లర్ల వ్యవహారంలో ఎస్పీ పవన్ నిజ్జూర్‌ను సస్పెండ్ చేసింది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో తుముకూరులోని ఓ ఫాం హౌస్ లో ఆత్మహత్య యత్నం చేసిన ఎస్పీ పవన్ నిజ్జూర్. ప్రస్తుతం ఆయన్ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
కాగా, ఫ్లెక్సీలు, బ్యానర్లు కట్టడంలో తలెత్తిన వివాదం కర్ణాటక రాష్ట్రం బళ్లారిలో రణరంగానికి దారితీసింది. గంగావతి ఎమ్మెల్యే.. మాజీమంత్రి గాలి జనార్దన్‌రెడ్డి, బళ్లారి కాంగ్రెస్ ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి వర్గీయుల మధ్య ఈ వివాదం చెలరేగింది. ఇది చినికి చినికి గాలివానగా మారి చివరకు కాల్పులకు దారితీసింది. కాల్పుల్లో ఒకరు మరణించగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన నేపథ్యంలో 144 సెక్షన్ విధించగా.. ఇవాళ జరగాల్సిన వాల్మీకి మహర్షి విగ్రహావిష్కరణ కార్యక్రమం వాయిదా వేశారు.
ఈ ఘటనకు బాధ్యుడ్ని చేస్తూ బళ్లారి ఎస్పీ పవన్ నిజ్జూర్ సస్పెన్షన్ వేటు వేసింది కర్ణాటక ప్రభుత్వం. కాల్పుల్లో ఒకరు మరణించడం.. మరొకరు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుండడం.. వెరసి సకాలంలో కఠిన చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని ప్రభుత్వం ఆయనపై ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. అయితే గురువారమే ఆయన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించగా.. ఛార్జ్ తీసుకున్న కొన్ని గంటల్లోనే సస్పెండ్ కావడంపై పోలీసు వర్గాల్లో చర్చ నడుస్తోంది.
మరోవైపు.. గాలి జనార్ధన్ రెడ్డి ఇంటి వద్ద జరిగిన పరిణామాలపై ఇటు కాంగ్రెస్ ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డిపైనా కేసు నమోదు అయ్యింది. భరత్‌తో పాటు 40 మంది కాంగ్రెస్ కార్యకర్తలపైనా కేసు నమోదు అయినట్లు సమాచారం. ఇప్పటికే ఈ వ్యవహారంలో గాలి జనార్దన్‌తో పాటు 11 మంది బీజేపీ నేతలపైనా కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. ఇక కాల్పుల ఘటనను తీవ్రంగా పరిగణించిన సీఎం సిద్ధరామయ్య.. సమగ్ర విచారణ జరిపి తనకు నివేదిక ఇవ్వాలని పోలీస్ శాఖను ఆదేశించారు. ఈ క్రమంలో ఎస్పీ నిజ్జూర్ ఆత్మహత్యాయత్నం చేయడం చర్చనీయాంశమైంది.


