బెంగళూరు: రాజకీయ ఘర్షణలు.. ఇరు వర్గాల గన్ ఫైట్‌తో కర్ణాటక బళ్లారిలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్థానిక ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి అనుచరులు, గంగావతి బీజేపీ ఎమ్మెల్యే.. మాజీమంత్రి గాలి జనార్దన్‌రెడ్డి వర్గీయుల మధ్య ఫ్లెక్సీ ఏర్పాటు విషయంలో వివాదం చెలరేగింది. అది చిలికి చిలికి గాలివానగా మారి.. కాంగ్రెస్-గాలి వర్గీయులు పరస్పరం దాడులకు దిగారు. ఇది కాల్పులకు దారి తీయడంతో ఒకరు మృతి చెందారు.
బళ్లారిలోని గాలి జనార్దన్‌రెడ్డి నివాసం వద్ద గురువారం రాత్రి కాంగ్రెస్-బీజేపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. అనంతరం జరిగిన కాల్పుల్లో ఒకరు మరణించగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఇది తనపై జరిగిన హత్యాయత్నమేనని, తాను తృటిలో తప్పించుకున్నానని గాలి జనార్దన్ అంటున్నారు. అయితే ఆ అవసరం తనకు లేదని.. గాలి జనార్దన్ జరిపిన కాల్పుల వల్లే కాంగ్రెస్ కార్యకర్త మృతి చెందాడని భరత్‌రెడ్డి కౌంటర్ ఇస్తున్నారు. పరిస్థితి తీవ్ర ఉద్రిక్తతంగా మారడంతో బళ్లారి సిటీలో భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు.
గాలి జనార్దన్‌పై కేసు
గొడవ జరిగినపుడు ఎమ్మెల్యే భరత్‌రెడ్డి ఊరిలో లేరు. గొడవ గురించి తెలుసుకుని బళ్లారి వచ్చారు. అనుచరులతో ఎస్పీ సర్కిల్‌కు చేరుకుని ఘటన గురించి ఆరా తీశారు. ఇరువర్గాలు మొత్తం 8 రౌండ్ల కాల్పులు జరిపినట్లు పోలీసులు చెబుతున్నారు. మృతి చెందిన వ్యక్తిని కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్‌గా నిర్ధారించారు. ఈ కాల్పుల్లో సతీష్‌రెడ్డికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స కోసం బెంగళూరుకు తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనతో బళ్లారిలో ఉద్రిక్తతలు తలెత్తకుండా పోలీసులు 144 సెక్షన్ విధించి.. అదనపు బలగాలు మోహరించారు. కాల్పుల ఘటనపై బ్రూస్‌పేట పీఎస్‌లో కేసు నమోదు అయ్యింది. జనార్ధన్‌రెడ్డి, శ్రీరాములు, సోమశేఖర్ రెడ్డి సహా 11మంది పేర్లను నిందితులుగా చేర్చారు.
నారా వర్సెస్ గాలి
గన్‌ఫైట్.. బళ్లారిలో హైటెన్షన్ వేళ నారా భరత్‌రెడ్డి, గాలి జనార్దన్‌రెడ్డి పరస్పరం మాటల తుటాలు పేల్చారు. ‘‘గురువారం ఉదయం ఇంటి ఆవరణలో బ్యానర్లు కట్టారని తమ సెక్యూరిటీ గార్డ్ మా దృష్టికి తీసుకొచ్చాడు. అనంతరం బ్యానర్ పడిపోయింది. దీనిపై క్షమాపణ చెప్పి బ్యానర్ కడుతామని చెప్పాం. అయినా వినకుండా నా ఇంటి ముందు రహదారిపై ఎమ్మెల్యే ఆప్తుడు సతీష్‌రెడ్డి, చానాళ్ శేఖర్ కుర్చీ వేసుకుని కూర్చున్నారు. వారితో పాటు కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఘర్షణలో ఇంటిపై రాళ్లు విసిరారు. సరిగ్గా నేను గంగావతి నుంచి వచ్చే సమయంలో సతీష్‌రెడ్డి భద్రతా సిబ్బంది కాల్పులు జరిపారు. బీజేపీ ప్రభుత్వంలోనే రూ.8 కోట్లతో వాల్మీకి భవనం నిర్మించాం. ఇప్పటికే వాల్మీకి విగ్రహం ప్రతిష్ఠించినా మళ్లీ ఎందుకని ప్రశ్నించారు. రాజకీయ భవిష్యత్తు లేదని, అభివృద్ధి చేయలేక ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారని గాలి ఆరోపించారు. అయితే..
బళ్లారి నగరంలో వాల్మీకి విగ్రహం ప్రతిష్ఠను శాంతియుతంగా నిర్వహించాలని చూస్తుంటే.. ఈ కార్యక్రమం జరగకుండా చూడాలని ఘర్షణకు పాల్పడుతున్నారని నగర ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి ఆరోపించారు. బ్యానర్ విషయంలో అడ్డుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. వాల్మీకి అజ్జ వారి పాపాలను చూసుకుంటారని తెలిపారు. నాకు 35 ఏళ్లు.. వాళ్లది నా కంటే డబుల్ వయసు. యువకులే శాంతియుతంగా ముందుకు వెళ్తుంటే వయస్సు మీదపడినా వారే రెచ్చగొట్ట్టేలా చేయడం సరికాదన్నారు. ఈఘటనపై చట్టపరంగా ముందుకు వెళ్తామని భరత్ స్పష్టం చేశారు.
ఫ్లెక్సీ వద్దని..
బళ్లారి సిటీ సెంటర్‌లో ఈ నెల 3న మహర్షి వాల్మీకి విగ్రహావిష్కరణ కార్యక్రమం ఉంది. ఈ సందర్భంగా ఊరంతా కాంగ్రెస్ ఎమ్మెల్యే భరత్‌రెడ్డి అనుచరులు ఫ్లెక్సీలు కడుతున్నారు. అయితే హవ్వబావిలో గాలి జనార్దన్ ఇంటి గోడకు ఫ్లెక్సీ కట్టబోతుండగా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో ఎమ్మెల్యే భరత్‌కి సన్నిహితుడైన సతీష్‌రెడ్డి అక్కడికి చేరుకుని వీరంగం సృష్టించారు.
జనార్దన్ ఇంటి ముందు కుర్చీ వేసుకుని మరీ ఫ్లెక్సీ ఏర్పాటు చేయించే ప్రయత్నం చేయబోయారు. విషయం తెలుసుకుని గాలి అనుచరులు, బీజేపీ కార్యకర్తలు అక్కడికి భారీగా చేరుకుని ఆ ప్రయత్నాన్ని అడ్డుకోబోయారు. సరిగ్గా.. అదే సమయంలో గాలి జనార్దన్ అక్కడికి రావడంతో పరిస్థితి ఒక్కసారిగా అదుపు తప్పింది. ఇరువర్గాల మధ్య తీవ్రవాగ్వాదం చోటు చేసుకోవడంతో.. తోపులాట జరిగింది. అయితే గుంపును చెదరగొట్టేందుకు గాలి జనార్దన్ గన్‌మెన్, అటు సతీష్‌రెడ్డి గన్‌మెన్‌లు గాల్లోకి కాల్పలు జరిపారు.
కోపంతో సతీష్‌రెడ్డి తన గన్‌మెన్ తుపాకీ లాక్కుని గాలి జనార్దన్‌రెడ్డి వైపు కాల్పులు జరిపాడు. ప్రతిగా.. గాలి కూడా కాల్పులు జరపడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారినట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. ఈ ఉద్రిక్తతల గురించి తెలుసుకున్న గాలి సన్నిహితుడు.. మాజీ మంత్రి శ్రీరాములు, కంప్లి ఎమ్మెల్యే సురేశ్‌బాబు, గాలి సోమశేఖర్‌రెడ్డి అక్కడకు చేరుకున్నారు. అయితే లాఠీఛార్జి చేసి ఇరు వర్గాలనూ పోలీసులు చెదరగొట్టారు.
నా మర్డర్‌కు స్కెచ్..
ఘటన తర్వాత తనకు తప్పిన ప్రాణాయం గురించి బుల్లెట్‌ను చూపిస్తూ గాలి జనార్దన్ మీడియాతో మాట్లాడారు. తనను చంపేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే భరత్‌రెడ్డి స్కెచ్ వేశారని ఆరోపించారు. అయితే గాలి జనార్దన్‌ను చంపాల్సిన అవసరం తనకు లేదని భరత్ అంటున్నారు. కాంగ్రెస్ కార్యకర్త మృతికి, సతీష్‌రెడ్డి మీద హత్యాయత్నానికిగానూ గాలి జనార్దన్ మీద కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు.



