కమల్ హాసన్‌కు ‘టార్చ్ లైట్’.. ‘ఎంఎన్‌ఎం’లో ఉత్సాహం ఉరకలు | Kamal Haasans MNM gets torchlight symbol for Puducherry polls | Sakshi
Sakshi News home page

కమల్ హాసన్‌కు ‘టార్చ్ లైట్’.. ‘ఎంఎన్‌ఎం’లో ఉత్సాహం ఉరకలు

Feb 17 2026 11:59 AM | Updated on Feb 17 2026 12:23 PM

Kamal Haasans MNM gets torchlight symbol for Puducherry polls

న్యూఢిల్లీ: నటుడు, రాజకీయ నేత కమల్ హాసన్ నేతృత్వంలోని మక్కల్ నీధి మయ్యం (ఎంఎన్‌ఎం) పార్టీకి  కేంద్ర ఎన్నికల సంఘం 'టార్చ్ లైట్' చిహ్నాన్ని కేటాయించింది. రాబోయే పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఈ గుర్తు కేటాయించారు. ఈ గుర్తుపైనే ఎంఎన్ఎం అభ్యర్థులు పోటీ చేస్తారని ఎన్నికల సంఘం అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ విషయాన్ని పార్టీ మీడియా విభాగం  తెలియజేసింది.

త్వరలో జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కోసం మక్కల్ నీధి మయ్యం ఇప్పటికే తన సన్నాహాలను వేగవంతం చేసింది. ఇటీవల చెన్నైలో జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశంలో పార్టీ నేతలు పలు కీలక తీర్మానాలను ఆమోదించారు. ఇందులో భాగంగా ఎన్నికల కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు ప్రత్యేక వార్ రూమ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సమాఖ్య వ్యవస్థ, గ్రామీణ ఉపాధి సంస్కరణలు తదితర కీలక అంశాలపై పార్టీ తన విధానాలను స్పష్టం చేసింది.

2026 ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేయాలనుకునే ఆశావహులు తమ దరఖాస్తులను సమర్పించవచ్చని పార్టీ కార్యవర్గ కమిటీ ప్రకటించింది. అభ్యర్థుల నామినేషన్ రుసుమును రూ. 50,000గా నిర్ణయించారు. ముందస్తుగా అభ్యర్థులను ఖరారు చేయడం ద్వారా నియోజకవర్గాల్లో పార్టీ పట్టు సాధించే అవకాశం ఉంటుందని నేతలు భావిస్తున్నారు.

కమల్ హాసన్ 2018, ఫిబ్రవరి 21న మధురై వేదికగా అవినీతి నిర్మూలన, మతతత్వ వ్యతిరేక ఎజెండాతో మక్కల్ నీధి మయ్యం పార్టీని స్థాపించారు. ఎంఎన్ఎం పార్టీ ప్రస్తుతం డిఎంకె నేతృత్వంలోని కూటమిలో భాగంగా ఉంది. ప్రస్తుతం రాజ్యసభ సభ్యునిగా కమల్ హాసన్  పార్లమెంటులో తన గళాన్ని వినిపిస్తూనే, పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారని సమాచారం.

ఇది కూడా చదవండి: ‘7 సిస్టర్స్‌’పై యూనస్ వివాదాస్పద వ్యాఖ్యలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement